- ట్రంప్, మోడీ దిష్టిబొమ్మల దహనం
- అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై రగడ
- దేశవ్యాప్తంగా రోడెక్కనున్న రైతు సంఘాలు
- అమెరికాకు లొంగిపోవడంపై విమర్శ
- పార్లమెంటులో విపక్షాల నిలదీత
సహనం వందే, న్యూఢిల్లీ:
భారత్, అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డీల్ వల్ల భారత వ్యవసాయ రంగం కుప్పకూలుతుందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమెరికా కార్పొరేట్ కంపెనీలకు తలొగ్గిందని ఆరోపిస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ ఒప్పందంపై అటు విపక్షాలు, ఇటు అన్నదాత ముక్తకంఠంతో యుద్ధం ప్రకటిస్తున్నారు.

నిరసన జ్వాలలు మొదలు…
ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కిసాన్ సభ పోరాటానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 12న గ్రామగ్రామాన నిరసనలు చేపడతామని ప్రకటించాయి. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చాయి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
విపక్షాల ఘాటు విమర్శలు
కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఈ డీల్ పై నిప్పులు చెరుగుతున్నాయి. ఇది భారత సార్వభౌమాధికారంపై జరుగుతున్న దాడి అని అభివర్ణించాయి. అమెరికా నుంచి దిగుమతి అయ్యే పండ్లు, పత్తి, సోయాబీన్ నూనెపై సుంకాలు ఎత్తేయడం వల్ల స్థానిక రైతులు నష్టపోతారని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లోని ఆపిల్ రైతులు ఇప్పటికే ధరలు లేక అల్లాడుతున్నారని పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల ఆచితూచి…
ఈ వ్యవహారంలో ఆరెస్సెస్ అనుబంధ సంస్థలైన స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్ ఆచితూచి స్పందిస్తున్నాయి. ప్రభుత్వం రైతు ప్రయోజనాలను కాపాడాలని కోరుతూనే.. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. జెనెటికల్లీ మోడిఫైడ్ (జీఎం) ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని కిసాన్ సంఘ్ స్పష్టం చేసింది. ఒప్పందంపై మరింత స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
పత్తి, నూనె గింజల సాగుపై దెబ్బ
అమెరికా నుంచి సోయాబీన్ నూనె, పశుగ్రాసం భారీగా దిగుమతి అయితే మన రైతులు దెబ్బతింటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో రైతులకు భారీగా సబ్సిడీలు అందుతాయి. అక్కడి ఉత్పత్తులు తక్కువ ధరకే మార్కెట్లోకి వస్తే భారత రైతులు పోటీ పడలేరు. పత్తి సాగులో ఇప్పటికే పెట్టుబడులు పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి.
పార్లమెంటులో నేడు చర్చ రచ్చ
ఈ ట్రేడ్ డీల్ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వం సమాధానం చెప్పాలని పట్టుబట్టనున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై అమెరికా పెట్టిన ఆంక్షల ప్రభావం కూడా ఈ చర్చలో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రైతు ప్రయోజనాలను కాపాడతామని భరోసా ఇస్తున్నారు. మంగళవారం పార్లమెంట్లో ఈ విషయంపై చర్చించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.
ఎగుమతులు, దిగుమతుల లెక్కలు
అమెరికాకు చేసే ఎగుమతులపై 18 శాతం సుంకం విధిస్తుండగా… ఇతర దేశాలతో పోలిస్తే ఇది తక్కువేనని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ వ్యవసాయ ఉత్పత్తులపై సున్నా సుంకం విధించడం వల్ల దేశీయ విపణి కుప్పకూలుతుందని రైతులు భయపడుతున్నారు. గతంలో కుదిరిన ఒప్పందాల వల్ల న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి దిగుమతులు పెరిగి మన రైతులు నష్టపోయిన ఉదాహరణలను రైతు నేత రాకేష్ తికాయత్ గుర్తు చేస్తున్నారు.