సాగుకు ఉరి.. అమెరికాకు సిరి – భారత అన్నదాతల నోట్లో మట్టి

America Vs Indian Business
  • పండ్లు, పాడి రైతులకు ముప్పు
  • ట్రంప్ దెబ్బకు కేంద్రం లొంగుబాటు
  • 48 లక్షల కోట్ల వ్యవసాయ మార్కెట్లోకి ట్రంప్
  • విదేశీ అగ్రికల్చరల్ కంపెనీలదే ఇక రాజ్యం
  • తెలంగాణ పత్తి, మొక్కజొన్న రైతులకు దెబ్బ

సహనం వందే, హైదరాబాద్:

భారతీయ రైతుల పొట్ట కొట్టి అమెరికా కంపెనీల జేబులు నింపేందుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం మన వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించింది. సుమారు 48 లక్షల కోట్ల రూపాయల విలువైన దేశీయ వ్యవసాయ మార్కెట్‌ను పాక్షికంగా అమెరికా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోంది. డోనాల్డ్ ట్రంప్ పెట్టిన కఠిన నిబంధనలకు తలొగ్గి మన రైతుల ప్రయోజనాలను కేంద్రం గాలికొదిలేసింది.

యాపిల్ రైతులకు ఆశనిపాతం
ఈ ఒప్పందంతో మన దేశీయ పండ్ల తోటల రైతులకు కోలుకోలేని దెబ్బ తగలనుంది. ముఖ్యంగా కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన యాపిల్ రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే యాపిల్ పండ్లపై సుంకాలను భారీగా తగ్గించడంతో విదేశీ పండ్లు మన మార్కెట్లను ముంచెత్తనున్నాయి. అక్కడి రైతులు అత్యాధునిక యంత్రాలతో తక్కువ ఖర్చుతో పండించే యాపిల్స్ మన గడ్డపై చౌకగా దొరికితే మన రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కదు.

పాడి పరిశ్రమకు పెను ముప్పు
కేవలం పండ్లు మాత్రమే కాదు… మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన పాడి పరిశ్రమను కూడా కేంద్రం ప్రమాదంలోకి నెట్టింది. అమెరికా నుంచి పాల ఉత్పత్తుల దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల మన పాడి రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అమెరికాలో పశువులకు ఇచ్చే మేత, హార్మోన్ల వల్ల పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఆ చౌక పాలు, వెన్న, జున్ను మన మార్కెట్లోకి వస్తే మనదేశంలోని కోట్లాది మంది సన్న చిన్నకారు రైతుల బతుకులు ఛిద్రమవుతాయి.

తెలంగాణ మొక్కజొన్న, పత్తికి దెబ్బ
తెలంగాణలో పండించే పప్పు ధాన్యాలు, మొక్కజొన్న పండించే రైతులపై ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. అమెరికా నుంచి తక్కువ ధరకు మొక్కజొన్న, ఇతర పప్పులు భారత మార్కెట్లోకి ముంచెత్తితే రాష్ట్ర రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కూడా దక్కని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అమెరికా నుండి వచ్చే పత్తి ఉత్పత్తుల వల్ల తెలంగాణ పత్తి రైతుల ఆదాయం పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్టుబడుల భారంతో సతమతమవుతున్న ఇక్కడి రైతు, విదేశీ కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకోలేక మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయే ముప్పు పొంచి ఉంది.

ట్రంప్ బెదిరింపులకు లొంగుబాటు
వాణిజ్య యుద్ధం చేస్తానంటూ డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హెచ్చరికలకు మోదీ సర్కారు భయపడిపోయింది. భారత్ నుంచి వెళ్లే ఐటీ సేవలు, ఇతర వస్తువులపై పన్నులు వేస్తామని ట్రంప్ బెదిరించారు. ఆ ఐటీ కంపెనీల లాభాల కోసం కేంద్రం సామాన్య రైతును బలి ఇచ్చింది. అమెరికా రైతుల ఓట్లు పొందేందుకు ట్రంప్ వేసిన ఎత్తుగడలో మన ప్రభుత్వం పావుగా మారింది. మన వ్యవసాయాన్ని విదేశీ కంపెనీల వ్యాపార క్షేత్రంగా మార్చేందుకు తలుపులు బార్లా తెరిచింది.

పెట్టుబడుల మాయ…
వ్యవసాయ రంగంలోకి 83 వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ పెట్టుబడులు వచ్చేది రైతులకు కాదు, వాల్‌మార్ట్, పెప్సికో వంటి బడా కంపెనీల కోసమే. విత్తనం నుంచి విక్రయం వరకు అంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లనుంది. కాంట్రాక్ట్ సాగు పేరుతో రైతులను కూలీలుగా మార్చే కుట్ర ఇందులో దాగుంది. టెక్నాలజీ వస్తుందని నమ్మి మన ఆహార భద్రతను విదేశీయుల చేతుల్లో పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాణిజ్య లోటు త్యాగం
అమెరికాకు మనకు మధ్య ఉన్న వాణిజ్య లోటును తగ్గించే భారమంతా రైతులపైనే పడింది. మన ఎగుమతులు పెరగడం కంటే వారి దిగుమతులకు మార్గం సుగమం చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. పప్పు ధాన్యాలు, వాల్ నట్స్ వంటి ఉత్పత్తులపై ఉన్న పన్నులను 70 శాతం నుంచి సగానికి పైగా తగ్గించబోతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గడమే కాకుండా దేశీయ రైతు తన సొంత మార్కెట్లోనే పరాయివాడిగా మారబోతున్నాడు.

రైతు సంఘాల ఆగ్రహం
ఈ ఒప్పందాన్ని రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సాగు రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టడం అంటే ఆత్మహత్యతో సమానమని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) గురించి మాట్లాడకుండా విదేశీ కంపెనీల లాభాల గురించి తాపత్రయ పడటం దారుణమని మండిపడుతున్నాయి. ఈ ఒప్పందం అమలైతే దేశవ్యాప్తంగా మరోసారి రైతు ఉద్యమం ఎగిసిపడే అవకాశం ఉంది. అన్నదాతను అణగదొక్కి అగ్రరాజ్యంతో దోస్తీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *