తల్లి అయ్యింది… అందం పోయింది – కత్రీనా కైఫ్ బొద్దుగా మారడంపై ట్రోలింగ్

After Marriage Katrina Kaif
  • మాతృత్వంపై సోషల్ మీడియా నరకం
  • బిపాసా బసు, ఐశ్వర్యరాయ్ పైనా కూతలు
  • సమీరారెడ్డి డిప్రెషన్… బయటకు రాలేని స్థితి
  • సౌందర్యపు సంకెళ్ళు… మాతృత్వ గాయాలు

సహనం వందే, ముంబై:

ఒక నటి రెండు దశాబ్దాల పాటు కష్టపడి స్టార్‌డమ్ తెచ్చుకున్నా… 350 కోట్ల రూపాయల సామ్రాజ్యం నిర్మించినా… బిడ్డకు జన్మనిచ్చాక మాత్రం సోషల్ మీడియాకు అవేవీ కనిపించవు! వారి కళ్లకు కనిపించేదల్లా పొట్ట ఎంత పెరిగింది, ముఖంలో మెరుపు తగ్గిందా అని మాత్రమే. ‘బార్బీ’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది… అదేంటంటే, ‘మహిళగా ఉండటం అత్యంత కష్టమైన పని’ అని. బాలీవుడ్ భామల పరిస్థితి చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది!

బొద్దుగా కత్రీనా కైఫ్
ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకలకు కత్రీనా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్‌తో కలసి వచ్చింది. బాబు పుట్టిన తర్వాత ఆమె బయట కనిపించడం ఇదే తొలిసారి. ప్రసవం తర్వాత ఎంతో ప్రశాంతంగా కనిపించిన ఆమెను చూసి మెచ్చుకుంటారనుకుంటే సీన్ రివర్స్ అయింది. నెటిజన్లు ఆమె ముఖం, శరీరాన్ని జూమ్ చేసి చూస్తూ విపరీతంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. కాస్త లావైందని… కెరీర్ అయిపోయిందంటూ తీర్పులు చెప్పేశారు. కత్రీనా ఒకవైపు ‘కే బ్యూటీ’ బ్రాండ్ ద్వారా 350 కోట్ల రూపాయల బిజినెస్ రన్ చేస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. కానీ ఈ ఘనతలేవీ సోషల్ మీడియా పండితులకు పట్టలేదు. తొమ్మిది నెలలు ఒక ప్రాణాన్ని మోసి జన్మనిచ్చిన తల్లి శరీరం మారడం సహజం. కానీ ఈ కనీస స్పృహ లేకుండా ఆన్‌లైన్‌లో జడ్జిమెంట్లు పాస్ చేయడం ఒక రోతగా మారింది.

బిపాసా బసు… సమీరారెడ్డిలకూ తిప్పలు
ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచే బిపాసా బసు కూడా ఇలాంటి వేధింపులనే ఎదుర్కొంది. తన కుమార్తె దేవి జన్మించిన తర్వాత ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెగ బాధపడింది. నలభై ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చినప్పుడు, మ్యాజిక్ జరిగినట్లు ఇరవై ఏళ్లనాటి శరీరాకృతిని ఎలా సాధిస్తారని ఆమె ప్రశ్నించింది. సమీరా రెడ్డి అనుభవం మరింత దారుణమైనది. ప్రసవం తర్వాత ఏకంగా 105 కిలోల బరువు పెరగడంతో తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. సమాజం నుంచి వచ్చిన నెగెటివిటీ, సొంత మనుషుల మాటల కారణంగా ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా భయపడింది.

ఐశ్వర్య రాయ్ బరువు పైన కూడా…
ఈ రకమైన వేధింపులు ఇప్పటివి కావు. ఒకప్పుడు ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా దీనికి బలయ్యారు. ఆరాధ్య జన్మించిన ఆరు నెలల తర్వాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లినప్పుడు, ఐశ్వర్య బరువుపై ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణలు చేశారు. ఆ సమయంలో అభిషేక్ బచ్చన్ జోక్యం చేసుకుని, తన భార్య ఒక ‘సూపర్ మామ్’ అని గట్టిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ప్రసవం తర్వాత ఒక మహిళ కోలుకోవడానికి నిర్దిష్ట సమయం అంటూ ఏదీ ఉండదు. కానీ సోషల్ మీడియాలో పాత ఫోటోలను, ఇప్పటి ఫోటోలను పక్కపక్కనే పెట్టి మీమ్స్ చేయడం ట్రెండ్‌గా మారింది. దీనివల్ల పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌లో ఉన్న మహిళలు మరింత మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు.

సమాజంలో విషసంస్కృతి…
సెలబ్రిటీలను చూసి సమాజం సాధారణ గృహిణులపై కూడా అలాంటి అంచనాలనే రుద్దుతోంది. కాన్పు కాగానే వెంటనే సన్నబడిపోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషసంస్కృతి సమాజంలో ప్రతీ ఇంటినీ ప్రభావితం చేస్తోంది. ఒక ప్రాణానికి జన్మనిచ్చే ప్రక్రియలో స్త్రీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఆ మార్పులను గౌరవించడం నేర్చుకోవాలి కానీ, విమర్శలకు సాధనంగా మార్చకూడదు. మహిళలు అంటే కేవలం కనిపించే బాహ్య సౌందర్యం మాత్రమే కాదు. వారి శ్రమ, సాధించిన విజయాలు, ఒక తల్లిగా వారు పడే వేదన అంతకంటే గొప్పవి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *