- ఏప్స్ టీన్ తో కలిసి రాసలీలల్లో కుబేరుడు
- అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు
- దాతృత్వం ముసుగులో బురద పనులు
- తన ఫౌండేషన్ విరాళాల కోసం అడ్డదారులు
- పరువు పోయాక సానుభూతి కుతంత్రం
- క్షమించమని వేడుకోలు… ఇదేమి చోద్యం
సహనం వందే, అమెరికా:
లైంగిక నేరగాడు ఏప్స్ టీన్ ఫైళ్ళ వ్యవహారం అంతర్జాతీయంగా అగ్గిరాజేస్తుంది. అందులో భాగస్వామ్యమైన ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఇంత మురికి మనిషా అని ప్రపంచం నోరెళ్లబెట్టింది. ప్రసిద్ధి చెందిన రాజకీయ, సినీ పారిశ్రామికవేత్తలు అనేక మందికి అమ్మాయిలను సరఫరా చేసిన జెఫ్రీ ఏప్స్ టీన్ తో బిల్ గేట్స్ చీకటి జీవితం బట్టబయలైంది. దీంతో ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయింది. మైక్రోసాఫ్ట్ అధినేతగా ప్రపంచాన్ని శాసించిన ఆయన సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుపోయారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు ఆయన బహిరంగంగా స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

గతం తవ్వి తీస్తే రాళ్లు రప్పలే…
బిలియనీర్ బిల్ గేట్స్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పాత స్నేహాల గురించి సంచలన నిజాలు వెల్లడించారు. జెఫ్రీ ఏప్స్ టీన్ అనే వివాదాస్పద వ్యక్తితో తనకు ఉన్న సంబంధంపై ఆయన పూర్తి స్థాయిలో నోరు విప్పారు. అతనితో గడపడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో ఏప్స్ టీన్ తో డిన్నర్లు చేయడం వల్ల కలిగిన నష్టం ఇప్పుడు అర్థమవుతోందని గేట్స్ వాపోయారు.
దాతృత్వం పేరుతో మోసం
గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్త ఆరోగ్య సమస్యల పరిష్కారానికి నిధులు సేకరించడమే తన లక్ష్యమని గేట్స్ చెప్పారు. ఆ క్రమంలోనే ఏప్స్ టీన్ దగ్గర ఉన్న భారీ నిధులను దాతృత్వ కార్యక్రమాలకు మళ్లించవచ్చని భావించినట్లు తెలిపారు. అయితే తన ఆశ నెరవేరలేదని పైగా తన పేరు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని ఆవేదన చెందారు. ఏప్స్ టీన్ కు ఉన్న చీకటి లోకం గురించి తనకు అప్పట్లో పూర్తిగా తెలియదని ఆయన సమర్థించుకున్నారు. అయినప్పటికీ అతనితో తిరగడం తప్పేనని స్పష్టం చేశారు.
విడాకుల వెనుక అసలు కథ
మెలిండా గేట్స్ తో 27 ఏళ్ల వైవాహిక బంధం ముగియడానికి ఏప్స్ టీన్ వ్యవహారమే ప్రధాన కారణమని వార్తలు వచ్చాయి. దీనిపై గేట్స్ స్పందిస్తూ తన మాజీ భార్య మెలిండా మొదటి నుంచి ఏప్స్ టీన్ ను అసహ్యించుకునేదని చెప్పారు. ఆమె హెచ్చరించినా తాను పట్టించుకోలేదని… అది పెద్ద పొరపాటని ఒప్పుకున్నారు. ఈ విడాకులు తన జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చాయని ఆయన పేర్కొన్నారు. కేవలం ఒక వ్యక్తితో పరిచయం ఇంతటి విచ్ఛిన్నానికి దారి తీస్తుందని ఊహించలేదని అన్నారు.
డబ్బు కోసం గడ్డి తిన్న గేట్స్
జెఫ్రీ ఏప్స్ టీన్ గతాన్ని పరిశీలిస్తే అతను మైనర్ బాలికలపై లైంగిక దాడుల కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి. 2019లో జైలులోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అటువంటి వ్యక్తితో బిల్ గేట్స్ కు ఉన్న పరిచయంపై అమెరికా మీడియా అనేక కథనాలను ప్రసారం చేసింది. గేట్స్ దాదాపు 10 వేల కోట్ల రూపాయల వరకు విరాళాల సేకరణ కోసం అతనితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ పరిచయం వల్ల గేట్స్ ఇమేజ్ గ్రాఫ్ పడిపోవడమే కాకుండా మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఫౌండేషన్ పై ప్రభావం
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రస్తుతం లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఉంది. వివాదాల వల్ల ఈ సంస్థ చేసే పనులకు ఆటంకం కలగకూడదని గేట్స్ కోరుకుంటున్నారు. మెలిండాతో విడిపోయినప్పటికీ ఫౌండేషన్ పనుల్లో ఆమె సహకారం తీసుకుంటానని చెప్పారు. ఒకవేళ ఆమె కలిసి పనిచేయలేకపోతే రెండేళ్ల తర్వాత ఆమె తన వాటాతో వేరుగా వెళ్లొచ్చని కూడా స్పష్టం చేశారు. స్వచ్ఛంద సేవ తన ప్రాణమని దాని కోసం ఏదైనా చేస్తానని వెల్లడించారు.
మళ్లీ సుద్దపూస మాటలు
తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం చెందడం ఒక్కటే మార్గమని గేట్స్ భావిస్తున్నారు. జరిగిన దానికి క్షమాపణలు చెబుతూనే ఇకపై తన సమయాన్ని వాతావరణ మార్పులు, పేదరిక నిర్మూలనపైనే వెచ్చిస్తానని చెప్పారు. తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నానని ఇకపై అప్రమత్తంగా ఉంటానని హామీ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమాజం కోసం తాను చేసే కృషి ఆపబోనని గేట్స్ ప్రకటించారు.