ఎస్‌బీఐలో రెండున్నర కోట్ల జీతంతో జాబ్స్ – బ్యాంకింగ్ రంగం చరిత్రలోనే భారీ ప్యాకేజ్

Highest Package Jobs in SBI
  • సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు ఈ ఆఫర్
  • ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లకు అవకాశం
  • ఈనెల 24వ తేదీ దరఖాస్తుకు తుది గడువు

సహనం వందే, హైదరాబాద్:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఉద్యోగం సాధించడం అనేకమంది కల. అయితే ఒక ప్రభుత్వ బ్యాంకులో సంవత్సరానికి ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల వరకు జీతం ఆఫర్ చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఎస్‌బీఐ చరిత్రలోనే అత్యధిక ప్యాకేజీలతో సీనియర్ పొజిషన్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు భారీ ఆఫర్
చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డీన్ వంటి అత్యున్నత స్థాయి పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో మారుతున్న సాంకేతికత, సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎస్‌బీఐ ఈ నియామకాలను చేపడుతోంది. ఈ పోస్టుల్లో అత్యంత ప్రధానమైన గ్రూప్ సీనియర్ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల వార్షిక వేతనాన్ని అందించనున్నారు. అంటే నెలకు దాదాపు 20 లక్షల రూపాయలకు పైగానే జీతం లభిస్తుంది. ఈ పోస్టుకి ఎంపికైన అభ్యర్థులు ముంబై కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.

Highest Package Jobs in SBI

15 నుండి 20 ఏళ్ల అనుభవం…
అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కనీసం 15 నుండి 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయోపరిమితి 2026 ఆగస్టు 31 నాటికి 57 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కనీసం యాభై శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వంటి విభాగాలలో డిగ్రీ ఉన్నవారు అర్హులు. వీటితో పాటు ఎంసీఏ, ఎంటెక్ లేదా ఎంఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు పోటీ పడవచ్చు.

మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్… డీన్ పోస్టులు
ఈ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుతో పాటు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డీన్ వంటి మరిన్ని సీనియర్ స్థాయి పోస్టులను కూడా భర్తీ చేస్తోంది. బ్యాంకింగ్ నెట్‌వర్క్ విస్తరణ, విద్యా నిర్వహణ విభాగాల్లో సమర్థవంతమైన వారిని నియమించుకోవడమే ఎస్‌బీఐ ప్రధాన లక్ష్యం. ఈ పోస్టులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.

ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ…
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 24 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గడువు ముగియడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నందున అర్హులైన నిపుణులు త్వరగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించడం మంచిది. పూర్తి వివరాల కోసం ఎస్‌బీఐ అధికారిక కెరీర్స్ పోర్టల్ లో చెక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ మోసాలను అరికట్టడమే లక్ష్యం…
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే… ఐటీ, సైబర్ సెక్యూరిటీ రంగాలకు బ్యాంకింగ్ సెక్టార్ లో ఎంతటి డిమాండ్ ఉందో తెలుస్తోంది. డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలను నివారించడం బ్యాంక్‌లకు సవాలుగా మారింది. అందుకే కార్పొరేట్ కంపెనీలకు పోటీగా ఎస్‌బీఐ కూడా కోట్ల రూపాయల భారీ ప్యాకేజీలు ఇవ్వడానికి ముందుకు వస్తోంది. నైపుణ్యం, అనుభవం ఉంటే ప్రభుత్వ రంగంలోనూ భారీ అవకాశాలు ఉంటాయని ఈ నోటిఫికేషన్ నిరూపిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *