సీబీఎస్ఈ మార్కుల్లో అల్లకల్లోలం – 9 లక్షల జవాబు పత్రాల స్కానింగ్లో లోపాలు

CBSE Results
  • విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
  • సాంకేతిక లోపాలతో విద్యార్థుల ఆవేదన
  • పారదర్శకత లేని మూల్యాంకన ప్రక్రియ
  • లక్షలాది పత్రాల రివాల్యుయేషన్ సందిగ్ధం
  • అధికారుల నిర్లక్ష్యంతో భవితపై నీలినీడలు

సహనం వందే, న్యూఢిల్లీ:

పరీక్షలంటేనే విద్యార్థులకు టెన్షన్. అలాంటిది తాము రాసిన జవాబు పత్రాలు సరిగ్గా కనిపించకపోతే ఎలా ఉంటుంది? సీబీఎస్ఈ బోర్డు డిజిటల్ మూల్యాంకనం పేరుతో చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. 9 లక్షల జవాబు పత్రాలను డిజిటలైజ్ చేసినా అందులో చోటుచేసుకున్న లోపాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇవే.

డిజిటల్ విప్లవం అంటే ఇదేనా?
ప్రపంచమంతా డిజిటల్ వైపు వెళ్తుంటే మన దేశంలో ఆ వ్యవస్థే కుప్పకూలింది. విద్యార్థులు రాసిన జవాబులను ఆన్‌లైన్‌లో స్కాన్ చేసి వాటికి మార్కులు వేయడమే ఈ విధానం ఉద్దేశం. కానీ ఇందులో ఉన్న సాంకేతిక లోపాలు విద్యార్థులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. సిస్టమ్‌లో ఉన్న చిన్న చిన్న సర్వర్ సమస్యలు కూడా విద్యార్థుల జీవితాలను తలకిందులు చేస్తున్నాయి.

అసలు సమస్య ఏమిటి?
విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి…

  1. స్పష్టత లేని జవాబులు: ఒక విద్యార్థి స్కాన్ చేసిన తన పేపర్‌ను ఓపెన్ చేసి చూస్తే అక్షరాలు బొమ్మల్లా కనిపిస్తున్నాయి. స్కానింగ్ సరిగ్గా లేకపోవడంతో పేజీలు బ్లర్ అయిపోయి తాను ఏం రాశాడో తనకే అర్థం కావడం లేదు.
  2. చెకప్ చేయని పేపర్లు: మరికొన్ని చోట్ల జవాబులు అసలు చెక్ చేయకుండానే మార్కులు వేసేశారు. అంటే మూల్యాంకనం చేసేవారు కనీసం పేజీని కూడా చూడకుండానే మార్కులు ఇస్తున్నారన్నమాట.
  3. సర్వర్ల క్రాష్: ఫలితాల సమయంలో రిజల్ట్స్ చూసుకోవడానికి వెళ్తే సర్వర్లు క్రాష్ అవుతున్నాయి. దీనివల్ల విద్యార్థులు గంటల కొద్దీ ఎదురుచూడాల్సి వస్తోంది.

మెరిట్ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
ఎంతో కష్టపడి రాసిన మెరిట్ విద్యార్థులు ఈ సాంకేతిక లోపాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్క మార్కు అటు ఇటు అయితే సీటు పోయే అవకాశం ఉంది. అలాంటిది సిస్టమ్ ఎర్రర్స్ వల్ల మార్కులు తగ్గిపోతుంటే విద్యార్థులు ఎవరికి మొరపెట్టుకోవాలి? తమ జవాబు పత్రాలను తామే సరిగ్గా చూసుకోలేని స్థితిలో ఉండటం విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం.

అధికారుల బాధ్యతారాహిత్యం
ఈ సమస్యపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి కేవలం 20 శాతం మంది మాత్రమే రి-ఎవాల్యుయేషన్ కోరుతున్నారని తేలికగా వ్యాఖ్యానించారు. అంటే మిగిలిన 80 శాతం విద్యార్థులు తమకు వచ్చిన మార్కులతో సర్దుకుపోవాలనేది ఆయన ఉద్దేశమా? 11 లక్షలకు పైగా రిక్వెస్టులు పెండింగ్‌లో ఉండటం, విద్యార్థులకు సిస్టం మీద నమ్మకం లేదని చెప్పడానికి స్పష్టమైన ఇదే ఉదాహరణ.

జవాబుదారీతనం ఎక్కడ?
సుమారు 9 లక్షల జవాబు పత్రాలను స్కాన్ చేసే క్రమంలో మానవ తప్పిదాలను గుర్తించే నిపుణులు ఎందుకు లేరు? ఒక ప్రైవేట్ సంస్థ తన డేటాను ఇంత నిర్లక్ష్యంగా హ్యాండిల్ చేస్తే ఊరుకోం కదా? మరి లక్షలాది మంది విద్యార్థుల జీవితాల విషయంలో బోర్డు ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తోంది? సమస్యను రెక్టిఫై చేయాల్సిన యంత్రాంగం… విద్యార్థులనే అధికారుల చుట్టూ తిప్పుకోవడం బాధాకరం.

డిజిటల్ డ్రామాను ఆపాలి…
టెక్నాలజీ మనుషుల శ్రమను తగ్గించాలి కానీ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని తగ్గించకూడదు. అధికారులు ఇకనైనా కళ్లు తెరిచి ఈ డిజిటల్ డ్రామాను ఆపాలి. విద్యార్థులు కోరుకునేది కేవలం పారదర్శకత మాత్రమే. తాము రాసిన సమాధానాలకు తగిన మార్కులు పడాలి. అప్పుడే విద్యా వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది. లేదంటే ఈ లోపాలు భవిష్యత్తుకు పెద్ద శాపంగా మారుతాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *