- రహస్య పెళ్లి రిజిస్ట్రేషన్ మరింత కఠినం
- తల్లిదండ్రుల అనుమతి లేకుంటే రద్దు
- గుజరాత్ వివాహ చట్టంలో సంచలనం మార్పు
- లవ్ జిహాద్ సాంస్కృతిక దండయాత్రకు చెక్
- అమ్మాయిల భద్రతే ప్రాధాన్యమన్న ప్రభుత్వం
సహనం వందే, గుజరాత్:
ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు గుజరాత్ లో అది అంత సులభం కాదు. వివాహ రిజిస్ట్రేషన్ నిబంధనలను ప్రభుత్వం సమూలంగా మారుస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సామాజిక కట్టుబాట్లకే పెద్దపీట వేస్తోంది. లోపాలను సరిదిద్దే పేరుతో ప్రేమికులపై ఆంక్షలు విధిస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

వివాహ చట్టం సవరణ
గుజరాత్ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 20) కీలక ప్రకటన చేసింది. వివాహాల రిజిస్ట్రేషన్ చట్టం కింద రూపొందించిన నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లొసుగులను అరికట్టడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వి శాసనసభలో ఈ వివరాలను వెల్లడించారు. అమాయక అమ్మాయిలు మోసపోకుండా కాపాడటమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఇవి చెదపురుగుల్లా వ్యాపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల ప్రమేయం తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం ప్రతి దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్ ముందు సమర్పించాలి. పెళ్లి గురించి తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారో లేదో దరఖాస్తుదారులు స్పష్టం చేయాలి. వధూవరులు తమ తల్లిదండ్రుల పేర్లు, చిరునామాలు ఇవ్వాలి. వారి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లు కూడా జత చేయాలి. దరఖాస్తు అందిన 10 పని దినాలలోపు తల్లిదండ్రులకు సమాచారం చేరుతుంది. అనంతరం వారి ఆమోదం మేరకు పెళ్లి చేస్తారు. దీనివల్ల రహస్య వివాహాలకు చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు మరింత సుదీర్ఘంగా మారనుంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంతృప్తి చెందిన తర్వాతే దరఖాస్తును తాలూకా అధికారికి పంపుతారు. అన్ని నిబంధనలు సక్రమంగా ఉన్నాయని తేలిన 30 రోజుల తర్వాతే వివాహం నమోదవుతుంది. ఈ వివరాలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇలాంటి కఠిన నిబంధనలు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తాయని విమర్శకులు అంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు.
సాంస్కృతిక దండయాత్రపై పోరు
హర్ష్ సంఘ్వి లవ్ జిహాద్ ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు. ఇది ఒక సాంస్కృతిక దండయాత్ర అని ఆయన అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వం దీనిని ఏమాత్రం సహించదని హెచ్చరించారు. సామాజిక సంస్థల విజ్ఞప్తి మేరకే ఈ మార్పులు చేస్తున్నామని చెప్పారు. ఈ లవ్ మ్యారేజ్ నిబంధనలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రజల నుంచి సూచనలు స్వీకరించడానికి 30 రోజుల సమయం ఇచ్చారు.
రాజకీయ నేతల మద్దతు
ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు ఎమ్మెల్యేలు స్వాగతించారు. బీజేపీ ఎమ్మెల్యే లవింగ్ జీ ఠాకూర్ కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిని అభినందించారు. సంఘ విద్రోహ శక్తులు చట్టంలోని లొసుగులను వాడుకుంటున్నారని వారు ఆరోపించారు. అమాయక అమ్మాయిలను ప్రలోభపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు. ఇది ప్రస్తుతం ఉన్న అత్యంత అవసరమైన మార్పు అని శాసనసభలో నేతలు పేర్కొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ మొదలు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చు. ఈ సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే కొత్త చట్టం అమలులోకి వస్తుంది. ఈ నిబంధనల వల్ల ప్రేమ వివాహాలు చేసుకునే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా తల్లిదండ్రులకు నోటీసులు పంపడం వివాదాస్పదంగా మారింది. గుజరాత్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైంది.