- కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాలపై శీతకన్ను
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై పక్షపాతం
- ఎన్నికలు ఉన్నప్పటికీ తమిళనాడుపై వివక్షే
సహనం వందే, హైదరాబాద్:
దక్షిణాది రాష్ట్రాల మధ్య 16వ ఆర్థిక సంఘం చిచ్చు పెట్టింది. పన్నుల పంపిణీలో రాష్ట్రాల వారీగా భారీ వ్యత్యాసాలు ఇప్పుడు రాజకీయంగా సెగలు పుట్టిస్తున్నాయి. కేరళకు వరాలు కురిపించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల పట్ల మాత్రం చిన్నచూపు చూసింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తమిళనాడుకు కనీస గుర్తింపు కూడా దక్కకపోవడం ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి.
తమిళనాడుకు తలపోటు
ఆర్థిక సంఘం లెక్కల్లో తమిళనాడు పరిస్థితి ఘోరంగా ఉంది. గతంలో 15వ ఆర్థిక సంఘంలో 4.079 శాతంగా ఉన్న ఆ రాష్ట్ర వాటా.. ఇప్పుడు 4.097 శాతానికే పరిమితమైంది. అంటే కేవలం 0.44 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. పన్నుల వసూలులో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రానికి తిరిగి ఇచ్చే వాటాలో నామమాత్రపు పెంపు చూపడంపై స్టాలిన్ సర్కార్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు అన్యాయం
విభజన కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 4.2 శాతం పెరుగుదలకే మొగ్గు చూపారు. తెలంగాణ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. తెలంగాణ వాటాలో వృద్ధి కేవలం 3.43 శాతంగానే ఉంది. పొరుగునున్న కేరళ, కర్ణాటకలకు దక్కిన భారీ రాయితీల్లో సగం కూడా తెలుగు రాష్ట్రాలకు దక్కలేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న హైదరాబాద్ లాంటి నగరం ఉన్నా నిధుల మళ్లింపులో మాత్రం అన్యాయం జరిగిందని విశ్లేషకులు మండిపడుతున్నారు.
కేరళకు కాసుల వర్షం
దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ నిజంగా అదృష్టవంతురాలు. ఆ రాష్ట్ర వాటాలో ఏకంగా 23.74 శాతం వృద్ధి నమోదైంది. దేశం మొత్తంమ్మీద చూసినా హర్యానాకు దక్కిన 24.52 శాతం తర్వాత అత్యధిక నిధుల పెంపు పొందిన రెండో రాష్ట్రం కేరళే కావడం విశేషం. నిధుల కోసం కేంద్రంతో నిత్యం కయ్యానికి దిగే కేరళకు ఈసారి ఆర్థిక సంఘం పెద్ద పీట వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటకకు డబుల్ డిజిట్
ఐటీ హబ్‌గా ఉన్న కర్ణాటక కూడా మంచి ఫలితాలను రాబట్టింది. ఆ రాష్ట్ర వాటా 13.27 శాతం మేర పెరిగింది. దక్షిణాదిలో కేరళ తర్వాత అత్యధిక లబ్ధి పొందిన మూడో రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. పన్నుల రూపంలో ఢిల్లీకి భారీగా నిధులు సమకూరుస్తున్నందుకు కేంద్రం నుంచి ఈసారి తగిన గౌరవం దక్కిందని ఆ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల కంటే కర్ణాటకకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
దేశవ్యాప్త గణాంకాలు
అఖిల భారత స్థాయిలో హర్యానా అగ్రస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్ర నిధుల వాటా 24.52 శాతం పెరగడం గమనార్హం. ఆ తర్వాత 23.74 శాతంతో కేరళ రెండో స్థానంలో ఉంది. కర్ణాటక మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు నిధుల కోత పెడతారనే ఆందోళన ఉన్నా కొన్ని రాష్ట్రాలకు మాత్రం భారీగా పెంపు ఇవ్వడం వెనుక ఉన్న మతలబుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రాజకీయ యుద్ధం
ఈ నిధుల పంపిణీ ఇప్పుడు ప్రాంతీయ విభేదాలకు కారణమవుతోంది. కేంద్రం ఇచ్చే నిధుల్లో తమకు వాటా తగ్గడంపై దక్షిణాది రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు తమకు జరిగిన అన్యాయంపై గళం ఎత్తుతున్నాయి. జనాభా నియంత్రణ పాటించి.. అభివృద్ధి సాధించినందుకు తమకు శిక్ష వేశారా అని ప్రశ్నిస్తున్నాయి. 16వ ఆర్థిక సంఘం నివేదిక రానున్న రోజుల్లో రాజకీయంగా మరిన్ని ప్రకంపనలు సృష్టించేలా ఉంది.