పవన్ మెరుపు… ఎందుకీ ఉలుకు – ఫాంహౌస్ వివాదాన్ని పక్కదారి పట్టించే చర్య!

Pawan Kalyan Politics
  • అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్
  • అడుగు వెనుక అసలు వ్యూహమిదేనా?
  • ఆశల పల్లకిలో పవన్… బీజేపీతో ముందడుగు

సహనం వందే, హైదరాబాద్:

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయ తెరపైకి దూసుకొచ్చారు. ఫామ్ హౌస్ వివాదం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసుల వరకు అనేక ఆరోపణలు చుట్టుముడుతున్న వేళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. ఆంధ్ర రాజకీయ పరిమితులను అధిగమించి, సరిహద్దులు దాటి ఆయన చేస్తోన్న ఈ రాజకీయ విన్యాసాలు వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి?

రగిలిన వివాదాల మంటలు
పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు వివాదాల వలయం అల్లుకుంది. ఆయన ఫామ్ హౌస్ చెరువు శిఖం భూమిలో ఉందనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని, భూమిని కబ్జా చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆయన రాజకీయ విశ్వసనీయతపై నీలి నీడలు కమ్మేలా చేశాయి. ఈ ఇబ్బందుల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆయన తెలంగాణ అజెండాను ముందుకు తెచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.

టార్గెట్ తెలంగాణ…
జూబ్లీహిల్స్ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి బాంబు పేల్చారు. ఏపీలో చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో జనసేనకు తగినంత ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. భవిష్యత్తులో నారా లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న తరుణంలో ఏపీలో సొంతంగా ఎదిగేందుకు స్పేస్ లేదని పవన్ భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.

బీజేపీతో రహస్య పొత్తు
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, కవిత వంటి ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ పవన్… జాతీయ స్థాయిలో బీజేపీకి మాత్రం కొమ్ము కాశారు. ఏపీలో బీజేపీతో కలిసి ఉన్న పవన్ అదే బాటలో ఇక్కడ కూడా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, జనసేనను పావుగా వాడుకుంటోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కొండగట్టు ఆలయానికి ఏపీ తరపున సాయం చేయడం ద్వారా తన హిందూత్వ ముద్రను కూడా ఆయన బలంగా చాటుకున్నారు.

ప్యాకేజీ స్టార్ విమర్శలు
కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి పవన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పవన్ కుమ్మక్కయ్యారని… అందుకే ప్యాకేజీ స్టార్ లాగా తెలంగాణలో రంగప్రవేశం చేశారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏ వ్యూహంతో వస్తున్నా తెలంగాణ రాజకీయాల్లో ఆ పార్టీ యాక్టివిటీ పెంచడం ఖాయమని స్పష్టమవుతోంది. అధికారంలోకి రావాలనే ఆశ ఉందో లేక ఓట్లను చీల్చే ప్లాన్ ఉందో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాలి.

తమిళనాడు ప్రభావం
తమిళనాడులో విజయ్ నేరుగా రాజకీయాల్లోకి వచ్చి 27 నెలల వ్యవధిలోనే సత్తా చాటడం పవన్ కళ్యాణ్ ను ఆలోచనలో పడేసింది. ఏపీలో ఆ అవకాశం లేకపోవడంతోనే తెలంగాణ వైపు చూపు మరల్చారని తెలుస్తోంది. పవన్ గురించి వస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనను విమర్శించే వారిని కుక్కలతో పోలుస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఉన్న తీవ్ర అసహనాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణే ఆయనకు ఏకైక ఆశ్రయంగా కనిపిస్తోంది.

ఊపుమీదున్న బీజేపీ…
రాబోయే 3 ఏళ్లలో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది. బెంగాల్ ఎన్నికల గెలుపుతో ఊపుమీదున్న బీజేపీ తెలంగాణపై కన్నేసింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపి ఉండవచ్చనే వాదన బలంగా ఉంది. జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా కూటమిగా బరిలోకి దిగుతుందా అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు రాజకీయ వేడిని పెంచడం ఖాయం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *