ఏఐ ముప్పు… కవితే కనువిప్పు – కవిగా మారిన టెక్ మేధావి మృణాంక్ శర్మ

Techie turns to Poet - AI
  • కోట్ల రూపాయల ఉద్యోగానికి రాజీనామా
  • సాంకేతికతను పక్కన పెట్టి కవితలపై దృష్టి
  • యంత్రాల మధ్య విజ్ఞత కోల్పోతున్న మనిషి
  • మానవత్వంపై ఏఐ దాడి చేస్తుందని ఆవేదన
  • ప్రపంచం వినాశనం అంచున ఉందని వ్యాఖ్య
  • కార్పొరేట్ ప్రపంచంలో విలువలు లేవని ఫైర్
  • కవితలు రచనలతో సమాజం మార్పుపై దృష్టి

సహనం వందే, లండన్:

ప్రపంచం వినాశనం అంచున ఉందంటూ ఒక మేధావి బాంబు పేల్చారు. అగ్రశ్రేణి ఏఐ సంస్థ ఆంత్రోపిక్ కీలక పరిశోధకుడు మృణాంక్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. కోట్లాది రూపాయల జీతాన్ని వదిలేసి కవిత్వం రాయడానికి బ్రిటన్ వెళ్తున్నారు. యంత్రాల వేగం పెరిగి మనిషి విజ్ఞత తగ్గుతోందని ఆయన ఆవేదన చెందారు. టెక్నాలజీ ప్రపంచంలో ఈ నిర్ణయం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది.

ముప్పులో ముల్లోకాలు
బ్రిటన్‌కు చెందిన మృణాంక్ శర్మ అమెరికాలో ఆంత్రోపిక్ సంస్థలో సీనియర్ ఏఐ సేఫ్టీ పరిశోధకుడు. ఏఐ వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదాలపై ఆయన నిరంతరం అధ్యయనం చేసేవారు. కేవలం ఏఐ మాత్రమే కాదు.. బయో వెపన్స్ ద్వారా కూడా మానవాళికి పెను ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు. మన సాంకేతిక తెలివితేటలు పెరుగుతున్నా.. వాటిని నియంత్రించే వివేకం మాత్రం పెరగడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అందుకే ఆయన రాజీనామా లేఖ ఒక కార్పొరేట్ మెమోలా కాకుండా ఒక కవితలా సాగింది.

Techei Against AI

ఏఐ అసలు రూపం
ఆంత్రోపిక్ అనేది అమెరికాకు చెందిన ఒక ఏఐ స్టార్టప్. ఇది క్లాడ్ అనే శక్తివంతమైన ఏఐ మోడళ్లను తయారు చేస్తుంది. తమది అత్యంత సురక్షితమైన ఏఐ అని.. తాము ప్రజల ప్రయోజనం కోసమే పనిచేస్తామని ఈ సంస్థ చెప్పుకుంటుంది. కానీ లోపల జరుగుతున్నది వేరని మృణాంక్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. సంస్థ ఆశయాలకు, ఆచరణకు మధ్య పొంతన లేదని ఆయన విమర్శించారు. వ్యక్తిగత విలువలను కాపాడుకోవడం కార్పొరేట్ ప్రపంచంలో సాధ్యం కావడం లేదని ఆయన వాపోయారు.

కవిత్వమే ఇక శరణ్యం
మృణాంక్ ఇకపై శాస్త్రవేత్తగా కాకుండా ఒక కవిగా జీవించాలనుకుంటున్నారు. రైనర్ మారియా రిల్కే వంటి ప్రసిద్ధ కవుల మాటలను ఆయన తన లేఖలో గుర్తు చేసుకున్నారు. శాస్త్రీయ నిజాల కంటే కవితా సత్యాలే మిన్న అని ఆయన నమ్ముతున్నారు. బ్రిటన్ వెళ్లి అక్కడ కవిత్వం చదవడం.. రచనలు చేయడం.. సామాజిక చైతన్యం తీసుకురావడం వంటి పనులు చేయనున్నారు. యంత్రాల మధ్య యాంత్రికంగా బతకడం కంటే మానవీయ విలువలతో గడపడమే శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నారు.

జీవాయుధాల భయం
మృణాంక్ శర్మ తన పనిలో భాగంగా ఏఐ ద్వారా బయో టెర్రరిజం జరిగే అవకాశాలను పరిశోధించారు. ఏఐ సాయంతో ప్రమాదకరమైన వైరస్‌లు లేదా జీవాయుధాలు తయారు చేయడం ఇప్పుడు చాలా సులభమైపోయిందని ఆయన గుర్తించారు. ఇది అరాచక శక్తుల చేతికి చిక్కితే ప్రపంచం నాశనమవుతుందని ఆయన భయపడుతున్నారు. ఏఐ అనేది మానవత్వం మీద దాడి చేసే ఆయుధంగా మారుతోందని ఆయన విశ్లేషణ.

మార్కెట్ మాయాజాలం
మరోవైపు ఆంత్రోపిక్ సంస్థ ఓపెన్ ఏఐ వంటి ప్రత్యర్థి సంస్థలతో యుద్ధం చేస్తోంది. ఓపెన్ ఏఐ తన ప్లాట్‌ఫారమ్‌లో యాడ్స్ వేయడాన్ని తప్పుబడుతూ ఆంత్రోపిక్ ప్రకటనలు ఇచ్చింది. కానీ సొంత సంస్థలోనే డేటా చోరీ, నైతిక వైఫల్యాలు ఉండటాన్ని మృణాంక్ భరించలేకపోయారు. ప్రజల క్షేమం కంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమైపోయిన చోట తాను ఉండలేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ రాజీనామా ఏఐ భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *