- విజయనగరం ఎంపీ అప్పలనాయుడి ఘనత
- ఢిల్లీ కోటలో తెలుగు ప్రజలకు అండదండలు
- ఎవరు వచ్చినా స్వయంగా ఎంపీ ఆహ్వానం
- వసతి సౌకర్యాలు కల్పిస్తున్న టీడీపీ నేత
సహనం వందే, విజయనగరం:
జీవితం ఒక విశాల రంగస్థలం. ఇక్కడ వేసే ప్రతి అడుగు ఒక కావ్యం కావాలి. అధికారం అంటే అహంకారం కాదు. అది ఒక పవిత్ర బాధ్యత అని నిరూపిస్తున్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. మట్టి వాసనను మరువని ఒక సామాన్యుడు… దేశ రాజధాని నడిబొడ్డున తెలుగుజాతి కీర్తి కిరీటాన్ని ఎగురవేయడం ఒక అద్భుత దృశ్యం. ఇది కేవలం రాజకీయ ప్రస్థానం కాదు… ఒక ఉదాత్తమైన సేవా యజ్ఞం.

సైకిల్ పై సభా ప్రవేశం
అధికారమంటే రథ గజ తురగ పదాతి దళాలు కాదు… ప్రజల పట్ల ఉండే వినయం అని ఆయన నిరూపించారు. పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లడం ద్వారా కలిశెట్టి అప్పలనాయుడు ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. పంచెకట్టుతో రైతుబిడ్డగా సభలో అడుగుపెట్టి తెలుగుదనం ఉట్టిపడేలా చేశారు. తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసి మాతృభాషకు పట్టాభిషేకం చేశారు. గడిచిన రెండేళ్లలో 100 శాతం హాజరు నమోదు చేసి తన కర్తవ్య దీక్షను చాటుకున్నారు.
ఢిల్లీ కోటలో తెలుగు నీడ
దేశ రాజధాని అనే అపరిచిత నగరంలో తెలుగువారికి ఆయనొక ధైర్యమై నిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్యులను స్వయంగా ఆహ్వానించడం ఆయన గొప్ప సంస్కారం. వారి సమస్యలను విని అధికారుల దగ్గరకు తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారు. ఎంపీ పదవిని ప్రజల ముంగిటకు తెచ్చిన ఘనత ఆయనదే. ముంబై నుంచి అండమాన్ నికోబార్ దీవుల దాకా ఎక్కడ తెలుగు జెండా ఉన్నా అక్కడ అండగా నిలుస్తూ తెలుగు ఐక్యతను చాటుతున్నారు.
కుంభమేళాలో సేవా యాగం
ప్రయాగరాజ్ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులకు ఆయన దారి చూపిన దీపమయ్యారు. తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయించి యాత్రికుల కష్టాలను తీర్చారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమన్వయం చేసుకుని భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. భక్తుల ఆకలి తీర్చడానికి భోజన ఏర్పాట్లు చేశారు. ఆపదలో ఉన్న యాత్రికులను అధికారులతో మాట్లాడి రక్షించి ప్రజాప్రతినిధి అంటే సేవకుడని నిరూపించారు.
సముద్ర గర్భాన ప్రాణదాత
మృత్యువు నోట్లో చిక్కుకున్న మత్స్యకారుల పాలిట ఆయన అభయహస్తం అయ్యారు. బంగ్లాదేశ్ సముద్రంలో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను సురక్షితంగా మాతృభూమికి తీసుకువచ్చారు. వారికి ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇతర రాష్ట్రాల్లో ప్రమాదాలకు గురైన తెలుగువారికి తక్షణమే స్పందించి ప్రాణాలు కాపాడారు. భాష, మనుషుల పట్ల ఆయనకున్న అంకితభావం ప్రతి అడుగులో స్పష్టంగా కనిపిస్తుంది.
రాజ్యాంగానికి తెలుగు రూపు
భారత రాజ్యాంగం ప్రతి తెలుగువాడికి అర్థం కావాలన్నది ఆయన తపన. అందుకే ఇంగ్లీష్‌లోని రాజ్యాంగాన్ని తెలుగులోకి అనువదించే మహత్కార్యానికి పూనుకున్నారు. స్పీకర్ సహకారంతో ఈ చారిత్రక విజయాన్ని సాధించారు. పార్లమెంట్‌లో తెలుగులోనే అత్యధిక ప్రశ్నలు సంధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఉగాది పండుగ నాడు పార్లమెంట్‌కు సెలవు ప్రకటించేలా చేసి తెలుగు సంస్కృతికి భారత రాజధానిలో అరుదైన గౌరవం తీసుకువచ్చారు.
గోవు దానం… మోడీ ప్రశంసలు
అప్పలనాయుడు సరికొత్త ఆలోచనలను చూసి ప్రధాని నరేంద్ర మోడీ సైతం కితాబు ఇచ్చారు. ఆయన సమయస్ఫూర్తిని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ముగ్గురు పిల్లలున్న దంపతులకు ఆవు, దూడను అందజేస్తున్నారు. ఉపాధ్యాయుల పోరాటాలకు, కరెన్సీపై అంబేద్కర్ బొమ్మ ఉండాలనే ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రయాణం కాదు… ఒక సామాన్యుడు రాస్తున్న సేవా చరిత్ర.