చాట్ జీపీటీలో కోట్ల కిరీటం – ఉద్యోగుల ఖాతాల్లో నోట్ల కట్టలు

Open AI Chat GPT packages by Sam Altman CEO
  • ఓపెన్ ఏఐలో 15 కోట్ల ప్యాకేజీలు
  • ఆ సంస్థ అధినేత ఆల్ట్‌మాన్ దూకుడు
  • సాఫ్ట్‌వేర్ లోకంలో కోట్ల సెన్సేషన్
  • వేతనాల విప్లవం… టెక్కీలకు స్వర్ణయుగం
  • సిలికాన్ వ్యాలీలో నోట్ల పండగ
  • సిబ్బందికి షేర్ల రూపంలోనూ కోట్ల వర్షం
  • ఉద్యోగాలు తీయకుండా ప్యాకేజీలతో రికార్ట్

సహనం వందే, సిలికాన్ వ్యాలీ:

ప్రపంచాన్ని తన అరచేతిలోకి తెచ్చిన చాట్ జీపీటీలో కోట్ల వర్షం కురుస్తుంది. దాని సృష్టికర్త ఓపెన్ ఏఐ ఇప్పుడు జీతాల విషయంలోనూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. టెక్ ప్రపంచంలో గూగుల్, మెటా వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి తన ఉద్యోగులకు కళ్లుచెదిరే వేతనాలు అందిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠినమైన వీసా ఆంక్షలు, 84 లక్షల రూపాయల భారీ ఫీజులను సైతం బేఖాతరు చేస్తూ ప్రపంచవ్యాప్త ప్రతిభను ఈ సంస్థ కోట్లు పోసి సొంతం చేసుకుంటోంది.

Chat GPT Packages

ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?
చాట్ జీపీటీ కంపెనీలో పనిచేసే సగటు ఉద్యోగి సంపాదన వింటే సామాన్య టెక్ నిపుణులకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక్కడ పనిచేసే 4,000 మంది ఉద్యోగులకు కేవలం మూల వేతనమే కాకుండా సగటున 12.60 కోట్ల రూపాయల విలువైన కంపెనీ షేర్లను (స్టాక్) అదనంగా ఇస్తున్నారు. అంటే ఏడాదికి ఒక్కో ఉద్యోగికి చేతికి అందే మొత్తం దాదాపు 15 కోట్ల రూపాయల పైమాటే. సిలికాన్ వ్యాలీలోనే అత్యధిక వేతనం ఇచ్చే సంస్థగా ఇప్పుడు ఇది రికార్డు సృష్టించింది.

పరిశోధకుల వేతనాలు ఆకాశంలో
ఏఐని మరింత శక్తివంతంగా మార్చే రీసెర్చ్ సైంటిస్టులకు ఈ కంపెనీలో పట్టాభిషేకం చేస్తున్నారు. వీరికి ఏడాదికి 2.05 కోట్ల రూపాయల నుండి ఏకంగా 5.75 కోట్ల రూపాయల వరకు బేసిక్ శాలరీ ఇస్తున్నారు. అంటే నెలకు సుమారు 48 లక్షల రూపాయల వరకు జీతం లభిస్తోంది. ఏఐ సిస్టమ్స్ ఇంజనీర్లకు కూడా ఏడాదికి 2.05 కోట్ల నుండి 3.86 కోట్ల రూపాయల వరకు ప్యాకేజీలు అందుతున్నాయి. కేవలం ఐదు నుంచి పదేళ్ల అనుభవం ఉన్న వారికే ఈ స్థాయి వేతనాలు దక్కుతున్నాయి.

సాఫ్ట్‌వేర్… డేటా నిపుణులకి పండగే
టెక్నాలజీ విభాగంలోని సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు ఏడాదికి 2.73 కోట్ల రూపాయలు స్థిరంగా అందుతున్నాయి. ఇక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్యాకేజీలు 1.42 కోట్ల రూపాయల నుండి మొదలై 4.11 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. హార్డ్‌వేర్ నిపుణులకు 2.10 కోట్ల నుండి 4.66 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. డేటా సైన్స్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేసే వారికి కనిష్టంగా 2.14 కోట్ల రూపాయల ప్యాకేజీని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

మార్కెటింగ్… మేనేజ్‌మెంట్ కోట్లు
కేవలం కోడింగ్ చేసే వారికే కాదు… సంస్థను నడిపించే ఇతర విభాగాలకు కూడా భారీగానే ముట్టజెబుతున్నారు. సేల్స్, గో-టు-మార్కెట్ విభాగంలోని వారికి ఏడాదికి 1.51 కోట్ల రూపాయల నుండి 2.43 కోట్ల రూపాయల వరకు ఇస్తున్నారు. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, డిజైన్ విభాగంలో ఉండేవారికి 1.76 కోట్ల నుండి 2.73 కోట్ల రూపాయల వరకు లభిస్తోంది. ఫైనాన్స్ విభాగంలో పనిచేసే వారికి సైతం ఏడాదికి 2.18 కోట్ల రూపాయల వరకు జీతం ఇస్తున్నారు.

వీసా ఫీజులను లెక్కచేయని శామ్ ఆల్ట్‌మాన్
విదేశీ ఉద్యోగుల హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ట్రంప్ ప్రభుత్వం 84 లక్షల రూపాయల ఫీజు విధించినా కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ వెనక్కి తగ్గలేదు. 2025 చివరి మూడు నెలల్లో 60 మందికి పైగా విదేశీ నిపుణులను భారీ ఖర్చుతో నియమించుకున్నారు. పీటర్ స్టెయిన్‌బర్గర్ వంటి ఏఐ దిగ్గజాల చేరికతో ఈ వేతన యుద్ధం మరింత ముదిరింది. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులను తమ వైపు తిప్పుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా చాట్ జీపీటీ కంపెనీ సిద్ధంగా ఉంది.

మానవ మేధస్సుకు పెరిగిన విలువ…
చాట్ జీపీటీ కంపెనీ వ్యూహాన్ని గమనిస్తే, భవిష్యత్తులో ఏఐ రంగంలో ఎదురులేని శక్తిగా ఎదగడమే లక్ష్యంగా కనిపిస్తోంది. టెక్ పరిశ్రమలో మిగిలిన కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తీసివేస్తుంటే… ఈ సంస్థ మాత్రం కోట్ల రూపాయల జీతాలతో మేధావులను ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఒక కంపెనీ ఎదుగుదల కాదు… కృత్రిమ మేధస్సు ప్రపంచంలో మానవ మేధస్సుకు పెరిగిన విలువకు నిదర్శనం.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *