ఏఐ వైద్యం… చావు తథ్యం – డాక్టర్ల కంటే చాట్ బాట్లపైనే నమ్మకం

AI Medication - Chatbots
  • తప్పుడు సమాచారంతో రోగుల్లో టెన్షన్
  • చిన్నపాటి దగ్గు కూడా క్యాన్సర్ గా నిర్ధారణ
  • అడ్డూ అదుపు లేని హెల్త్ యాప్ లు
  • యాపిల్ గూగుల్ స్టోర్ల నుండి తొలగింపు
  • రోగ నిర్ధారణలో దారుణమైన పొరపాట్లు

సహనం వందే, హైదరాబాద్:

వైద్య రంగంలోకి చొరబడుతున్న ఏఐ ఇప్పుడు ప్రాణసంకటంగా మారుతోంది. గూగుల్ తల్లి కంటే ఘోరంగా ఏఐ చాట్ బాట్లు ఇచ్చే సలహాలు రోగులను చావు అంచున నిలబెడుతున్నాయి. చిన్నపాటి దగ్గును కూడా క్యాన్సర్ అని చెప్పి భయపెడుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. డాక్టర్ల పర్యవేక్షణ లేని ఈ టెక్నాలజీ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.

ఐదేళ్లలో చనిపోతావని భయం…
ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ఏఐ దారుణాలకు అద్దం పడుతోంది. కాలికి క్యాన్సర్ గడ్డ వచ్చిన ఒక 18 ఏళ్ల యువకుడు చాట్ జీపీటీని సలహా అడిగాడు. అతను ఐదేళ్లలోనే చనిపోతావని ఆ బాట్ సమాధానం ఇచ్చింది. కానీ సర్జరీ తర్వాత అతను పూర్తిగా కోలుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చిన్నపాటి దగ్గును కూడా క్యాన్సర్ ఊపిరితిత్తులకు పాకిందని ఏఐ భయపెట్టింది. తీరా పరీక్షలు చేస్తే అతను కొత్తగా స్మోకింగ్ మొదలు పెట్టడం వల్లే ఆ దగ్గు వచ్చిందని తేలింది.

బీ యువర్ ఓన్ డాక్టర్ పేరిట మాయాజాలం…
మొబైల్ యాప్ స్టోర్లలో కొత్తగా వచ్చిన కొన్ని యాప్ లు డాక్టర్ల అవసరం లేదంటూ ప్రచారం చేస్తున్నాయి. ‘యురేకా హెల్త్’ వంటి యాప్ లు ‘మీ డాక్టర్ మీరే అవ్వండి’ అంటూ ప్రకటనలు ఇచ్చాయి. యాపిల్ సంస్థ దీనిపై విచారణ జరిపి ఆ యాప్ ను తన స్టోర్ నుండి తొలగించింది. రోగ నిర్ధారణ చేసే అధికారం లేకున్నా ఈ యాప్ లు ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్టుల పేరిట రోగులను తప్పుదోవ పట్టిస్తున్నాయి.

చర్మ వ్యాధుల నిర్ధారణలో ఘోర వైఫల్యం
ఏఐ డెర్మటాలజిస్ట్ వంటి యాప్ లు చర్మ క్యాన్సర్ ను గుర్తించడంలో దారుణంగా విఫలమవుతున్నాయి. 97 శాతం కచ్చితత్వం ఉందని చెప్పుకునే ఈ యాప్ లు సాధారణ గడ్డలను క్యాన్సర్ అని చెబుతున్నాయి. మరికొన్నిసార్లు అసలైన మెలనోమా క్యాన్సర్ ను కూడా ఏమీ లేదని తప్పుగా నిర్ధారిస్తున్నాయి. చర్మంపై ఉండే వేల రకాల మార్పులను పసిగట్టే సత్తా ప్రస్తుతం ఏఐకి లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్ దిగ్గజాల కఠిన నిర్ణయాలు
రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ జరిపిన పరిశోధనలో బయటపడ్డ వాస్తవాలతో యాపిల్, గూగుల్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ అడ్వైస్ ఇస్తున్న సాఫ్ట్‌వేర్ డెవలపర్లపై చర్యలు చేపడుతున్నాయి. లైసెన్స్ లేని వైద్య సలహాలు ప్రాణాలకు ముప్పని టెక్ దిగ్గజాలు స్పష్టం చేస్తున్నాయి.

నిపుణుల తీవ్ర ఆందోళన
కంప్యూటర్ సైంటిస్టులు, వైద్యులు ఈ ఏఐ యాప్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య రంగంలో ప్రాపర్ డేటా లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. లక్షల సంఖ్యలో ఉన్న చర్మ వ్యాధులను ఒక చిన్న సాఫ్ట్‌వేర్ పసిగట్టడం అసాధ్యమని హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మాదల పేర్కొన్నారు. రోగులు ఈ యాప్ లను నమ్మి డాక్టర్ వద్దకు వెళ్లడం ఆలస్యం చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడే వారు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఈ బాట్లను నమ్మి చికిత్స ఆలస్యం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పెను విపత్తుకు దారి తీస్తుందని భారత వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోగులు ఏం చేయాలి?
ఏఐ చాట్ బాట్లు, యాప్ లు ఇచ్చే సమాచారాన్ని కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా క్వాలిఫైడ్ డాక్టర్ ను కలవడం ఉత్తమం. టెక్నాలజీ అనేది సహాయకారిగా ఉండాలి తప్ప డాక్టర్ కు ప్రత్యామ్నాయం కాకూడదు. అడ్డగోలుగా పెరిగిన ఈ మెడికల్ బాట్ల విషయంలో ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *