నేషనల్ క్రష్… రౌడీ ఖుష్ – 26న రష్మిక, విజయ్.. పెళ్లి బాజా!

Vijay Rashmika Marriage
  • ఉదయ్‌పూర్‌లో రాయల్ వెడ్డింగ్
  • ఫోన్లకు అసలు అనుమతేలేదు
  • అతిథుల జాబితా చాలా తక్కువ

సహనం వందే, హైదరాబాద్:

వెండితెరపై మెరిసిన ప్రేమ ఇప్పుడు నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ వివాహానికి ముహూర్తం ఖరారైంది. రాజస్థాన్‌లోని రాజసం ఉట్టిపడే ఉదయ్‌పూర్ వేదికగా ఈ వేడుక జరగనుంది. అత్యంత రహస్యంగా, కఠిన నిబంధనల మధ్య ఈ జంట ఒక ఇంటివారు కాబోతున్నారు.

ఉదయ్‌పూర్‌లో ఏడడుగుల వేడుక
విజయ్, రష్మిక వివాహం ఈ నెల 26న జరగనుంది. దీనికోసం ఉదయ్‌పూర్‌లోని మొమెంటోస్ బై ఐటీసీ హోటల్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆరావళి కొండల మధ్య ఉన్న ఈ హోటల్… నగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో 117 సూట్లు, విల్లాలు ఉన్నాయి. విలాసవంతమైన ఈ వేదికపై కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరుగుతుంది. ఈ పెళ్లి కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

భద్రతలో రాజీ లేదు
ఈ వివాహం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుకలో పాల్గొనే వారెవరూ ఫోన్లు వాడకూడదని నిబంధన విధించారు. పెళ్లికి వచ్చే సిబ్బంది అందరితో నాన్ డిస్ క్లోజర్ ఒప్పందాలపై సంతకాలు చేయించుకున్నారు. ఈ ఏర్పాట్లు గతంలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహాన్ని తలపిస్తున్నాయి. మీడియాకు కూడా వేడుకకు దూరంగా ఉంచాలని నిర్ణయించారు. ఇది ఒక అత్యంత వ్యక్తిగత వ్యవహారంగా ఉంచాలని ఈ జంట భావిస్తోంది.

గీత గోవిందం నుండి మొదలు
వీరి ప్రేమాయణం గీత గోవిందం సెట్స్ లోనే మొదలైందని ప్రచారం ఉంది. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసి నటించారు. అప్పటి నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నా ఎప్పుడూ బహిరంగంగా ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఆ పుకార్లన్నీ నిజం చేస్తూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో వీరి పెళ్లి వార్తను పండుగలా జరుపుకుంటున్నారు.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
ఉదయ్‌పూర్‌లో పెళ్లి ముగిశాక మార్చి 4న హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ హాజరయ్యే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ నివాసం వద్ద ఇప్పటికే పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. సినీ లోకమంతా ఇప్పుడు ఈ పెళ్లి కోసమే ఎదురుచూస్తోంది. టాలీవుడ్‌లో మాత్రం రష్మిక, విజయ్ పెళ్లి వార్తలే షేక్ చేస్తున్నాయి. వివాదాలు, పుకార్లను పక్కన పెట్టి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ జంట సిద్ధమైంది.

అభిమానుల నిరీక్షణకు తెర
రష్మిక, విజయ్ జంటను స్క్రీన్ పై చూడటం అంటే అభిమానులకు ప్రాణం. ఇప్పుడు వారు నిజ జీవితంలో కూడా ఒకటవుతుండటంతో ఆనందానికి అవధులు లేవు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని గత రెండేళ్లుగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. తమ ఫేవరెట్ జోడీ ఒకటవుతుండటంతో అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. 26న ఈ స్టార్ యూనియన్ జరగబోతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *