ఇన్‌స్టా సైన్యం… రోడ్డుపై మౌనం -కాక్రోచ్ జనతా పార్టీ దుస్థితి

Cockroach Janta Party
  • సోషల్ మీడియాలో యువత యాక్టివ్
  • ఢిల్లీ పోరాటంలో కనిపించని నేటితరం
  • ఇన్‌స్టాలో కోట్లు… రోడ్డుపై వందల మందే
  • పెరిగిన గూఢచర్యం… తిరగబడని యువతరం

సహనం వందే, న్యూఢిల్లీ:

డిజిటల్ స్క్రీన్లపై విప్లవం గర్జిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పోరాటం మాత్రం వెనకడుగు వేస్తోంది. కోట్ల మంది సోషల్ మీడియా సైన్యం నిరసన క్షేత్రానికి ఎందుకు రావడం లేదు? భారీ నిఘా నీడ… పోలీసుల భయం యువతను కట్టడి చేస్తోందా? భారతదేశ విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉన్న వేళ పాలకుల మౌనం పెను సవాలుగా నిలుస్తోంది. దేశంలో యువ విప్లవం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి.

ఇంటర్నెట్ తెరలపై కోట్లాది మంది గర్జన
వర్చువల్ ప్రపంచంలో కాక్రోచ్ జనతా పార్టీకి 1.9 కోట్ల మంది సైన్యం కనిపిస్తోంది. ఈ సంఖ్య బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకంటే ఎక్కువ. కానీ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చేసరికి ఆ సంఖ్య కేవలం 300 నుంచి 500 మందికి పడిపోతోంది. డిజిటల్ వేదికలపై సింహాలుగా విరుచుకుపడే భారత యువత… క్షేత్రస్థాయిలో ఎందుకు వెనకడుగు వేస్తోంది? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నినాదాలకే పరిమితమా?
డిజిటల్ విప్లవం ఒక భ్రమగా మారుతోంది. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండటం వేరు, రోడ్లపైకి వచ్చి పోరాడటం వేరు. కాక్రోచ్ జనతా పార్టీకి లభిస్తున్న భారీ డిజిటల్ మద్దతును చూస్తుంటే యువతలో తీవ్రమైన అసహనం ఉన్నట్లు స్పష్టమవుతోంది. కానీ ఆ అసహనం కేవలం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, కామెంట్ బాక్సులకే పరిమితమవుతోంది. వాస్తవ ప్రపంచంలో జరగాల్సిన ఉద్యమ గమనం ఎక్కడికక్కడ ఆగిపోతోంది.

నిఘా నీడలో భయం
యువత వెనకడుగు వేయడానికి అతిపెద్ద కారణం ప్రభుత్వ నిఘా. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులను పోలీసులు భయపెడుతున్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల నీడలో నిరసనకారుల కదలికలను రికార్డ్ చేస్తున్నారు. నిరసనలో పాల్గొనే వారి ఆధార్, పాన్ కార్డు వివరాలను పోలీసులు సేకరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఉద్యమిస్తే తమ కెరీర్, భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే భయం యువతను ఇళ్లకు పరిమితం చేస్తోంది.

నిరాశలో వాంగ్చుక్
ఒకవైపు క్షేత్రస్థాయిలో నిరసనల తీవ్రత తగ్గినా సోనం వాంగ్చుక్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్రం నుంచి కనీస స్పందన లేదు. ఆయన్ను పరామర్శించడానికి రాజకీయ నేతలు వస్తున్నా ఉద్యమాన్ని మాత్రం ఎవరూ భుజానికి ఎత్తుకోవడం లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న మౌన వ్యూహం ఇప్పుడు నిరసనకారుల్లో మరింత నిరాశను, నైరాశ్యాన్ని నింపుతోంది.

నిరుద్యోగపు చిచ్చు
భారతదేశంలో 40 శాతం మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా మారుతున్నారు. అయినా ఎందుకు పెద్ద ఎత్తున స్పందన లేదు? దీనికి కారణం రాజకీయ నిస్సహాయత. ప్రతిపక్షాలు తమ సొంత రాజకీయ ఎజెండాలతో బిజీగా ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ వంటి స్వతంత్ర ఉద్యమాలు, రాజకీయ పార్టీలతో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేని ఈ వాతావరణం నిరసనను బలహీనపరుస్తోంది.

మారాల్సిన వ్యూహం
డిజిటల్ పోరాటంలో ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఆన్‌లైన్ వ్యతిరేకతను ప్రదర్శించుకోవడం మాత్రమే. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఆర్థిక, సామాజిక, నిఘా పరమైన సవాళ్లను అధిగమించకుండా మార్పు రాదు. ఆన్‌లైన్ లో ఉన్న 1.9 కోట్ల మందిలో కనీసం పది శాతం మంది రోడ్డుపైకి వస్తే పాలకులు దిగిరాక తప్పదు. ఆ ధైర్యం భారత యువత ఎప్పుడు చేస్తుందో చూడాలి.

నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే…
సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, నీట్ యూజీ వంటి పేపర్ లీకులతో వేల మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. 11 మంది విద్యార్థుల ఆత్మహత్యలు మన విద్యా వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. అయినా మనం కేవలం స్క్రీన్ల మీద మాత్రమే నిరసన తెలుపుతున్నాం. నిఘా యంత్రాంగాన్ని చూసి భయపడితే వ్యవస్థను మార్చడం ఎప్పటికీ సాధ్యం కాదు. డిజిటల్ ప్రపంచంలో గర్జించే యువత, క్షేత్రస్థాయిలో సింహంలా ఎప్పుడు గర్జిస్తుందో కాలమే నిర్ణయించాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *