- అమ్మాయిలను తార్చడంలో ఆమె దిట్ట
- పెద్దలను రక్షించేందుకు క్షమాభిక్షకు డిమాండ్
- మౌన ముద్రలో ఎప్|స్టీన్ లవర్ మాక్స్‌వెల్
- ట్రంప్ సంతకమే మాక్స్‌వెల్ లక్ష్యం
- బయటపడ్డ బడా బాబుల బాగోతం
- అమెరికా కోర్టుల్లో డర్టీ పాలిటిక్స్
సహనం వందే, అమెరికా:
ప్రపంచాన్ని వణికించిన జెఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి గిస్లాన్ మాక్స్‌వెల్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. జైలు గోడల మధ్య ఉన్న ఈ క్రైమ్ క్వీన్ ఇప్పుడు అమెరికా పార్లమెంటరీ కమిటీకి చుక్కలు చూపిస్తోంది. తన నోరు విప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఆమె వేస్తున్న బేరం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనానికి దారితీసింది.
అసలు ఎవరీ మాక్స్‌వెల్?
బ్రిటిష్ మీడియా మొఘల్ రాబర్ట్ మాక్స్‌వెల్ కుమార్తె అయిన గిస్లాన్ మాక్స్‌వెల్… 1990వ దశకంలో జెఫ్రీ ఎప్|స్టీన్|కు దగ్గరైంది. తొలుత ప్రియురాలిగా ఉన్న ఆమె తర్వాత అతని వ్యాపార భాగస్వామిగా, సెక్స్ రాకెట్ మేనేజర్‌గా మారింది. ఎప్|స్టీన్ విలాసవంతమైన జీవితాన్ని నిర్వహించడంలో ఆమెదే కీలక పాత్ర. 2020లో అరెస్టయిన ఆమెకు 2022లో అమెరికా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమె టెక్సాస్‌లోని ఫెడరల్ జైలులో తన శిక్ష అనుభవిస్తోంది.

సెక్స్ కుంభకోణంలో పాత్ర
ఎప్|స్టీన్ కోసం మైనర్ బాలికలను సరఫరా చేయడంలో మాక్స్‌వెల్ సిద్ధహస్తురాలు. 14 నుంచి 17 ఏళ్ల వయసున్న అమ్మాయిలను ఆకర్షించి వారిని ఎప్|స్టీన్ వద్దకు తీసుకురావడం ఆమె పని. బాలికలకు శిక్షణ ఇచ్చి వారిని లైంగికంగా ప్రోత్సహించేది. ఎప్|స్టీన్ ప్రైవేట్ దీవులకు అగ్రశ్రేణి నాయకులు, బిలియనీర్లు వచ్చినప్పుడు వారికి ఈ బాలికలను అప్పగించే బాధ్యతను ఆమె నిర్వర్తించేది. ఈ క్రూరమైన నేరంలో ఆమెకు ఎప్|స్టీన్ సమానమైన భాగస్వామ్యం ఉంది.
మౌనం వెనుక మర్మం
తాజాగా జరిగిన హౌస్ ఓవర్‌సైట్ కమిటీ విచారణలో మాక్స్‌వెల్ పెదవి విప్పలేదు. ఐదో సవరణ ప్రకారం ఎలాంటి సమాచారం చెప్పనని మొండికేసింది. అయితే ఆమె న్యాయవాది డేవిడ్ ఆస్కార్ మార్కస్ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఒకవేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెకు క్షమాభిక్ష ప్రసాదిస్తేనే ఈ చీకటి సామ్రాజ్యంలో భాగమైన ఇతర ప్రముఖుల పేర్లను బయటపెడతానని కండిషన్ పెట్టారు. అంటే తన స్వేచ్ఛ కోసం ఆమె బడా బాబుల రహస్యాలను తాకట్టు పెడుతోంది.
ట్రంప్ తో ముడిపడిన వివాదం
ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మాక్స్‌వెల్ కోరుతున్నట్లుగా ట్రంప్ క్షమాభిక్ష ఇస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. డెమొక్రాట్లు మాత్రం దీనిపై మండిపడుతున్నారు. ట్రంప్ హయాంలోనే ఎప్|స్టీన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడని… ఇప్పుడు మాక్స్‌వెల్ మౌనం పాటించడం వెనుక ట్రంప్ కు మేలు చేసే ఉద్దేశ్యం ఉందని సుహాస్ సుబ్రహ్మణ్యం వంటి నేతలు ఆరోపిస్తున్నారు. ట్రంప్ ఈ క్షమాభిక్షపై ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
బెంబేలెత్తుతున్న బిజినెస్ దిగ్గజాలు…
మాక్స్‌వెల్ నోరు తెరిస్తే బ్రిటన్ రాజకుటుంబం నుంచి వాల్ స్ట్రీట్ బిలియనీర్ల వరకు అందరి జాతకాలు బయటపడతాయి. ముఖ్యంగా హోవార్డ్ లుట్నిక్ వంటి వ్యాపారవేత్తల పేర్లు తాజా ఫైల్స్ లో వినిపిస్తున్నాయి. ఆమె డైరీలో సుమారు 500 మంది వీఐపీల ఫోన్ నంబర్లు, వారి శృంగార రహస్యాలు ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె చేస్తున్న బేరసారాలు ఆయా ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
ముగింపు లేని పోరాటం
ఎప్|స్టీన్ మరణంతో అతని రహస్యాలన్నీ సమాధి అయ్యాయని భావించారు. కానీ మాక్స్‌వెల్ రూపంలో అవి మళ్లీ సజీవంగా వచ్చాయి. బాధితులకు న్యాయం జరగాలంటే ఆమె పూర్తి నిజాలు చెప్పాలని దర్యాప్తు సంస్థలు పట్టుబడుతున్నాయి. కానీ ఆమె మాత్రం రాజకీయ బేరసారాలతో తన ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడుకోవాలని చూస్తోంది. రాబోయే రోజుల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయం అమెరికా న్యాయచరిత్రలోనే అత్యంత వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది.