- సీఎం రేవంత్ రెడ్డికి సినీ సంఘాల లేఖ
- భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సినీ నటులు
- నిగ్గుతేల్చాలని సంఘాల డిమాండ్
- కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదని నిలదీత
సహనం వందే, హైదరాబాద్:
రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ సెట్ల భద్రతపై అఖిల భారత సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో నటుడు రాజేష్ శర్మకు విషకీటకం కుట్టి ఆయన ప్రాణాపాయ స్థితికి చేరుకోవడమే ఈ వివాదానికి మూలం. సెట్లలో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడం, పరిశుభ్రత నిబంధనలను విస్మరించడంపై సినీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.
నిబంధనల అమలుపై అనుమానాలు
షూటింగ్ జరిగే సెట్లలో నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. విష పురుగు కుట్టిన సమయంలో రాజేష్ శర్మకు సెట్‌లో ప్రాథమిక చికిత్స అందకపోవడం పట్ల సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ సెట్ అంటేనే భద్రతకు మారుపేరుగా ఉండాలి. కానీ ఇలాంటి ఘటనలు జరగడం వెనుక ఉన్న యాజమాన్యాల నిర్లక్ష్యంపై సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా నేరుగా ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగింది?
రామోజీ ఫిల్మ్ సిటీలో దట్టమైన చెట్ల మధ్య ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ జరుగుతుండగా ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. నటుడు రాజేష్ శర్మ సహచరులతో మాట్లాడుతుండగా విషకీటకం కుట్టింది. 6 గంటల వ్యవధిలోనే ఆయన పరిస్థితి విషమించింది. తీవ్రమైన జ్వరం, కుడికాలి ఇన్ఫెక్షన్‌తో ఆయన శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డయాబెటిస్ ఉండటంతో ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరించిందని వైద్యులు నిర్ధారించారు.
నిర్మాతల మౌనంపై విమర్శలు
షూటింగ్ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తలేదని ఫౌజీ నిర్మాతలు బుకాయిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇంతటి కీలక ఘటన నిర్మాణ సంస్థకు తెలియకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఇది నిర్లక్ష్యమా లేక బాధ్యతారాహిత్యమా? అనే ప్రశ్నలు సినీ కార్మికుల్లో మొదలయ్యాయి. నిర్మాతల వైఖరిని పలువురు ప్రముఖులు ఖండిస్తున్నారు.
నిలకడగా రాజేష్ శర్మ పరిస్థితి
ప్రస్తుతానికి రాజేష్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉందని మణిపాల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తానియా లోధ్ తెలిపారు. ఆయన కోరుకున్న మేరకు వైద్య వివరాలను గోప్యంగా ఉంచారు. నటుడు అక్షయ్ కుమార్ కూడా ఈ ఉదంతంపై స్పందించారు. రాజేష్ శర్మ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి సమయాల్లో సినీ రంగానికి చెందినవారంతా ఏకతాటిపైకి రావడం గమనార్హం.
కఠిన చర్యలకు డిమాండ్…
ఈ విచారణ డిమాండ్ కేవలం రాజేష్ శర్మ కోసం మాత్రమే కాదు, సెట్స్‌లో పనిచేసే వందలాది మంది కార్మికుల భద్రత కోసం. పారదర్శకమైన విచారణ జరిగితేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చు. ప్రభుత్వం తీసుకునే చర్యల కోసం ఇప్పుడు సినీ లోకం మొత్తం వేచి చూస్తోంది. నిబంధనలను అతిక్రమించే నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ కార్మికుల సంఘం పట్టుబడుతోంది.