- ప్రైవేట్ కంపెనీలకు ‘విజయ’ బ్రాండ్ తాకట్టు
- మార్క్ ఫెడ్ అవినీతి అధికారుల ఇష్టారాజ్యం
- ఇటీవల ఒక రైతును అవమానించిన అధికారి
- ఆగ్రోస్ లో చైర్మన్, ఎండీల మధ్య అగాధం
- జీతాలు ఇవ్వలేని స్థితిలో విత్తన సంస్థ
- ఏడాది కిందట తుమ్మల ఆదేశాలతో విచారణ
- సమగ్ర నివేదికలు తయారుచేసిన ఐఏఎస్ లు
- అయినా ఇప్పటికీ బయటకు రాని రిపోర్టులు
సహనం వందే, హైదరాబాద్: అన్నదాతలకు అన్ని విధాలా సాయం చేయాల్సిన వ్యవసాయ కార్పొరేషన్లు ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్ల చేతిలో బందీలుగా మారాయి. అగ్రి కార్పొరేషన్లనన్నీ రైతుల ఆస్తులుగానే పరిగణించాలి… కానీ వాటిల్లో పని చేస్తున్న కొందరు అధికారులు తమ సొంత జాగీరులా భావించటం సంస్థల స్ఫూర్తికే విరుద్ధం. ఆ సంస్థల్లో వందల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని ఉద్యోగులే మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్లలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆ మేరకు కొందరు ఐఏఎస్ లు విచారణ కూడా చేశారు. కానీ ఆ విచారణ నివేదికలు ఏమైపోయాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏ సంస్థలపై విచారణ చేశారంటే?
రైతుబంధు సమితి, విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ, ఆగ్రోస్, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్, హాకా, మార్క్‌ఫెడ్, ఆయిల్ ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ, తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) వంటి కీలక సంస్థలపై ఐఏఎస్ అధికారులు విచారణ జరిపారు. ఆయా సంస్థల ఆస్తులు, ఆదాయాలు, అప్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.
‘విజయ’ బ్రాండ్ పతనం!
ఆయిల్ ఫెడ్ సంస్థలో కీలకమైన విజయ్ నూనె మార్కెట్లో తన వాటాలను పెంచుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ప్రైవేట్ కంపెనీలు దూసుకుపోతున్నా, తన వాటాను పెంచుకోలేకపోతోంది. అందుకు అవసరమైన ప్రచారం చేయడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రైవేట్ కంపెనీలతో కొందరు అధికారులు లాలూచీ పడినట్లు విమర్శలు ఉన్నాయి. నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలోనూ దాదాపు రూ. 300 కోట్లు అనవసరంగా కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. ఆయిల్ పామ్ మొక్కల్లోనూ అవినీతి అక్రమాలు జరిగినట్లు విమర్శలు వచ్చాయి. మాజీ ఎండీ సురేందర్ హయాంలో అక్రమాలు జరిగినట్లు సమాచారం. ఆయిల్ ఫెడ్ ను పూర్తిగా ప్రీ యూనిక్ ఆక్రమించిందన్న విమర్శలు ఉన్నాయి. భవిష్యత్తులో ఆ ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ వెళ్లిపోతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవినీతి పుట్ట మార్క్ ఫెడ్…
మార్క్‌ఫెడ్ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఎరువుల రవాణా టెండర్లలో గుత్తాధిపత్యం నడుస్తుంది. ఇటీవల జొన్నలను వ్యాపారులకు అత్యంత నష్టానికి విక్రయించారు. అందులో కొందరు అధికారులకు కోట్ల రూపాయలు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ సంస్థను లూటీ చేసే అధికారం తమకు ఉందని భావిస్తుండటం శోచనీయం. రెండు విభాగాలకు కీలకమైన ఇద్దరు అధికారులు కొన్నేళ్లుగా తిష్ట వేసి అందిన కాడికి దోచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం ఒక సీనియర్ అధికారి దగ్గరికి ఒక రైతు వెళితే అవమానపరిచి వెనక్కి పంపించినట్లు విమర్శలు ఉన్నాయి. ఎరువుల గురించి తెలుసుకోవడానికి ఆ రైతు సంబంధిత అధికారిని కలిశాడు. ‘గెటవుట్ ఫ్రమ్ మై చాంబర్’ అని ఆ అధికారి తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు వ్యాపారులతో మర్యాదగా మాట్లాడి వారిని తన ఛాంబర్ లో కూర్చోబెట్టడం విమర్శలకు దారి తీసింది. మార్క్ ఫెడ్ లోకి రైతులు రాకూడదా? ఇది వారి జాగీరా? అని కొందరు రైతులు మండిపడుతున్నారు.
ఆగ్రోస్ లో చైర్మన్ వర్సెస్ ఎం’ఢీ’
వ్యవసాయ యంత్రాలను సరఫరా చేయడంలో ఈ సంస్థ కీలకంగా వ్యవహరించాలి. యంత్రాల ధరలను ఖరారు చేయాలి. కానీ వ్యవసాయ యాంత్రీకరణ పథకమే అమలుకాకపోవడంతో, ఆగ్రోస్ కార్పొరేషన్ నిర్వీర్యమైపోతోంది. ఇదిలా ఉండగా ఆ సంస్థలో ప్రస్తుతం అమలవుతున్న కొన్ని పథకాలను పక్కన పెడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. చైర్మన్, ఎండీల మధ్య తీవ్రమైన అగాధం నెలకొంది. పెట్రోల్ బంకుల మంజూరు విషయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు నెలకొన్నట్లు చర్చ జరుగుతుంది. కొందరు నిరుద్యోగులు బంకుల కోసం దరఖాస్తు చేసి మూడు నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. కానీ సమస్యను పరిష్కరించడం లేదు.
ప్రైవేట్ గోదాములకు లబ్ధి…
వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా గోదాములను నిర్వహించాలి. కానీ చాలాసార్లు ప్రైవేట్ గోదాములకు లబ్ధి చేకూర్చే విధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఈ కార్పొరేషన్‌లో జిల్లా మేనేజర్లుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఉండటం విశేషం. రెగ్యులర్ పద్ధతిలో ఉద్యోగులను నియమించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలేకుండా పోయింది.
హాకాలో శనిగెల కుంభకోణం…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు హాకాలో శనిగెల కుంభకోణం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో శనగపప్పును రాయితీ ధరతో అనేక రాష్ట్రాల్లో వినియోగదారులకు అమ్మాలని ఆ సంస్థ నిర్ణయించింది. కానీ వినియోదారులకు అమ్మాల్సిన పప్పును కొందరు వ్యాపారులకు విక్రయించి కోట్లు దండుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో ఆ సంస్థ ఎండీగా సురేందర్ ఉన్నారు. ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా విస్తరించడం గమనార్హం. కానీ ఇప్పటివరకు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దాదాపు రూ. 30 కోట్లు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.