- సోనియా ఆత్మకథ… రాజకీయ ప్రకంపనలు
- నవంబర్ 10వ తేదీన లక్ష కాపీలతో విడుదల
- ఇందిరా, రాజీవ్ హత్యలపై అత్యంత ఆవేదన
- ప్రధానమంత్రి ఆఫర్ తిరస్కరణపై క్లారిటీ
సహనం వందే, హైదరాబాద్:
రాజకీయాల్లోకి రానని చెప్పిన ఒక గృహిణి దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగారనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇందిరా గాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా సోనియాగాంధీ ఎదుర్కొన్న ఒడిదుడుకులతో కూడిన ఆత్మకథ ఇప్పుడు మార్కెట్లోకి రాకముందే సంచలనం సృష్టిస్తోంది.
రాజకీయాలను శాసించిన విషాదాల నీడల...
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన రాజకీయ, వ్యక్తిగత జీవిత విశేషాలను పుస్తక రూపంలో ప్రపంచం ముందుకు తీసుకువస్తున్నారు. బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో రాబోతున్న ఈ ఆత్మకథపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పుస్తకంలో సోనియా గాంధీ తన జీవితంలోని అత్యంత కీలకమైన, విషాదకరమైన మలుపులను చాలా స్పష్టంగా ప్రస్తావించారు. 1984లో తన అత్త, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురికావడం ఆమెను ఎంతగానో కుదిపేసింది. ఆ తర్వాత సరిగ్గా ఏడేళ్లకు తన భర్త, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కూడా హత్యకు గురికావడంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. పరిస్థితుల ప్రభావంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.

ప్రధాని పదవి ఆఫర్ తిరస్కరణ…
కాంగ్రెస్ పార్టీ స్వయంగా ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ సోనియా గాంధీ దానిని సున్నితంగా తిరస్కరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు పార్టీని నడిపించిన ఆమె చివరకు 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ రాజకీయ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లు, సంఘర్షణలను ఆమె ఈ పుస్తకంలో రాశారు.
అనుభవాలు… బాల్యపు జ్ఞాపకాలు
తన జీవిత విశేషాలను అక్షర రూపంలో పెట్టడం తనకు అంత సులువైన విషయం కాదని సోనియా గాంధీ భావోద్వేగంతో తెలిపారు. దానికోసం ఆమె తన మనసులోని అత్యంత రహస్యాలు, ఎవరికీ చెప్పని అనుభవాలు అలాగే మరువలేని జ్ఞాపకాలను బయటపెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇటలీలోని ఒక చిన్న పట్టణంలో గడిపిన తన సాధారణ బాల్యం నుంచి ఈ ప్రయాణం ప్రారంభమైందని ఆమె గుర్తుచేసుకున్నారు. రాజీవ్ గాంధీ భార్యగా, ప్రధాని ఇందిరా గాంధీ కోడలిగా భారతదేశంలో తాను గడిపిన సంక్లిష్టమైన సంవత్సరాల వరకు ఈ కథ సాగుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తన కథలో అల్లుకున్న ప్రేమ, విశ్వసనీయత ప్రతీ పేజీలోనూ స్పష్టంగా కనిపించడం ప్రారంభించాయని ఆమె రాసుకొచ్చారు.
నవంబర్ 10న గ్రాండ్ రిలీజ్…
ఈ సంచలన ఆత్మకథ నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా రిలీజ్ కానుంది. ఈ పుస్తకానికి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఏకంగా లక్ష కాపీలతో తొలి ముద్రణ వేయడానికి ముద్రణా సంస్థ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇటలీ నుంచి భారతదేశానికి సోనియా గాంధీ చేసిన సుదీర్ఘ ప్రయాణమే ఈ పుస్తకంలో అత్యంత ప్రధానాంశంగా ఉండనుంది. రాజీవ్ గాంధీతో వివాహం, రాజకీయాల్లోకి రాకముందు ఆమె గడిపిన ప్రశాంతమైన జీవితం… అలాగే ఆ తర్వాత ఎదురైన రాజకీయ సవాళ్లు అన్నీ ఇందులో వివరిస్తారని సమాచారం అందుతోంది.
మధుర జ్ఞాపకాలు… చేదు అనుభవాలు
దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో తాను అనుభవించిన మధుర జ్ఞాపకాలను, చేదు అనుభవాలను ఆమె ఈ పుస్తకం ద్వారా పాఠకులకు పూర్తిగా అందించనున్నారు. ఈ పుస్తకంపై నెలకొన్న వివాదాలు, చర్చలు దానిపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. ఈ ఆత్మకథ కేవలం ఒక సాధారణ రాజకీయ పుస్తకం మాత్రమే కాదని… ఒక అగ్రనేత జీవిత ప్రయాణమని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. రాహుల్, ప్రియాంక గాంధీలు తమ తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.