- డ్రాగన్ నిర్ణయంపై అంతర్జాతీయ సంచలనం
- అత్యున్నత స్థాయి వ్యక్తులపై మరణ శాసనం
- ఆ దేశ కమ్యూనిస్టు పార్టీలో ప్రకంపనలు
- జిన్‌పింగ్ అవినీతి వేట… సైన్యంలో ప్రక్షాళన
సహనం వందే, చైనా:
లంచం తీసుకుంటే మన దగ్గర ఏమవుతుంది? ఏళ్ల తరబడి విచారణ సాగుతుంది. మహా అయితే పదవి పోతుంది. కానీ అదే చైనాలో జరిగితే? ఏకంగా మరణ శిక్షే! అవును… చైనాలో ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు కోర్టు మరణ శిక్ష విధించింది. దేశ రక్షణను పక్కన పెట్టి పైసల కోసం పాకులాడితే ఎలా ఉంటుందో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రుచి చూపించారు. అసలు ఏం జరిగింది? ఆ ఇద్దరు జనరళ్లు చేసిన తప్పేంటి? అవినీతి కారణంగా అత్యంత శక్తివంతులైన ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు మరణ శిక్ష విధించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
మరణం ముంగిట మాజీ మంత్రులు
జనరల్ వే ఫీంఘే, జనరల్ లీ షాంగ్‌ఫు ఇప్పుడు మృత్యువు అంచున నిలబడ్డారు. వీరికి సైనిక న్యాయస్థానాలు గురువారం మరణ శిక్షను ఖరారు చేశాయి. అయితే దీనికి రెండేళ్ల గడువు ఇచ్చారు. అంటే వారి ప్రవర్తన బాగుంటే ఆ శిక్ష జీవిత ఖైదుగా మారుతుంది. చైనా చరిత్రలో ఇంతటి ఉన్నత స్థాయి అధికారులకు ఇటువంటి కఠిన శిక్షలు పడటం ఇదే మొదటిసారి. చైనా అధికారిక సంస్థ ఈ వివరాలను ప్రపంచానికి వెల్లడించింది.

లంచాల లెక్కలు తేలాయి
ఈ ఇద్దరు జనరళ్లు పదవిలో ఉన్నప్పుడు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. వే ఫీంఘే లంచాలు తీసుకున్నట్లు నిర్ధారణ కాగా… లీ షాంగ్‌ఫు ఒక అడుగు ముందుకేసి లంచాలు తీసుకోవడంతో పాటు ఇతరులకు ఆశ చూపినట్లు తేలింది. వీరిద్దరూ అరెస్టయిన మొదటి నుంచే జిన్‌పింగ్ తన దూకుడును పెంచారు. సైనిక ఉన్నతాధికారుల మధ్య సాగుతున్న ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచి మరీ వేటు వేశారు. అత్యున్నత హోదాలో ఉండి కూడా స్వలాభం కోసం పాకులాడటమే వీరి పతనానికి నాంది పలికింది.
100 మంది సీనియర్ అధికారులపై వేటు…
గడచిన కొన్నేళ్లుగా చైనా సైన్యంలో ప్రక్షాళన తీవ్రస్థాయిలో జరుగుతోంది. కేవలం ఈ ఇద్దరే కాకుండా దాదాపు 100 మంది సీనియర్ అధికారులు పదవుల నుంచి తప్పుకున్నారు. వాషింగ్టన్ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం వీరంతా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. గత నెలలో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ఈ ప్రక్షాళన ఆగదని స్పష్టం చేశారు. సైన్యంలో అవినీతిని ఏమాత్రం సహించేది లేదని ఆయన గట్టిగా చెబుతున్నారు.
విధేయతకు దెబ్బ తగిలితే అంతే
సైన్యంలో అవినీతి కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదని జిన్‌పింగ్ భావిస్తున్నారు. అధికారులు సొంతంగా ఆస్తులు కూడబెట్టుకుంటే కమ్యూనిస్ట్ పార్టీపై వారికి ఉండే విధేయత తగ్గిపోతుందని ఆయన నమ్మకం. జిన్‌పింగ్ పట్ల నమ్మకద్రోహం చేసినా లేదా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్లినా శిక్ష తప్పదని ఈ తీర్పు రుజువు చేస్తోంది. లంచాల వ్యామోహం సైనిక సామర్థ్యాన్ని నీరుగారుస్తుందని చైనా నాయకత్వం భయపడుతోంది. అందుకే ఎంతటి వారినైనా వదిలిపెట్టడం లేదు.
అంతర్జాతీయ విశ్లేషణల వేడి
చైనాలో జరుగుతున్న ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఉన్నత స్థాయి అధికారులను ఇలా శిక్షించడం వల్ల సైన్యం బలహీనపడుతుందా లేక పటిష్టమవుతుందా అనే చర్చ మొదలైంది. రక్షణ మంత్రులనే జైలుకు పంపడం ద్వారా జిన్‌పింగ్ తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నారు. పౌర సమాజం, సైన్యంపై తన పట్టు ఎంత బలంగా ఉందో ఆయన నిరూపిస్తున్నారు.
ఖైదీలుగానే మిగిలిన జీవితం
ప్రస్తుతానికి మరణ శిక్ష పడినా వారు చనిపోయే వరకు జైలు గదులకే పరిమితం కానున్నారు. రెండేళ్ల గడువు తర్వాత సాధారణంగా ఇలాంటి శిక్షలను జీవిత ఖైదుగా మారుస్తారు. అంటే మిగిలిన జీవితాన్ని వారు చీకటి గదుల్లోనే గడపాలి. ఒకప్పుడు ప్రపంచ వేదికలపై చైనా సైనిక బలాన్ని ప్రదర్శించిన వీరు ఇప్పుడు అవినీతి ముద్రతో పతనం కావడం గమనార్హం. జిన్‌పింగ్ చేపట్టిన ఈ ప్రక్షాళన మున్ముందు ఇంకెంత మందిని బలి తీసుకుంటుందో అన్న ఆందోళన అక్కడ సైనిక వర్గాల్లో నెలకొంది.