- చెత్తలో బంగారం… నిజాయితీలో సింగారం
- తమిళ తంబి నిజాయితీకి ఎంపీ ఫిదా
- ఫోన్ చేసి అభినందించిన అప్పలనాయుడు
- దురైకి గుర్తింపు కోరుతూ ప్రధానికి ఎంపీ లేఖ
సహనం వందే, న్యూఢిల్లీ:
కటిక పేదరికంలోనూ కల్మషం లేని గుణం ఆయన సొంతం. కళ్లముందు లక్షల విలువైన గోల్డ్ మెరుస్తున్నా ఆశపడని నిబ్బరం ఆయన శ్వాస. కొడుకు ప్రాణం కంటే నిజాయితీనే మిన్నగా భావించిన ఆ పారిశుద్ధ్య కార్మికుడి గాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వార్థం నిండిన లోకంలో మానవత్వపు వెలుగులు విరజిమ్ముతూ దురై సరికొత్త చరిత్రను లిఖించి అందరికీ ఆదర్శప్రాయుడై నిలిచాడు.
కుబేర మనసు…
తమిళనాడు తిరుప్పూరుకు చెందిన దురై నిత్యం చెత్తతో సహవాసం చేస్తాడు. విధుల్లో భాగంగా ఒకరోజు చెత్తను శుభ్రం చేస్తుండగా అద్భుతం జరిగింది. ఏకంగా 180 గ్రాముల బంగారంతోపాటు కిలో వెండి వస్తువులు కంటపడ్డాయి. నేటి కాలంలో ఎవరైనా ఆ నిధిని చూస్తే అదృష్టంగా భావించి దాచుకుంటారు. కానీ దురై మాత్రం అది తన శ్రమతో వచ్చింది కాదని గుర్తించి గొప్ప సంస్కారాన్ని చాటాడు.
కొడుకు ప్రాణం కంటే విలువలే మిన్న…
దురై సొంత కొడుకు ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. బాలుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలంటే భారీగా డబ్బులు అవసరం. చేతిలో చిల్లిగవ్వ లేని దయనీయ స్థితిలో ఆ బంగారం అమ్మితే కొడుకు ప్రాణాలు దక్కుతాయి. కానీ ఆ అడ్డదారి తన రక్తంలోనే లేదని దురై నిరూపించాడు. వెంటనే ఆ ఆభరణాలను పోలీసులకు అప్పగించి అందరినీ విస్మయానికి గురిచేశాడు.

ఎంపీ అప్పలనాయుడు సెల్యూట్
ఈ హృద్యమైన ఘటన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడి దృష్టికి వెళ్లింది. సామాన్యుడిలోని అసామాన్య నిజాయితీకి ఆయన ముగ్ధులయ్యారు. వెంటనే దురై కుటుంబంతో వీడియోకాల్‌లో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. తాను స్వయంగా తమిళనాడు వెళ్లి కలుస్తానని భరోసా ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికుడి గొప్పతనాన్ని వివరిస్తూ సమాజానికి ఇలాంటి వ్యక్తులే అసలైన ఆస్తులని కొనియాడారు.
సాయం కోసం మోదీకి విన్నపం
దురై నిజాయితీని దేశవ్యాప్తంగా గుర్తించాలని ఎంపీ కలిశెట్టి నిర్ణయించారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఒక లేఖ అందించారు. దురై లాంటి నిస్వార్థ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చి గౌరవించాలని అందులో కోరారు. వ్యవస్థలో నిజాయితీ ఇంకా బతికే ఉందనడానికి దురై ఉదహరణ అని ఆయన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఉచిత వైద్యం
దురై కొడుకు అనారోగ్యంపై ఎంపీ కలిశెట్టి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ కుటుంబానికి అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని చాటారు. బాలుడికి అవసరమైన శస్త్రచికిత్సతోపాటు పూర్తి వైద్య సాయాన్ని ఉచితంగా అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ స్థాయిలో ఒక సాధారణ కార్మికుడి సమస్య కోసం ఎంపీ చొరవ చూపడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
స్ఫూర్తి కిరణం
కష్టపడకుండా వచ్చేది ఏదైనా విషంతో సమానమని దురై చేతల్లో చూపాడు. ప్రస్తుత కాలంలో ఇలాంటి సంఘటనలు భావితరాలకు పాఠాలుగా మారుతాయని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. దురై కేవలం కార్మికుడు మాత్రమే కాదు నిజాయితీలో కోటీశ్వరుడని ఆయన అభివర్ణించారు. కష్టాల్లో ఉన్నా ఆత్మగౌరవం వదులుకోని ఆ యోధుడికి బాసటగా నిలవడం మనందరి కనీస ధర్మమని ఎంపీ పిలుపునిచ్చారు.