- 439 తర్వాత 21 సున్నాల కిలోమీటర్ల దూరం
- అంటే 439,000000000000000000000
- విశ్వం అంచున కొలువుతీరి ఉందని వెల్లడి
- కాస్మిక్ సరిహద్దు సిద్ధాంతంతో వెలుగులోకి
- ఆధ్యాత్మికతకు భౌతికశాస్త్రం వెన్నుదన్ను
- కాలం ఆగిపోయే చోటే కైలాసం చిరునామా
సహనం వందే, హైదరాబాద్:
విశ్వం ఎంత విశాలమో మనందరికీ తెలుసు. కానీ స్వర్గం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త దాని అడ్రస్ కనిపెట్టానని చెబుతున్నారు. ఇది ఖగోళ శాస్త్రంలో కొత్త చర్చకు దారితీసింది. కాస్మిక్ హారిజన్ దాటితే స్వర్గం కనిపిస్తుందని ఆయన వాదన. మతానికి, విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న గీతను ఈ సిద్ధాంతం చెరిపేస్తోంది.

మైఖేల్ గిల్లెన్ సంచలనం
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేసిన మైఖేల్ గిల్లెన్ ఒక కొత్త ప్రతిపాదన చేశారు. స్వర్గం అనేది ఊహాజనిత ప్రదేశం కాదు… అది భౌతిక విశ్వంలోనే ఉందని ఆయన అంటున్నారు. కాస్మిక్ హారిజన్ అవతలి వైపు ఈ స్వర్గం ఉండవచ్చని ఆయన ఒక కథనంలో రాశారు. మనం చూడగలిగే విశ్వానికి వెలుపల ఒక అద్భుత ప్రపంచం ఉందని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ సిద్ధాంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల మధ్య వేడి పుట్టిస్తోంది.
కాస్మిక్ హారిజన్ గుట్టు…
విశ్వానికి ఒక కనిపించని గోడ ఉంది. దానినే కాస్మిక్ హారిజన్ అంటారు. మైఖేల్ గిల్లెన్ ప్రకారం ఈ సరిహద్దు అవతలే స్వర్గం ఉంది. హబుల్ సిద్ధాంతం ప్రకారం గెలాక్సీలు మన నుండి దూరంగా పారిపోతున్నాయి. ఈ దూరం ఎంతంటే… అక్కడి నుండి కాంతి కూడా మనల్ని చేరుకోలేదు. మనం చూడలేకపోయినంత మాత్రాన అక్కడ ప్రపంచం లేదని కాదని మైఖేల్ స్పష్టం చేస్తున్నారు.
అంతుచిక్కని అంకెల దూరం
మీరు ఈ స్వర్గానికి వెళ్లాలంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలో తెలుసా? 439 బిలియన్ ట్రిలియన్ కిలోమీటర్లు. దీనిని సాధారణ అంకెల్లో చెప్పాలంటే 43,900 కోట్ల కోట్ల కోట్ల కిలోమీటర్లు. అంటే 439 తర్వాత 21 సున్నాలు పెట్టాలి. ఒకవేళ మనం సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతి వేగంతో వెళ్లినా అక్కడికి చేరడానికి వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇది మానవ ఊహకు అందని సుదూర తీరం.
కాలం ఆగిపోయే చోటు
స్వర్గంలో కాలం ఉండదని పురాణాలు చెబుతాయి. దీనికి ఐన్‌స్టీన్ సాపేక్షత సిద్ధాంతాన్ని మైఖేల్ ముడిపెట్టారు. కాస్మిక్ హారిజన్ వద్ద సమయం స్తంభించిపోతుందని ఆయన వాదిస్తున్నారు. అక్కడ గతం.. వర్తమానం.. భవిష్యత్తు అనేవి ఉండవు. అంతా నిశ్చలంగా ఉంటుంది. ఇలాంటి స్థితి కేవలం స్వర్గంలోనే సాధ్యమని నమ్ముతున్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్ బాంగ్ కంటే ముందే అక్కడ వస్తువులు ఉండి ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు.
వ్యతిరేకిస్తున్న శాస్త్రవేత్తలు
మైఖేల్ గిల్లెన్ వాదనలను తోటి శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. కనెక్టికట్ కాలేజీకి చెందిన అలెక్స్ జియానినాస్ దీనిని కేవలం ఊహగా కొట్టిపారేశారు. కాస్మిక్ హారిజన్ అనేది ఒక భౌతిక ప్రదేశం కాదని ఆయన అంటున్నారు. అది కేవలం మనం చూడగలిగే గరిష్ట దూరం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇది సైన్స్ కాదని… మెటాఫిజిక్స్ లేదా మతపరమైన అంశమని ఆయన విమర్శిస్తున్నారు. స్వర్గం అనే దానికి భౌతిక ఆధారాలు లేవని ఆయన వాదన. ఆధ్యాత్మికతను సైన్స్‌తో కలపడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని విమర్శకులు అంటున్నారు. ఏది ఏమైనా విశ్వం వెలుపల ఏదో ఉందని మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు.
చేరలేని గమ్యం
మనం ఎంత వేగంగా ప్రయాణించినా ఆ అంచును తాకలేం. ఎందుకంటే విశ్వం మనకంటే వేగంగా విస్తరిస్తోంది. మనం ఒక అడుగు వేస్తే విశ్వం రెండు అడుగులు ముందుకు వెళ్తోంది. అందుకే ఆ స్వర్గం మనకు ఎప్పటికీ అందని ద్రాక్షే. స్వర్గం ఉందో లేదో తెలియదు కానీ… ఈ విశాల విశ్వంలో మనం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని ఈ చర్చ నిరూపిస్తోంది. భూమి అనే చిన్న గూడు దాటి మనిషి ఆలోచనలు అనంత విశ్వంలోకి దూసుకెళ్తున్నాయి.