- ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి
- విగోవీ పేరుతో జనవరి నెల నుంచే విక్రయాలు
- ఇంజెక్షన్ లేకుండానే సులువుగా చక్కటిరూపం
- క్లినికల్ ట్రయల్స్ లో 16 శాతం తగ్గిన బరువు
- ఊబకాయంపై పోరులో నవశకం ఆరంభం
సహనం వందే, అమెరికా:
అతిగా పెరిగిన బరువుతో సతమతమవుతున్న వారికి గుడ్ న్యూస్. పొట్ట తగ్గించుకోవడానికి… ఒళ్లు కరిగించుకోవడానికి రోజూ సూదులు గుచ్చుకోవాల్సిన పని లేదు. సింపుల్ గా ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు.. కిలోల కొద్దీ బరువు మటాష్ అయిపోతుంది. అమెరికా ఆరోగ్య శాఖ తాజాగా ఆమోదించిన ఈ మ్యాజిక్ విగోవీ పిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
డెన్మార్క్ సంస్థ సంచలనం
ప్రముఖ ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ ఈ సరికొత్త మాత్రను రూపొందించింది. ఇప్పటి వరకు బరువు తగ్గేందుకు విగోవీ పేరుతో ఇంజెక్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంజెక్షన్లు అంటే భయపడే వారి కోసం కంపెనీ ఈ పిల్ వెర్షన్ ను తీసుకువచ్చింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనికి అధికారికంగా అనుమతులు ఇచ్చింది. ఈ రకమైన మాత్రకు ఆమోదం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
అద్భుతమైన ఫలితాలు…
ఈ మాత్ర పనితీరుపై నిర్వహించిన పరిశోధనల్లో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. 1300 మందిపై చేసిన ప్రయోగాల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. రోజుకు ఒక మాత్ర వేసుకున్న వారు సగటున 16.6 శాతం బరువు తగ్గారు. అంతేకాదు మూడో వంతు మంది ఏకంగా 20 శాతం అంతకంటే ఎక్కువ బరువు తగ్గడం విశేషం. ఇంజెక్షన్ ఎంత వేగంగా ఫలితాలను ఇస్తుందో ఈ మాత్ర కూడా అంతే ప్రభావవంతంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
భారీ పోటీ…
వచ్చే జనవరి నుంచి అమెరికాలో ఈ మాత్ర విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఓజెంపిక్ వంటి మందులు కేవలం మధుమేహం కోసం మాత్రమే రూపొందించారు. కానీ విగోవీ మాత్రను ప్రత్యేకంగా ఊబకాయం తగ్గించేందుకే తయారు చేశారు. ఎలి లిల్లీ వంటి దిగ్గజ కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న సమయంలో నోవో నార్డిస్క్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
స్టాక్ మార్కెట్లో జోరు
కొత్త మాత్రకు అనుమతి వచ్చిందన్న వార్తతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా దూసుకుపోయాయి. న్యూయార్క్ ట్రేడింగ్ లో నోవో నార్డిస్క్ షేర్ల విలువ ఏకంగా 10 శాతం పెరిగింది. గత ఏడాది లాభాల విషయంలో ఇబ్బందులు పడ్డ ఈ కంపెనీకి కొత్త మాత్ర పెద్ద ఊరటనిచ్చింది. సౌకర్యవంతంగా రోజుకు ఒక మాత్ర వేసుకునే వీలుండటంతో సామాన్యులు కూడా దీని వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.