- ‘క్లాడ్’ వ్యూహరచనతో ఇరాన్ కకావికలం
- అమెరికా గెలుపు రాస్తున్న సిలికాన్ చిప్పులు
- ఎవరి దగ్గర ఏఐ ఉంటే వారిదే రాజ్యం
- యుద్ధవీరుడికి ఇప్పుడు ల్యాప్‌టాప్ చాలు
- రహస్యం దాచే శక్తి నేడు ఏ దేశానికీ లేదు
- ఏ దేశం నుంచైనా శత్రువును దెబ్బ కొట్టవచ్చు
- కోడ్ లైన్ ఒక్కటి చాలు నేల కదిలిపోతుంది
- మనిషి లేని ఆధునిక యుద్ధం మొదలైంది
- సెకన్లలో శత్రు జాడ… మారిన యుద్ధతంత్రం
- కండబలం కంటే కంప్యూటర్ బలమే ముఖ్యం
సహనం వందే, హైదరాబాద్:
యుద్ధ రంగంలో మనిషి వేగాన్ని యంత్రం అధిగమించింది. గగనతలం నుంచి వచ్చే వేలాది నిఘా వీడియోలను విశ్లేషించడానికి గతంలో వందలాది మంది సైనికులు అవసరమయ్యేవారు. కానీ ఇప్పుడు ఏఐ కేవలం సెకన్లలోనే ఆ పనిని పూర్తి చేస్తోంది. ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల్లో ఇదే జరిగింది. అగ్రరాజ్యం వాడిన అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు యుద్ధాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం కొన్ని గంటల్లో వేలాది లక్ష్యాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయడం వెనుక ఉన్న ఆ రహస్యమే ‘మావెన్ స్మార్ట్ సిస్టమ్’.

మావెన్ స్మార్ట్ సిస్టమ్ అంటే ఏమిటి?
ఇది అమెరికా రక్షణ శాఖ అభివృద్ధి చేసిన ఒక భారీ ఏఐ నెట్‌వర్క్. ఇది యుద్ధ భూమిలో మన కళ్ళకు కనిపించని వివరాలను కూడా విశ్లేషిస్తుంది. ఉపగ్రహాలు, డ్రోన్లు, విమానాల నుంచి వచ్చే సమాచారాన్ని ఒకే చోట చేర్చి శత్రువుల కదలికలను ట్రాక్ చేస్తుంది. దీనికి పలంతిర్ సంస్థ అభివృద్ధి చేసిన ‘గోథమ్’ అనే ప్లాట్‌ఫామ్ తోడైంది. గోథమ్ అంటే ఒక రకమైన డిజిటల్ సెంట్రీ. ఇది గజిబిజిగా ఉండే డేటాను విశ్లేషించి అందులో శత్రువుల ఆయుధ నిల్వలు ఎక్కడ ఉన్నాయి… ట్యాంకులు ఎటు వెళ్తున్నాయన్నది స్పష్టంగా స్క్రీన్ మీద చూపిస్తుంది.
క్లాడ్ ఏఐ వ్యూహరచన
ఈ ఆపరేషన్‌లో ఆంత్రోపిక్ సంస్థ రూపొందించిన ‘క్లాడ్’ అనే ఏఐ టూల్ కీలక పాత్ర పోషించింది. పలంతిర్ గోథమ్ అందించిన డేటాను క్లాడ్ విశ్లేషించి సైన్యానికి సలహాలు ఇస్తుంది. ఎక్కడ దాడి చేస్తే శత్రువు బలం తగ్గుతుంది… ఏ సమయంలో బాంబులు వేయాలనే అంశాలను ఇది వివరిస్తుంది. అంటే గోథమ్ అనేది శత్రువును గుర్తిస్తే… క్లాడ్ ఆ శత్రువును ఎలా దెబ్బతీయాలనే వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది. ఈ రెండు టెక్నాలజీల కలయిక వల్లే టార్గెట్లను రీచ్ అవ్వడం సాధ్యమైంది.
మూడు ఏఐలతో డిజిటల్ గ్రిడ్
ఇరాన్ పై జరిగిన ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కూడా తన వంతు సహకారం అందించింది. ఇజ్రాయెల్ వాడుతున్న ‘గాస్పెల్’ అనే ఏఐ టూల్ అమెరికా వ్యవస్థలతో జతకట్టింది. గాస్పెల్ అనేది ఒక టార్గెట్ ఫ్యాక్టరీ లాంటిది. ఇది అత్యంత వేగంగా లక్ష్యాలను సృష్టిస్తుంది. అమెరికా మావెన్, క్లాడ్, ఇజ్రాయెల్ గాస్పెల్ వ్యవస్థలు అన్నీ కలిసి ఒకే డిజిటల్ గ్రిడ్‌గా మారి ఇరాన్ రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. మనుషులు నెలల తరబడి చేసే ప్లానింగ్‌ను ఈ ఏఐ వ్యవస్థలు కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేశాయి.
ఖచ్చితమైన లొకేషన్ కోఆర్డినేట్లు
యుద్ధంలో ఒక తప్పుడు బాంబు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కానీ ఏఐ అందించిన కోఆర్డినేట్ల వల్ల కచ్చితత్వం పెరిగింది. క్లాడ్ ఏఐ నిరంతరం మ్యాపులను అప్‌డేట్ చేస్తూ శత్రువు కదిలిన ప్రతి అడుగును గుర్తిస్తూ వచ్చింది. నిరంతర దాడుల్లో ప్రతి క్షిపణి ఎక్కడ పడాలి అన్నది ముందే నిర్ణయమైంది. దీనివల్ల పొరపాట్లకు తావు లేకుండా ఆపరేషన్ సాగింది. ఆధునిక యుద్ధంలో కండబలం కంటే కంప్యూటర్ బలమే ముఖ్యమని ఈ ఘటన నిరూపించింది.
భవిష్యత్తు యుద్ధాల భయానక రూపం
ఇరాన్ పై జరిగిన ఈ ప్రయోగం కేవలం ఒక ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో యుద్ధాలు పూర్తిగా ఏఐ నియంత్రణలోనే ఉండే అవకాశం ఉంది. ఏఐ వాడకం వల్ల యుద్ధ వేగం ఊహించలేనంతగా పెరిగిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాధించిన ఈ సాంకేతిక విజయం ఇతర దేశాల్లో కూడా ప్రకంపనలు పుట్టిస్తోంది. టెక్నాలజీ రంగంలో వెనుకబడిన దేశాలకు ఇది ఒక హెచ్చరిక లాంటిది. సిలికాన్ చిప్‌లే రేపటి ప్రపంచ విజేతలను నిర్ణయిస్తాయని స్పష్టమవుతోంది.
ఏఐలో పైచేయితోనే ముంగిట్లోకి ప్రపంచం…
అంతర్జాతీయ రాజకీయ మలుపు ఈ ‘ఏఐ యుద్ధం’ ప్రపంచ రాజకీయాలను మార్చేయబోతోంది. టెక్నాలజీ రంగంలో పైచేయి సాధించిన దేశమే ప్రపంచాన్ని ఏలుతుందని స్పష్టమైంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం వెనుక కూడా ఈ ఏఐ ఆధారిత నిఘా ఉంది. రక్షణ రంగంలో ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీల పాత్ర ఇప్పుడు అనివార్యంగా మారింది. భవిష్యత్తులో యుద్ధాలు సరిహద్దుల్లోనే కాకుండా సిలికాన్ చిప్‌లలో కూడా జరుగుతాయని అర్థమవుతోంది.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్