తెలంగాణలో 35 లక్షల ఓట్ల ఊచకోత? – ఓట్ల సవరణకు ఎన్నికల కమిషన్ నిర్ణయం

60 Lakh Voters Risk in Telangana - Chief Election Commissioner
  • హైదరాబాదులో సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడి
  • దీంతో రాష్ట్రంలోనూ భారీగా ఓట్ల తొలగింపు
  • ఇప్పటికే తమిళనాడులో 97 లక్షల ఓట్ల రద్దు
  • పశ్చిమ బెంగాల్ లో 58 లక్షలు తొలగించారు
  • ఓట్ల వేటతో బీజేపీ అధికారానికి రాచబాట!
  • విపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనే గల్లంతు
  • బీహార్ తరహాలో ఓట్ల సవరణ వ్యూహం
  • ఎన్నికల కమిషన్ చర్యల వెనుక భారీ కుట్ర

సహనం వందే, హైదరాబాద్:

దేశంలో ఎన్నికల నగారా మోగకముందే ఓట్ల రాజకీయం ముదిరింది. ఓటరు జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాయడం వెనుక అధికార బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య పునాదులనే కదిలించేలా సాగుతున్న ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రానుంది.

తెలంగాణలో ఓట్ల వేట

రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో త్వరలోనే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆదివారం బీఎల్వోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఒక్కో బీఎల్వోకు సగటున 930 మంది ఓటర్లు వస్తారని అంచనా వేశారు. ఇప్పటికే దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల ఏరివేత మొదలుకానుంది. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో 35లక్షలకు పైగా ఓట్లను తొలగించే అవకాశం ఉందని అంటున్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికే ఇదంతా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా లోపాయికారీగా వేరే లెక్కలు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.

తమిళనాడులో 97 లక్షల ఓట్లు రద్దు…
దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో ఓట్ల తొలగింపు వ్యవహారం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇక్కడ ఏకంగా 97 లక్షల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. గతంలో 6.41 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 5.43 కోట్లకు పడిపోయింది. ముఖ్యంగా చెన్నై నగరంలోనే 14.25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. కోయంబత్తూరులో మరో 6.5 లక్షల ఓట్లపై వేటు పడింది. ఇక్కడ అధికార పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనే ఇంత భారీగా ఓట్లు తొలగించడం వెనుక పెద్ద కుట్రే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారులు చెబుతున్న కారణాలు ఎవరికీ నమ్మశక్యంగా లేవు.

దీదీ కోటలో చిచ్చు…
పశ్చిమ బెంగాల్ లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ 58 లక్షల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఇది ముమ్మాటికీ బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడ అని మండిపడుతున్నారు. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గంలోనే లక్షలాది ఓట్లు గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో అసలైన ఓటర్లను జాబితా నుంచి తప్పిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందే ప్రతిపక్షాల ఓటు బ్యాంకును దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు కనిపిస్తున్నాయి.

గుజరాత్ రాజకీయ మతలబు…
బీజేపీకి కంచుకోట లాంటి గుజరాత్ రాష్ట్రంలో కూడా 73 లక్షల ఓట్లను తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. సొంత రాష్ట్రంలో కూడా ఓట్లు తొలగించాం కదా అని చెప్పుకోవడానికి బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాలు, ప్రాంతాల నుంచే ఓట్ల తొలగింపు ఎక్కువగా జరిగింది. అధికార పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో మాత్రం జాబితాను ఏమాత్రం కదల్చలేదని తెలుస్తోంది. నిష్పక్షపాతంగా చేస్తున్నామని లోకానికి చాటిచెప్పడానికే గుజరాత్ ను ఒక పావులా వాడుకుంటున్నారు.

ఈసీఐ తీరుపై అనుమానాలు
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై దేశవ్యాప్తంగా అపనమ్మకం పెరుగుతోంది. అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవాలని ఈసీఐ చెబుతున్నా… లక్షలాది మంది సామాన్యులు అధికారుల చుట్టూ తిరగడం అసాధ్యం. బీజేపీ ప్రభుత్వం చెప్పినట్లే ఈసీఐ నడుచుకుంటోందని రాహుల్ గాంధీ వంటి నేతలు పార్లమెంటులోనే గళమెత్తారు. విజయ్ వంటి కొత్త తరం నాయకులు కూడా ఈ తొలగింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితాను అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు.

భవిష్యత్తుపై ఆందోళనలు
త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఈ ఓట్ల గల్లంతు ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కేవలం కొన్ని వేల ఓట్లతోనే గెలుపోటములు తలకిందులయ్యే పరిస్థితుల్లో లక్షలాది ఓట్లను తొలగించడం అంటే ఎన్నికల ఫలితాలను ముందే ఫిక్స్ చేయడమేనని విమర్శలు వస్తున్నాయి. కేంద్రం జోక్యం వల్ల ఈసీఐ తన స్వయంప్రతిపత్తిని కోల్పోతోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఓట్ల వివాదం ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయ యుద్ధానికి తెరలేపింది. ప్రజల ఓటు హక్కును కాపాడటమే ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *