ఫోన్లపై లక్ష కోట్ల గంటలు – 2024లో ఇండియన్ల ఫోన్ వాడకం

Phone Usage in India
  • డిజిటల్ పిచ్చితో ప్రాణాలు ఫసక్
  • స్క్రీన్లకే బానిసత్వం… చిన్నారుల ఆత్మహత్య

సహనం వందే, న్యూఢిల్లీ:

చేతిలో ఫోన్ లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి వస్తోంది. డిజిటల్ వ్యసనం మన మెదళ్లను తినేస్తోంది. సామాజిక సంబంధాలను తెంచేస్తూ మనిషిని ఒంటరిని చేస్తోంది. తాజాగా ఘజియాబాదులో ముగ్గురు బాలికల ఆత్మహత్య దీనికి నిదర్శనం. ఫోన్ దూరం చేస్తే చనిపోయేంతగా మనం టెక్నాలజీకి బానిస అయ్యాం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాదు… మన దేశానికి పొంచి ఉన్న పెను ప్రమాదం.

Phone usage at INdia  - 1 Lakh Crore Hours usage

ఘజియాబాద్ ఘోరం…
ఘజియాబాదులో ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు ఒకేసారి బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయారు. ఇది మనసులను కలిచివేసే ఘటన. వాళ్ల తండ్రి 15 రోజుల క్రితం ఫోన్లు లాక్కున్నారని తెలిసింది. ఆ అమ్మాయిలకు కొరియన్ సంస్కృతి అంటే విపరీతమైన ఇష్టం. కోవిడ్ తర్వాత వారు స్కూలుకు వెళ్లడం మానేశారు. ఇరుగుపొరుగు పిల్లలతో కూడా కలవకుండా కేవలం ఫోన్ ప్రపంచంలోనే బతికారు. ఫోన్ లేని లోటును భరించలేక నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు.

వణుకు పుట్టిస్తున్న గణాంకాలు
ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం భారత్ లో డిజిటల్ వ్యసనం ముదురుతోంది. 2024లో భారతీయులు ఫోన్ల మీద గడిపిన సమయం అక్షరాలా 1 లక్ష కోట్ల గంటలు. ప్రతి భారతీయుడు రోజుకు సగటున 5 గంటలు ఫోన్ చూస్తూనే గడుపుతున్నాడు. ప్రపంచంలో ఇండోనేషియా, బ్రెజిల్ తర్వాత మనమే మూడో స్థానంలో ఉన్నాం. ఈ సమయంలో ఎక్కువ భాగం సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ కోసమే వాడుతున్నారు. 35 కోట్ల మందికి పైగా సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు.

పిల్లల మీద ప్రభావం
అతిగా ఫోన్ వాడటం వల్ల పిల్లల్లో వింత ప్రవర్తన వస్తోంది. నిద్ర లేకపోవడం, కోపం, సమాజం నుంచి విడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది డిప్రెషన్ కు దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ల వైపు గంటల తరబడి చూడటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటోంది. చదువు పట్ల ఆసక్తి తగ్గి ఉత్పాదకత దెబ్బతింటోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

విదేశాల్లో కఠిన ఆంక్షలు
డిజిటల్ వ్యసనాన్ని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించింది. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి 10 యాప్స్ ను అక్కడ వాడకూడదు. కేవలం వాట్సాప్, గూగుల్ క్లాస్ రూమ్ వంటి వాటికే అనుమతి ఉంది. ఈ రూల్స్ అతిక్రమిస్తే సోషల్ మీడియా సంస్థలకు 268 కోట్ల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఇలాంటి నిబంధనలు మన దగ్గర కూడా రావాల్సిన అవసరం ఉంది.

పరిష్కార మార్గాలు ఇవే
ప్రతి చిన్న విషయానికి స్మార్ట్ ఫోన్ వాడటం తగ్గించాలి. పిల్లలకు చిన్న వయసులో బేసిక్ ఫోన్లు లేదా కేవలం చదువుకునే ట్యాబ్లెట్లు మాత్రమే ఇవ్వాలని సర్వే సూచిస్తోంది. వాడకం మీద గట్టి ఆంక్షలు ఉండాలి. పిల్లలు ఇతరులతో కలిసేందుకు వీలుగా క్లబ్బులు ఏర్పాటు చేయాలి. ఆన్ లైన్ లో మంచి కంటెంట్ మాత్రమే ఉండేలా ఫిల్టర్లు పెట్టాలి. వారంలో అప్పుడప్పుడు డిజిటల్ ఫాస్టింగ్ చేయాలి. అంటే కొన్ని గంటల పాటు ఫోన్ కు దూరంగా ఉండి బయటి ప్రపంచాన్ని చూడాలి.

టెక్నాలజీ బానిసలమా
ఫోన్ వాడకం మన చేతుల్లో ఉండాలి కానీ ఫోన్ మనల్ని వాడకూడదు. డిజిటల్ ప్రపంచం వల్ల సామాజిక మూలధనం తగ్గుతోంది. మనుషుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు కనుమరుగవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యసనం మాత్రమే కాదు… ఆరోగ్య సమస్యగా మారుతోంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే టెక్నాలజీ వాడకం మీద నియంత్రణ ఉండాలి. లేదంటే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసే ప్రమాదం ఉంది. ఈ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *