- 90 లక్షల ఓట్ల తొలగింపుతో మారిన తలరాత
- తొలగింపులు జరిగిన చోట బీజేపీ విజయభేరి
- 147 స్థానాల్లో ప్రతీ చోట 25 వేల ఓట్లు ఔట్
- అందులో 95 చోట్ల బీజేపీ ఏకపక్షంగా గెలుపు
- పశ్చిమ బెంగాల్ కోటపై కాషాయపు జెండా
సహనం వందే, పశ్చిమ బెంగాల్:
పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై పెను మార్పు సంభవించింది. 15 ఏళ్ల మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చేస్తూ బీజేపీ చారిత్రక విజయం సాధించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన ఈ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతు కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది.
ఓట్ల కోతతో మారిన తలరాత
ఓటర్ల జాబితాలో జరిగిన ప్రత్యేక సవరణ ప్రక్రియ తృణమూల్ కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తీసింది. రాష్ట్రవ్యాప్తంగా 90,83,345 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. నకిలీ ఓట్లు, చనిపోయిన వారి పేర్లను ఏరివేసే క్రమంలో ఈ భారీ మార్పులు జరిగాయి. ఈ తొలగింపులు జరిగిన నియోజకవర్గాల్లో బీజేపీ అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఓటర్ల గల్లంతు వల్ల తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని తృణమూల్ ముందే ఆందోళన వ్యక్తం చేసినా ప్రయోజనం లేకపోయింది.

నియోజకవర్గాల వారీగా వేటు…
రాష్ట్రంలోని 147 నియోజకవర్గాల్లో ప్రతీ చోట 25 వేలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ స్థానాల్లో బీజేపీ ఏకపక్షంగా 95 సీట్లు గెలుచుకుంది. అధికారంలో ఉన్న తృణమూల్ కేవలం 51 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒకే ఒక సీటు దక్కింది. ఓట్ల తొలగింపు ఎక్కువగా ఉన్న చోట అధికార పార్టీకి ప్రజలు షాక్ ఇచ్చారు. ఎన్నికల సంఘం నిర్ణయం పరోక్షంగా బీజేపీకి మేలు చేసినట్లు కనిపిస్తోంది.
ఓట్ల తొలగింపును బట్టి ఫలితాలు…
ఓట్ల తొలగింపు సంఖ్యను బట్టి ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 15,000 నుంచి 25,000 ఓట్లు పోయిన 67 సీట్లలో బీజేపీ 47 చోట్ల గెలిచింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ 19 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. అదేవిధంగా 5,000 నుంచి 15,000 మధ్య ఓట్లు తొలగించిన 62 స్థానాల్లో బీజేపీ 50 సీట్లు కొల్లగొట్టింది. మిగిలిన 12 సీట్లు తృణమూల్ వశమయ్యాయి. 5,000 కంటే తక్కువ ఓట్లు తొలగించిన 13 నియోజకవర్గాల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.
ముర్షిదాబాద్ జిల్లాలో పెను మార్పు
బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో ఓట్ల తొలగింపు అత్యధికంగా నమోదైంది. ముర్షిదాబాద్ జిల్లాలో ఏకంగా 4.55 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. గతంలో ఈ జిల్లాలో 22 సీట్లకు గానూ 20 సీట్లు గెలిచిన తృణమూల్ ఈసారి 9 స్థానాలకే పడిపోయింది. మైనారిటీ ఓట్లు చీలడం, హిందూ ఓట్లు బీజేపీ వైపు కేంద్రీకృతం కావడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సరిహద్దు సమస్యలు ఈ ఫలితాల్లో కీలక పాత్ర పోషించాయి.
ఉత్తర పరగణాల కోట పతనం
ఉత్తర 24 పరగణాలు, మాల్దా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఉత్తర 24 పరగణాల్లో 3,25,666 మంది ఓట్లు తొలగించారు. ఇక్కడ గతంలో 28 సీట్లు గెలిచిన తృణమూల్ ఇప్పుడు కేవలం 8 సీట్లకే పరిమితమైంది. మాల్దాలో 2,39,375 ఓట్లు తొలగించగా తృణమూల్ బలం 8 నుంచి 6కు పడిపోయింది. మిగిలిన సీట్లను బీజేపీ కైవసం చేసుకుని తన బలాన్ని నిరూపించుకుంది. మమతా బెనర్జీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్ల తొలగింపు పార్టీని కుంగదీసింది.
ఎన్నికల సంఘం కసరత్తు వివరాలు
నవంబర్‌లో ఓటర్ల సంఖ్య 7.66 కోట్లుగా ఉంది. డిసెంబర్‌లో విడుదలైన డ్రాఫ్ట్ జాబితాలో 58.20 లక్షల మందిని తొలగించారు. ఫిబ్రవరి 28 నాటికి ఈ సంఖ్య 63.66 లక్షలకు చేరింది. ఆ తర్వాత 60.06 లక్షల కేసులను జ్యుడీషియల్ రివ్యూకు పంపారు. అందులో 27,16,393 మందిని అనర్హులుగా తేల్చారు. వెరసి 90.83 లక్షల ఓట్ల తొలగింపు జరిగింది. ఈ పరిణామం బెంగాల్ పీఠం నుంచి తృణమూల్‌ను దించేసి బీజేపీని కూర్చోబెట్టింది.