- ‘స్టాన్‌ఫర్డ్’ విద్యార్థిని సంచలన నిర్ణయం
- చాట్ జీపీటీ వాడకాన్ని నిలిపివేసిన స్టూడెంట్
- ఏఐని వదిలేసి కష్టపడి చదవాలని పిలుపు
సహనం వందే, హైదరాబాద్:
డిగ్రీ చేతికి రావాలంటే కంప్యూటర్ ముందు కూర్చుని చాట్ జీపీటీని అడిగితే చాలు. అసైన్మెంట్లు నుంచి ప్రాజెక్టుల వరకు అన్నీ నిమిషాల్లో సిద్ధం. కానీ ఈ సులభమైన దారి తన మేధస్సును మొద్దుబారుస్తుందని ఆ విద్యార్థిని గుర్తించింది. ప్రపంచం అంతా కృత్రిమ మేధ వెంట పరుగులు తీస్తుంటే ఆమె మాత్రం తన సొంత ఆలోచనలకే పదును పెట్టింది. ఆ విజ్ఞాన ప్రయాణమే ఈ కథనం.

సులభమైన దారి వద్దే వద్దు
స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అంటే ప్రపంచంలోనే అత్యున్నత విద్యాసంస్థ. అక్కడ చదివే రోజానా మారిస్ అరియాస్ అనే విద్యార్థిని ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. తన తోటి విద్యార్థులందరూ హోం వర్క్ కోసం చాట్ జీపీటీని వాడుతుంటే ఆమె మాత్రం దానికి దూరంగా ఉంది. ఏఐ వాడటం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడమేనని ఆమె బలంగా నమ్మింది. అందుకే కష్టమైనా సరే సొంతంగా చదవడం.. రాయడం అలవాటు చేసుకుంది.
మెదడుకు మేత కావాలి…
చదువు అంటే కేవలం మార్కులు తెచ్చుకోవడం కాదు. మన ఆలోచనా పరిధిని పెంచుకోవడం. చాట్ జీపీటీని వాడితే సబ్జెక్టుపై పట్టు రాదని ఆమె వాదన. పుస్తకాలు చదవడం వల్ల కలిగే జ్ఞానం ఏఐ వల్ల రాదు. ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్థినిగా రాతలో మెళకువలు నేర్చుకోవాలని ఆమె ఆశపడింది. అందుకే అడ్డదారులు తొక్కకుండా అక్షరాలతో కుస్తీ పట్టింది.
ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకే
కళాశాలలో చేరిన కొత్తలో రోజానాకు తన రాతపై నమ్మకం ఉండేది కాదు. సరైన పదాలను ఎంచుకోవడం ఆమెకు సవాలుగా ఉండేది. ఆ బలహీనతను పోగొట్టుకోవాలంటే నిరంతరం సాధన చేయాలి. చాట్ జీపీటీ సాయం తీసుకుంటే ఆమె ఎప్పటికీ ఆ నైపుణ్యాన్ని సాధించలేదు. అందుకే ఓటములను ఎదుర్కొంటూనే తనలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకుంది.
దిగ్గజాల అడుగుజాడల్లో
స్టాన్‌ఫర్డ్ క్యాంపస్‌లో జాన్ స్టెయిన్ బెక్ వంటి గొప్ప రచయితలు నడిచిన నేల అది. అలాంటి చోట చదువుతూ యంత్రాల సాయంతో వ్యాసాలు రాయడం ఆ మహనీయులను అవమానించడమేనని ఆమె భావించింది. తనకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్ల మేధస్సును గౌరవించాలని నిర్ణయించుకుంది. కృత్రిమమైన రాతల కంటే సహజమైన ఆలోచనలే గొప్పవని చాటి చెప్పింది.
అవకాశాన్ని వృథా చేయొద్దు
ఎందరో విద్యార్థులు స్టాన్‌ఫర్డ్ లాంటి చోట సీటు కోసం కలలు కంటారు. సీటు దొరకని వారు వేలల్లో ఉంటారు. అలాంటి గొప్ప అవకాశం దక్కినప్పుడు కష్టపడి చదవాలి. దొరికిన సీటును అడ్డం పెట్టుకుని కేవలం చాటింగ్ చేస్తూ కాలం గడపడం సరికాదు. అసైన్మెంట్లు చేయడం అంటే బాధ్యతను నెరవేర్చడం మాత్రమే కాదు.. అది ఒక అభ్యాసం అని ఆమె గుర్తించింది.
శ్రమకు దక్కిన ఫలితం
డిగ్రీ పూర్తయ్యాక ఆమె ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. తన పట్టా వెనుక ఏఐ కష్టం లేదు.. కేవలం తన చెమట మాత్రమే ఉంది. ఇప్పుడు ఆమె చాలా స్పష్టంగా మాట్లాడగలదు.. బలంగా రాయగలదు. ఏఐ వాడని ఆ పట్టుదలే ఆమెను ఇతరుల కంటే భిన్నంగా నిలబెట్టింది. నేటి తరం విద్యార్థులకు రోజానా ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.