- 91% మందిలో గూడుకట్టుకున్న అసహనం
- 68% మందిపై అధికారుల అహంకారం
- 49% ఉద్యోగుల్లో వేతన వివక్ష.. మానసిక క్షోభ
- 45 % మందిని పీల్చి పిప్పి చేస్తున్న ఏజెన్సీలు
- 36 % మందికి అందని ఉద్యోగ భద్రత భరోసా
- ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ వాట్సాప్ సర్వే
సహనం వందే, హైదరాబాద్:
అనేక ప్రభుత్వ శాఖల్లో కీలకమైన పనులన్నీ భుజాన వేసుకుని నడిపిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస ప్రయోజనాలు అందక ఏజెన్సీల దోపిడీకి గురవుతూ వారు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ వెతలపై ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ నిర్వహించిన పోలింగ్ లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి.

సగం మందికి పైగా వేతన వివక్ష…
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో సగం మంది తీవ్రమైన వేతన వివక్షను ఎదుర్కొంటున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 26 శాతం మంది కోరుతుండగా, అదే ఆర్థిక ఇబ్బందుల వల్ల కలిగే మానసిక ఆవేదనను మరో 23 శాతం మంది పంచుకున్నారు. వెరసి 49 శాతం మంది ఉద్యోగులు నిత్యం ఆర్థిక ఇబ్బందులతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా తమకు అరకొర జీతాలిచ్చి కడుపు కొడుతున్నారని దాదాపు సగం మంది బాధితులు ముక్తకంఠంతో చాటిచెప్పారు.
68 శాతం మందిపై బానిసత్వపు ముద్ర…
ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ అంటేనే ఒక బానిస ముద్రగా మారింది. 41 శాతం మంది ఉద్యోగులు తాము చేస్తున్నది నూటికి నూరు శాతం వెట్టిచాకిరీ అని నినదించగా, మరో 27 శాతం మంది అధికారుల చిన్నచూపు, వివక్షకు గురవుతున్నామని వాపోయారు. అంటే మొత్తంగా 68 శాతం మంది ఉద్యోగులు ఆత్మగౌరవం లేని చోట కేవలం బానిసలుగా బతుకుతున్నామని కుండబద్దలు కొట్టారు. శ్రమ దోపిడీకి పరాకాష్టగా మారిన ఈ వ్యవస్థలో మర్యాద అన్నది మచ్చుకైనా లేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఏజెన్సీల దోపిడీపై 45 శాతం మంది కన్నెర్ర
జీతాల చెల్లింపులో జరుగుతున్న అరాచకాలపై దాదాపు 45 శాతం మంది ఏకతాటిపైకి వచ్చారు. మధ్యవర్తిత్వ ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేయాలని 15 శాతం మంది, గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా జీతాలు ఇవ్వాలని మరో 15 శాతం మంది డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఒకటో తేదీన జీతం అందక మరో 15 శాతం మంది విలవిలలాడుతున్నారు. వెరసి 45 శాతం మంది బాధితులు కేవలం ఏజెన్సీల కమీషన్ల కక్కుర్తి వల్ల, జీతాల జాప్యం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కమీషన్ల కక్కుర్తి ఆగిపోతేనే తమకు న్యాయం జరుగుతుందని వారు గర్జిస్తున్నారు.
భద్రత లేక 36 శాతం మంది విలవిల
ఉద్యోగ భద్రత అనేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎండమావిలా మారింది. ఐదేళ్ల సర్వీసు నిండిన వారిని రెగ్యులర్ చేయాలని 20 శాతం మంది, కాంట్రాక్ట్ హోదా ఇవ్వాలని 16 శాతం మంది డిమాండ్ చేస్తున్నారు. అంటే 36 శాతం మంది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై గ్యారంటీ లేక నిత్యం భయం భయంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏ అధికారికి కోపం వచ్చినా తమ ఉద్యోగం ఎక్కడ ఊడుతుందో అన్న భయం వారిని వెంటాడుతోంది. పదేళ్లు దాటిన వారిని క్రమబద్ధీకరించాలని 36 శాతం మంది ఉద్యోగులు కోరుతున్నారు.
91 శాతం మందిలో అంతులేని అసహనం
సర్వేలో వచ్చిన ఫలితాలు ప్రభుత్వ వైఫల్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. కేవలం 9 శాతం మంది మాత్రమే పరిస్థితి బాగానే ఉందని చెప్పారంటే… మిగిలిన 91 శాతం మంది ఉద్యోగులు వ్యవస్థపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టమవుతోంది. ఇందులో 3 శాతం మంది అసలు వ్యవస్థ మారుతుందన్న నమ్మకాన్నే కోల్పోయారు.
పాలకులు మేల్కోకపోతే…
ప్రభుత్వ యంత్రాంగం బండి చక్రాలు నడవాలంటే ఈ ఔట్ సోర్సింగ్ సైనికులు శ్రమించాల్సిందే. కానీ పాలకులు మాత్రం వీరిని కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు. ఓట్ల వేటలో ఉన్న నేతలు ఇప్పటికైనా ఈ అట్టడుగు శ్రామికుల కడుపు నింపడంపై దృష్టి సారించాలి. ఏజెన్సీల మాఫియాను తరిమికొట్టి, ఐదేళ్ల సర్వీసు ఉన్న ప్రతి ఒక్కరినీ గౌరవప్రదమైన హోదాలో గుర్తించాలి. అప్పుడే ఈ వ్యవస్థకు గౌరవం, ఈ బాధితులకు విముక్తి లభిస్తుంది.
నేను కూడా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిన్ ఈ దరిద్రపు బతుకులు బ్రతకడమే వేస్ట్