- దశాబ్దాల బంధం ముగింపుకు తగ్గేదేలే…
- పెరిగిన సగటు ఆయుర్దాయం ప్రధానం
- మరోవైపు మారిన సామాజిక విలువలు
- ఆర్థిక స్వేచ్ఛతో వ్యక్తిగత సంతోషమే లెక్క
- ఒంటరిగా జీవించగలమనే ధైర్యమే ధీమా
- బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధన
సహనం వందే, హైదరాబాద్:
జీవితం చరమాంకంలోకి అడుగుపెడుతున్న వేళ జంటల మధ్య దూరం పెరుగుతోంది. ఏళ్లుగా సాగిన సంసారాలు ఇప్పుడు విడాకుల బాట పడుతున్నాయి. పిల్లలు పెద్దలై వేరు కావడం, రిటైర్మెంట్ తర్వాత ఖాళీ సమయం పెరగడం వెనుక ఉన్న అసలైన చిచ్చును రగిలిస్తోంది. మనిషి జీవిత కాలం పెరగడంతో ఇప్పుడు కొత్త జీవితం కోరుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమదైన సంతోషం కోసం పాత బంధాలకు స్వస్తి పలుకుతున్నారు.
పెరిగిన విడాకుల వేగం
ప్రపంచవ్యాప్తంగా 1990లో 50 ఏళ్లు పైబడిన వారిలో విడాకుల శాతం కేవలం 8గా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 2022 నాటికి 65 ఏళ్లు పైబడిన వారిలో విడాకుల శాతం ఏకంగా 15.2కి చేరింది. 1990లో ఇది కేవలం 5.2 శాతంగానే ఉండేది. అంటే ఈ మూడు దశాబ్దాల్లోనే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగింది. నేడు విడాకులు తీసుకుంటున్న వారిలో ప్రతి 10 మందిలో ఒకరు 65 ఏళ్లు పైబడిన వారే కావడం గమనార్హం.
ఆయుష్షు పెరగడంతో విడాకులు వైపు…
ఆరోగ్యకరమైన జీవనశైలితో ఇప్పుడు మనిషి ఆయుష్షు బాగా పెరిగింది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటితే ముసలితనం అనుకునే వారు. కానీ ఇప్పుడు 70 ఏళ్లు వచ్చినా యువతలాగే ఫీలవుతున్నారు. బతకడానికి ఇంకా చాలా సమయం ఉందని తెలియడంతో కొందరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. సుదీర్ఘకాలం ఒకే బంధంలో ఉండి విసుగు చెందిన వారు ఇప్పుడు స్వేచ్ఛగా బతకాలని నిర్ణయించుకుంటున్నారు.
ఆర్థిక స్వేచ్ఛతో ధైర్యం
మహిళలు ఇప్పుడు ఆర్థికంగా స్వతంత్రులుగా మారుతున్నారు. తమకు తాముగా బతకగలమనే నమ్మకం పెరిగింది. ఆస్తిపాస్తులు, పెన్షన్లు, పొదుపు పథకాలతో ఆర్థిక ఇబ్బందులు లేని వారు విడిపోయేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఆర్థిక భరోసా ఉండటంతో అణచివేతను లేదా అసంతృప్తిని భరించడం కంటే విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. డబ్బు సమస్యలు తీరడంతో భాగస్వామిపై ఆధారపడాల్సిన అవసరం తగ్గింది.
ఖాళీ గూడు చిచ్చు
పిల్లలు పెద్దలై ఉద్యోగ రీత్యా వేరే ఊర్లకు వెళ్లిపోతున్నారు. ఇన్నాళ్లూ పిల్లల కోసమే కాపురం నెట్టుకొచ్చిన తల్లిదండ్రులు ఇప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇంట్లో పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోతోంది. ఏ విషయమైనా పంచుకోవడానికి ఇద్దరి మధ్య ఉమ్మడి లక్ష్యాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఈ ఖాళీ గూడు సిండ్రోమ్ బంధాల్లో పెద్ద చిచ్చు పెడుతోంది.
పునర్వివాహాల వెనుక రిస్క్
బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం గతంలో జరిగిన విడాకుల వల్ల కొందరు రెండోసారి పెళ్లి చేసుకున్నారు. మొదటి పెళ్లి కంటే రెండో పెళ్లి విడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది. 1970లలో విడాకులు చూసిన వారే ఇప్పుడు ముసలితనంలో విడాకులు తీసుకుంటున్నారు. పాత తరం వారిలా రాజీ పడి బతకడానికి నేడు సిద్ధంగా లేరు.
సమాజంలో మారిన దృక్పథం
విడాకులు అంటే సమాజంలో ఉన్న తక్కువ చూపు ఇప్పుడు తగ్గిపోయింది. పెళ్లి అంటే జీవితాంతం కలిసి బతకాలని ఎవరూ కండిషన్ పెట్టడం లేదు. మనిషి సంతోషమే ప్రధానమని భావిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు, మనస్పర్థలు ఎదురైనప్పుడు ఆ బంధాన్ని కొనసాగించడం కంటే విడిపోవడమే మంచిదని డిసైడ్ అవుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బంధాల్లో కూడా మార్పులు వస్తున్నాయి.