- దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్
- దేశంలో ఏడో స్థానంలో నిలిచిన తెలంగాణ
- ఆకాశాన్ని అంటుతున్న రాష్ట్రాల అప్పులు
- బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధిక అప్పు
- సంక్షేమ పథకాలతో ఖాళీ అవుతున్న ఖజానా
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల హెచ్చరికలతో చర్చ
- ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే అంధకారమే
సహనం వందే, న్యూఢిల్లీ:
ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో కళకళలాడిన రాష్ట్రాలు ఇప్పుడు అప్పుల కుప్పగా మారుతున్నాయి. సంక్షేమం పేరుతో పంచుతున్న ఉచితాలు, అభివృద్ధి పనుల పేరుతో చేస్తున్న అప్పులు గుదిబండలా మారుతున్నాయి. కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్రాల తీరు మారడం లేదు. అసలు ఏ రాష్ట్రం ఎంత అప్పులో ఉందో తెలిపే తాజా గణాంకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి.

ఏడో స్థానంలో తెలంగాణ…
దేశంలో అధికారులు చేసిన టాప్ టెన్ రాష్ట్రాల్లో కేరళ మినహా దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాలు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. 33 శాతం అప్పులతో మూడో స్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా ఏపీలో సంక్షేమ పథకాలకు పెడుతున్న ఖర్చు అంతా అప్పుల నుంచే వస్తోంది. తెలంగాణలో కూడా పరిస్థితి ఆశాజనకంగా ఏమీ లేదు. అక్కడ 26.7 శాతం అప్పుల భారం ఉంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులు ఇప్పుడు భారంగా మారాయి. తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఖర్చులు ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయి.
నాలుగో స్థానంలో తమిళనాడు…
తమిళనాడు రాష్ట్రం 32 శాతం అప్పులతో నాలుగో స్థానంలో ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం అయినప్పటికీ అప్పుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించడం లేదు. అటు ఉత్తరప్రదేశ్ 30.2 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. భారీ జనాభా కలిగిన యూపీలో అభివృద్ధి పనులు జరుగుతున్నా అప్పుల భారం మాత్రం తగ్గడం లేదు. మధ్యప్రదేశ్ కూడా 30 శాతంతో అదే వరుసలో ఉంది. ఈ రాష్ట్రాలన్నీ ఆదాయానికి మించి ఖర్చు చేస్తూ అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయి.
అప్పుల కుప్పలో బెంగాల్ టాప్
దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం ఏకంగా 39.5 శాతానికి చేరింది. అంటే సంపాదన కంటే అప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ఖజానాపై తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. అప్పు తెచ్చి పప్పు కూడు అన్నట్లుగా బెంగాల్ పరిస్థితి తయారైంది. అక్కడ ఆర్థిక క్రమశిక్షణ తప్పిందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజకీయ అవసరాల కోసం చేస్తున్న ఖర్చులు రాష్ట్రాన్ని అగాధంలోకి నెడుతున్నాయి.
రాజస్థానూ అదే దారి
పశ్చిమ బెంగాల్ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. అక్కడ అప్పుల శాతం 37.3 శాతంగా నమోదైంది. గత ప్రభుత్వాలు ప్రకటించిన ఉచిత హామీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు లేకపోయినా విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. రాజస్థాన్ అప్పుల భారం చూసి ఆర్థిక నిపుణులు విస్తుపోతున్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో మూడో వంతు కంటే ఎక్కువ అప్పులే ఉండటం భవిష్యత్తుకు ప్రమాద సంకేతంగా మారుతోంది.
మహారాష్ట్రలో అత్యంత తక్కువ అప్పులు
అప్పుల విషయంలో గుజరాత్, మహారాష్ట్ర కొంత మెరుగైన స్థితిలో ఉన్నాయి. గుజరాత్ అప్పుల శాతం కేవలం 19.3 శాతంగా ఉంది. అలాగే మహారాష్ట్ర 18.2 శాతంతో అన్నిటికంటే తక్కువ అప్పులున్న రాష్ట్రంగా నిలిచింది. ఈ రెండు రాష్ట్రాలు తమ ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయి. పరిశ్రమల నుంచి వస్తున్న ఆదాయం అక్కడ ఆర్థిక వ్యవస్థను కాపాడుతోంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని పాటిస్తేనే అప్పుల భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
కేంద్రం సీరియస్ హెచ్చరిక
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అప్పుల భారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు తమ పరిమితికి లోబడి అప్పులు చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమని హెచ్చరించారు. కేవలం ఓట్ల కోసమే పథకాలు ప్రకటిస్తూ అప్పులు పెంచుకుంటూ పోతే జీతాలు చెల్లించడానికి కూడా నిధులు ఉండవని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రాలు మేల్కొని ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.