- అధికారం చలాయించిన రాష్ట్రాల్లో అంతం
- ఎర్రకోటలన్నీ బీటలు.. లెఫ్ట్ కథ కంచికే
- పశ్చిమ బెంగాల్‌లో రెండు సీట్లకే పరిమితం
- దేశవ్యాప్తంగా అడుగంటిన ఓటు బ్యాంకు
- నాయకత్వంలో గూడుకట్టుకున్న నిర్లక్ష్యం
- నాయకుల నిర్వాకంతో మార్క్సిజంలో కల్లోలం
సహనం వందే, హైదరాబాద్:
భారత రాజకీయ యవనికపై ఒక అజేయ శకం ముగిసింది. దశాబ్దాల పాటు ఎర్రజెండా రెపరెపలాడిన కేరళ గడ్డపై కమ్యూనిజం కుప్పకూలిపోయింది. సిద్ధాంత వైరాగ్యం, పాలనా వ్యతిరేకత వెరసి లెఫ్ట్ పార్టీలను అధికారం లేని అనాథలుగా మార్చాయి. 2026 ఎన్నికల ఫలితాలు భారత కమ్యూనిస్టు చరిత్రలో ఒక రాజకీయ శవ పంచనామాగా మిగిలిపోయాయి.
కేరళ కంచుకోట బద్ధలు
భారతదేశంలో కమ్యూనిస్టులకు చివరి అండగా ఉన్న కేరళ రాష్ట్రం ఇప్పుడు వారి చేయి దాటిపోయింది. 1977 తర్వాత దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఎర్ర ప్రభుత్వం లేకపోవడం ఇదే మొదటిసారి. దాదాపు 50 ఏళ్లుగా వెలుగుతున్న ఎర్రదీపం ఇప్పుడు పూర్తిగా ఆరిపోయింది. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై కేరళ ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పట్టం కట్టారు. ఈ ఓటమి లెఫ్ట్ పార్టీల జాతీయ అస్తిత్వానికే పెద్ద సవాలుగా మారింది.

పాతాళానికి ఓటు బ్యాంకు
ఎర్రజెండాకు చివరి ఊపిరిగా ఉన్న కేరళలో ప్రస్తుత ఎన్నికల ఫలితాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. సీపీఐ, సీపీఎం ఉమ్మడి ఓటు బ్యాంకు 28.2 శాతానికి పడిపోయింది. 2006లో 81 సీట్లతో 39.9 శాతం ఓట్లు కొల్లగొట్టిన లెఫ్ట్ ఇప్పుడు కేవలం 34 సీట్లకు పరిమితమైంది. 2021లో 79 సీట్లు, 34.3 శాతం ఓట్లతో బలంగా ఉన్న పార్టీ కేవలం ఐదేళ్లలో సగానికి సగం పడిపోయింది. 2001లో 32 సీట్లు వచ్చినా 30.4 శాతం ఓట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ కనీస స్థాయిని కూడా కోల్పోయి అస్తిత్వ పోరాటంలో ఉంది.
బెంగాల్‌లో శూన్య హస్తం
పశ్చిమ బెంగాల్‌లో ఎర్రదళం పతనం అత్యంత ఘోరంగా కనిపిస్తోంది. 2001లో 192 సీట్లు, 2006లో ఏకంగా 227 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 2 సీట్ల కోసం వెతుక్కుంటోంది. 2006లో 48.4 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీ ఇప్పుడు 4.4 శాతానికి పడిపోయింది. 2021లో సున్నా సీట్లకు పరిమితమైన లెఫ్ట్ ఈసారి 2 సీట్లు సాధించినా ఓటు షేర్ మాత్రం 5.7 నుండి మరింత దిగజారింది. 34 ఏళ్ల నిరంతర పాలన సాగించిన నేల మీద ఇప్పుడు కమ్యూనిస్టుల ఉనికి పతనావస్థకు చేరింది.
అధికారం లేని అనాథలు
భారతదేశ చరిత్రలో గత 60 ఏళ్లలో కమ్యూనిస్టులు ఏ ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితి ఎప్పుడూ లేదు. త్రిపురలో 25 ఏళ్ల సుదీర్ఘ పాలన ముగిసిన తర్వాత అక్కడ కోలుకునే ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు కేరళ చేజారడంతో దేశవ్యాప్తంగా ఎర్రజెండాకు అధికార పీఠం మృగ్యమైంది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో కింగ్ మేకర్‌గా ఉన్న పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కంటే అధ్వాన్నంగా మారాయి. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా అమలు చేయడంలో వైఫల్యమే ఈ పతనానికి ప్రధాన కారణం.
పార్లమెంటులో మూగబోయిన గొంతు
జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన వామపక్షాల బలం ఇప్పుడు లోక్‌సభలో శూన్యమైంది. 2004లో 64 స్థానాలతో యూపీఏ ప్రభుత్వాన్ని శాసించిన వీరు ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను కూడా కోల్పోయే స్థితికి చేరారు. కేరళలో కనీస సీట్లు రాకపోవడంతో పార్లమెంటులో వీరి ప్రాతినిధ్యం నామమాత్రంగా మారింది. ఢిల్లీ పీఠంపై ఒత్తిడి తెచ్చే శక్తిని కోల్పోయి జాతీయ రాజకీయాల్లో వీరి గొంతు పూర్తిగా మూగబోయింది. ఇది కమ్యూనిస్టు చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం.
యువతకు అందని మార్క్సిజం
వామపక్షాల పతనానికి నాయకత్వ లోపమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. యువ ఓటర్లను ఆకర్షించడంలో లెఫ్ట్ దారుణంగా విఫలమైంది. ప్రజలు ఒకటి ఆలోచిస్తుంటే వీరు మరొకటి చేయడంతో యువత చికాకు పడుతున్నారు. అభివృద్ధి, డిజిటల్ యుగానికి తగినట్లుగా సిద్ధాంతాలను మలచుకోకపోవడం వల్ల యువత క్రమంగా పక్కకు తప్పుకుంది. కేరళలో పెరిగిన నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం ప్రజలను అసహనానికి గురిచేశాయి. సిద్ధాంతాలు కడుపు నింపవని సామాన్యుడు తీర్పు ఇచ్చాడు. పార్టీలో కింది స్థాయి నుంచి పొలిట్ బ్యూరో స్థాయి వరకు భారీ ప్రక్షాళన జరిగితే తప్ప ఇక కోలుకోవడం కల్లే.