- ఏడాది తర్వాత మాట్లాడటంతో ఆసక్తి
- చంద్రబాబును లాగి మరీ ఏపీలో చిచ్చు
- వంట మనుషులతో ఒప్పందాలా అని ఎద్దేవా
- తనదైన శైలిలో రేవంత్ రెడ్డికి చురకలు
- ఇక తెలంగాణ కోసం యుద్ధం చేస్తానని ప్రతిన
సహనం వందే, హైదరాబాద్:
తెలుగు రాజకీయాల్లో ఆదివారం అసలైన హీట్ పుట్టింది. పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన కేసీఆర్… దాదాపు ఏడాది కాలం తర్వాత మళ్ళీ నోరు విప్పారు. తనదైన మార్కు విమర్శలతో అటు రేవంత్ రెడ్డిని, ఇటు చంద్రబాబును ఓ ఆట ఆడుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే భవిష్యత్ యుద్ధానికి సిద్ధమంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
సండే పొలిటికల్ మండే…
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మీటింగ్ పెట్టినా… విలేకరుల సమావేశంలో మాట్లాడినా తెలుగు రాష్ట్రాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయేవారు. చంద్రబాబుపై, ఇతర నేతలపై ఆయన చేసే కామెంట్స్ వైరల్ అయ్యేవి. అనేకమంది ఆయన ఉపన్యాసాన్ని ఎంజాయ్ చేసేవారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో నెలలుగా ఆయన బయటకు కనిపించలేదు. ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సాయంత్రం కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన విలేకరుల సమావేశాన్ని ఫాలో అయ్యారు. కేసీఆర్ సండే టాక్ ఆఫ్ ది పర్సన్ గా నిలిచారు.
ఫేక్ పెట్టుబడులంటూ బాబుపై ఫైర్…
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని కేసీఆర్ తేల్చిపారేశారు. ఈ విషయంలో రేవంత్ తన గురువు చంద్రబాబును మించిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో బాబు కూడా వంట మనుషులతో ఒప్పందాలు చేయించి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని డ్రామాలు ఆడారని గుర్తు చేశారు. అవే ఫేక్ ఒప్పందాలతో ఇప్పుడు రేవంత్ ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కాగితపు ఒప్పందాలతోనే పెట్టుబడులు వస్తే… ఆంధ్రాకు ఇప్పటికే లక్షల కోట్లు రావాలని చురకలు అంటించారు. ప్రధాని మోడీ చేసిన 14 లక్షల కోట్ల ఒప్పందాలు కూడా గ్యాస్ అని అప్పట్లోనే మధ్యప్రదేశ్ మంత్రి చెప్పారని బాంబు పేల్చారు.
అంతా రియల్ ఎస్టేట్ దందా…
రేవంత్ సర్కార్‌కు రైతుల సంక్షేమం కంటే భూముల వ్యాపారం మీదనే ధ్యాస ఎక్కువని కేసీఆర్ విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అనేది కేవలం రియల్ ఎస్టేట్ దందాలే తప్పా మరొకటి కాదని తేల్చేశారు. రైతులు పండించిన వడ్లు కొనే దిక్కు లేదు కానీ.. భూములు అమ్మడానికి మాత్రం ప్రభుత్వం తహతహలాడుతోందని మండిపడ్డారు. పొలాలకు యూరియా ఇచ్చే తెలివితేటలు కూడా ఈ పాలకులకు లేవని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేక నిద్రపోతుందా అని నిలదీశారు.
యుద్ధానికి సిద్ధం…
తెలంగాణ ప్రయోజనాల కోసం మళ్ళీ తానే మైదానంలోకి వస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం, రాష్ట్రం కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కేంద్రం మొండిచేయి చూపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజలను చైతన్యపరుస్తానని… అడుగడుగునా రేవంత్ సర్కార్‌ను నిలదీస్తానని కేసీఆర్ హెచ్చరించారు.