కూలిన రెక్కలు… మారిన లెక్కలు! – అజిత్ పవార్… వైఎస్ మరణాల సారూప్యత

Ajith Pawar Accident
  • విమాన, హెలికాప్టర్ ప్రమాదంలో విషాదాలు
  • వైఎస్ఆర్ స్మృతుల కలకలం… కాంగ్రెస్ ఔట్
  • ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ శక్తుల విశ్వరూపం
  • తెలంగాణ ఏర్పాటు ఉద్యమం పునరుద్ధరణ
  • ఒక నాయకుడి మరణంతో పాలిటిక్స్ షేక్
  • ఒక ప్రమాదం… జాతీయ పార్టీకి విఘాతం
  • రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో మార్పులు?

సహనం వందే, హైదరాబాద్:

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ఈ దుర్ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని గుర్తు చేస్తోంది. నాటి హెలికాప్టర్ ప్రమాదం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసింది. ఒక మహానేత నిష్క్రమణతో ప్రాంతీయ పార్టీలు బలపడి జాతీయ పార్టీ కాంగ్రెస్ కనుమరుగైంది.

YSR

నల్లమల అడవిలో విషాదం
2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 8.38 గంటలకు బయలుదేరింది. గాలిలోకి ఎగిరిన 45 నిమిషాలకే వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు, భారీ వర్షం వల్ల హెలికాప్టర్ రాడార్ నుంచి తప్పిపోయింది. కర్నూలు జిల్లా పావురాలగుట్ట సమీపంలోని కొండను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. గ్రేహౌండ్స్, వాయుసేన 24 గంటల పాటు గాలించిన తర్వాతే వైఎస్ఆర్ మరణవార్తను అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటనతో అప్పటి ఉమ్మడి రాష్ట్రం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ
వైఎస్ఆర్ మరణంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ శూన్యం ఏర్పడింది. 2004, 2009 ఎన్నికల్లో పార్టీని వరుసగా గెలిపించిన ఏకైక నాయకుడు ఆయనే. వైఎస్ఆర్ లేని కాంగ్రెస్ రాష్ట్రంలో పట్టు కోల్పోయింది. రోశయ్యను ముఖ్యమంత్రిగా నియమించినా పార్టీలోని అసంతృప్తిని ఆపలేకపోయారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలు పార్టీని పతనానికి చేరువ చేశాయి. సీనియర్ నాయకులు ఉన్నా వైఎస్ఆర్ వంటి మాస్ లీడర్ లేకపోవడం పార్టీకి శాపంగా మారింది.

జగన్ తిరుగుబాటు జెండా
వైఎస్ఆర్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని 153 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారన్న చర్చ ఉంది. కానీ సోనియా గాంధీ దీనికి ఒప్పుకోలేదని అంటారు. దీంతో జగన్ కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎత్తారు. ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి వెళ్లి తన బలాన్ని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ ను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తన లోక్ సభ స్థానానికి, తల్లి విజయమ్మ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శక్తికి ప్రాణం పోసింది.

Ajit Pawar YSR accidents

తెలంగాణ ఉద్యమ పునరుద్ధరణ
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను చూసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేశారు. వైఎస్ఆర్ ఉన్నంత కాలం స్తబ్దుగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఇది గొప్ప అవకాశంలా మారింది. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి రాష్ట్రంలో విభజన సెగలు మొదలయ్యాయి. ఒక నేత మరణం రాష్ట్ర విభజనకు పరోక్షంగా దారితీసింది.

ఎన్నికల బరిలో భారీ మార్పులు
2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 175 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది. అటు తెలంగాణలో టీఆర్ఎస్ 63 సీట్లతో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రలో టీడీపీ 102 సీట్లు గెలిచి అధికారం చేపట్టింది. వైఎస్ఆర్ పార్టీ 67 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కాంగ్రెస్ కు కంచుకోటలా ఉన్న రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. కేవలం ఒక ప్రమాదం దేశంలోనే అతిపెద్ద పార్టీని ఒక ప్రాంతం నుంచి తరిమేసింది.

Ajith Pawar Death

రాజకీయ ముఖచిత్రం మార్చిన మరణం
అజిత్ పవార్ ప్రమాదం ఇప్పుడు మహారాష్ట్రలో ఎలాంటి మార్పులు తెస్తుందోనని విశ్లేషకులు చర్చిస్తున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన పరిణామాలే దీనికి సాక్ష్యం. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, రాష్ట్రాల విభజన వంటి కీలక ఘట్టాలకు ఆ హెలికాప్టర్ ప్రమాదమే పునాది వేసింది. జాతీయ పార్టీల అధిపత్యానికి గండి కొట్టి స్థానిక నాయకత్వానికి ఈ ఘటనలు దారి చూపాయి. రాజకీయ చరిత్రలో ఈ గగనతల ప్రమాదాలు నాయకులను మాత్రమే కాదు ప్రజల భవిష్యత్తును కూడా మార్చేస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *