- ఉపాపై యూటర్న్… ఉమర్ ఖాలిద్‌కు ఊరట
- ఆర్టికల్ 21కు ప్రాణం... బెయిల్ రూల్స్ మార్పు
- భారత న్యాయవ్యవస్థలో సరికొత్త చరిత్ర
సహనం వందే, న్యూఢిల్లీ:
దేశ సర్వోన్నత న్యాయస్థానం తన సొంత నిర్ణయాన్ని తానే తప్పుపట్టుకుంటూ ఇచ్చిన సంచలన తీర్పు భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది. కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాల నీడలో పౌరుల ప్రాథమిక హక్కులు ఏ విధంగా నలిగిపోతున్నాయో సుప్రీంకోర్టు స్వయంగా విశ్లేషిస్తూ వ్యవస్థల దూకుడుకు గట్టి బ్రేకులు వేసింది.
స్వయం విమర్శతో సరికొత్త చరిత్ర
న్యాయవ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన రీతిలో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ భుయాన్‌లతో కూడిన బెంచ్ తన సొంత పాత నిర్ణయాన్ని తానే తప్పుపట్టింది. ఇదే సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ నిరాకరించి ఏప్రిల్‌లో రివ్యూ పిటిషన్‌ను కూడా కొట్టేసిన విషయాన్ని న్యాయమూర్తులు స్వయంగా ప్రస్తావించారు. అయితే 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పును, నిబంధనలను ఉమర్ ఖాలిద్ విషయంలో తాము సరిగ్గా వర్తింపజేయలేదని ఈ సోమవారం నాటి విచారణలో న్యాయమూర్తులు బహిరంగంగానే అంగీకరించారు. తప్పును ఒప్పుకోవడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం వెనకాడకపోవడం న్యాయవ్యవస్థపై సామాన్యుడికి నమ్మకాన్ని పెంచుతోంది.

ఆరేళ్ల జైలుపై న్యాయ గర్జన
ఈ కేసు దేశవ్యాప్తంగా ఎందుకు ఇంత హాట్ టాపిక్‌గా మారిందంటే… 2020లో ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉందంటూ జేఎన్ యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అంటే దాదాపు 6 ఏళ్లుగా ఆయన విచారణ లేకుండా జైల్లోనే మగ్గుతున్నారు. తీవ్రవాద నిరోధక చట్టాల కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇక బెయిల్ రావడం ఇంపాజిబుల్ అనే ఒక గట్టి నమ్మకం వ్యవస్థల్లో నాటుకుపోయింది. కానీ ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం తన పాత తీర్పులను గట్టిగా ప్రశ్నిస్తూ… ఒక మనిషిని ఏళ్ల తరబడి జైల్లో పెట్టి ఆ తర్వాత అతను నిర్దోషి అని తెలిస్తే ఆ పోయిన కాలానికి బాధ్యులెవరనే పదునైన ప్రశ్నను సమాజం ముందుంచింది.
రివర్స్ అయిన ఉపా కథ
సాధారణంగా చట్టంలో బెయిల్ అనేది ఒక హక్కు, జైలు అనేది కేవలం మినహాయింపు అని చెబుతారు. కానీ ఉపా చట్టం ప్రయోగించినప్పుడు మాత్రం కథ పూర్తిగా రివర్స్ అవుతుంది. ఈ ధోరణిని తప్పుబడుతూ చట్టంలో ఎంత కఠిన నిబంధనలు ఉన్నా భారత రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను ఏ చట్టమూ కాలరాయలేదని బెంచ్ తేల్చి చెప్పింది. ఏళ్ల తరబడి పక్కా విచారణ లేకుండా జైల్లో ఉంచడం ముమ్మాటికీ తప్పని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
పోలీసుల అస్త్రాలకు సుప్రీం బ్రేక్
చాలాసార్లు పోలీసులు వ్యక్తిగత కక్షలతోనో లేదా చిన్న కారణాలకో పెద్ద పెద్ద చట్టాలు మోపేస్తూ ఉంటారు. విచారణ ముగిసేసరికే నిందితుల సగం జీవితం జైల్లోనే అయిపోతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక క్లారిటీ వల్ల రేపు ఎవరైనా అన్యాయంగా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే చట్టం పేరు చెప్పి గుడ్డిగా బెయిల్ నిరాకరించడానికి వీల్లేదు. కోర్టులు ప్రతి కేసును కేవలం చట్టం కోణంలోనే కాకుండా మానవతా దృక్పథంతో చూడాల్సి ఉంటుందని న్యాయస్థానం ఆదేశించింది.
ప్రశ్నించే గొంతుకలకు ఊరట
ఈ తీర్పు దేశ ప్రజాస్వామ్యానికి ఒక గట్టి ఊరటనిస్తోంది. చట్టాలు సమాజాన్ని రక్షించడానికి ఉండాలి కానీ పౌరుల గొంతు నొక్కడానికి కాదనే గట్టి సందేశం వ్యవస్థల్లోకి వెళ్ళింది. పోలీస్ వ్యవస్థ తన ఇష్టానుసారంగా చట్టాలను దుర్వినియోగం చేయకుండా ఈ తీర్పు అడ్డుకట్ట వేస్తుంది. రాజకీయ కోణంలో కూడా ఉమర్ ఖాలిద్ కేసును ప్రశ్నించే గొంతులపై జరుగుతున్న దాడిగా కొందరు అభివర్ణిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో మిగిలిన రాజకీయ ఖైదీల కేసులపై కూడా గట్టి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
హక్కులు… సమతుల్యత
తీవ్రవాద, దేశ వ్యతిరేక శక్తుల నుంచి దేశాన్ని కాపాడటానికి ఉపా లాంటి కఠిన చట్టాలు ఖచ్చితంగా అవసరమే అయినా నిందితుడు తప్పు చేశాడని తేలకముందే కేవలం ఆరోపణల ఆధారంగానే శిక్ష అనుభవించడం ఎంతవరకు న్యాయమనేది ఇప్పుడున్న పెద్ద ప్రశ్న. చట్టాల కఠినత్వానికి, పౌరుల హక్కులకు మధ్య సమతుల్యత ఎలా సాధ్యమనే కోణంలోనే సుప్రీంకోర్టు ఈ కీలక అడుగు వేసింది. గత కొన్ని నెలలుగా బెయిల్ నిబంధనలపై వరుసగా సానుకూల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న కోర్టు… జాప్యమైన విచారణే బెయిల్‌కు అతిపెద్ద అర్హతగా మారుతుందని గుర్తు చేసింది. దీంతో అధికారులు కూడా ఇకపై ఆరోపణలు మోపేటప్పుడు పక్కా ఆధారాలతో కోర్టు ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.