- నోటీసుల స్వీకరణకు అంగీకారం
- 2,100 కోట్ల ముడుపుల ఆరోపణ
- 90 రోజుల్లో సమాధానానికి సమయం
- అంతర్జాతీయంగా మసకబారుతున్న పరువు
సహనం వందే, న్యూఢిల్లీ:
అదానీకి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ వేసిన ఫ్రాడ్ కేసు కీలక మలుపు తిరిగింది. నోటీసులు అందజేసే ప్రక్రియలో ఉన్న సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో గౌతమ్ అదానీ చుట్టూ అమెరికా చట్టాల ఉచ్చు మరింత గట్టిగా బిగుస్తోంది. ఇకపై ఈ కేసులో విచారణ వేగంగా ముందుకు సాగడానికి మార్గం సుగమమైంది.
నోటీసులపై అంగీకారం
అమెరికా కోర్టులో అదానీ లాయర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఈసీ పంపే చట్టపరమైన నోటీసులను తామే స్వీకరిస్తామని అంగీకరించారు. గతంలో అదానీ ఇండియాలో ఉండటం వల్ల నోటీసులు ఇవ్వడం కష్టమని ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది. ఇప్పుడు లాయర్లే నోటీసులు తీసుకుంటామని చెప్పడంతో జడ్జి విచారణకు పచ్చజెండా ఊపారు.
కేసు నేపథ్యం ఇదే
అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రయోజనాల కోసం అదానీ భారీగా లంచాలు ఆశ చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 2,100 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు ఇచ్చేందుకు ప్లాన్ చేశారని ఎస్ఈసీ అభియోగం మోపింది. నవంబర్ 2024లోనే ఈ కేసు ఫైల్ అయినా నోటీసుల సమస్యతో ఇంతకాలం నిలిచిపోయింది.
90 రోజుల సమయం
కోర్టు ఈ ఒప్పందాన్ని ఖరారు చేస్తే అదానీకి కొంత సమయం లభిస్తుంది. ఎస్ఈసీ చేసిన ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు ఆయనకు 90 రోజుల గడువు ఉంటుంది. ఆ లోపు తనపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలని అదానీ కోర్టును కోరే అవకాశం ఉంది. అయితే నోటీసుల ప్రక్రియ పూర్తవ్వడంతో ఇక తప్పించుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
ఆగిపోయిన క్రిమినల్ కేసు
అదానీపై కేవలం సివిల్ కేసు మాత్రమే కాకుండా క్రిమినల్ కేసు కూడా ఉంది. నవంబర్ 2024లోనే అమెరికా ప్రాసిక్యూటర్లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా పలువురిపై నేరారోపణలు చేశారు. అయితే గత ఏడాది కాలంగా ఆ క్రిమినల్ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇప్పుడు సివిల్ కేసు కదలడంతో మళ్లీ చర్చ మొదలైంది.
సంపదపై ప్రభావం
ఫోర్బ్స్ లెక్కల ప్రకారం గౌతమ్ అదానీ ఆస్తి విలువ సుమారు 4.95 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన కీలక స్థానంలో ఉన్నారు. అమెరికాలో సాగుతున్న ఈ విచారణ అదానీ వ్యాపార సామ్రాజ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కేసు వల్ల అదానీ గ్రూపు ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారుతోంది.
విచారణాధికారి నిర్ణయం
బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు జడ్జి నికోలస్ గరాఫిస్ ఈ తాజా పరిణామాలను పరిశీలిస్తున్నారు. లాయర్ల అంగీకారాన్ని ఆయన ధ్రువీకరిస్తే విచారణ లాంఛనంగా మొదలవుతుంది. అదానీ గ్రూపు ఇప్పటికే వాల్ స్ట్రీట్ కు చెందిన ప్రముఖ లాయర్లను రంగంలోకి దించింది. కేసును ఎదుర్కొనేందుకు అదానీ వర్గం సిద్ధమవుతోంది.