నేటి తరం అప్పుల మయం – ఫ్యాషన్ కోసం ఫైనాన్స్ ఉచ్చు

GenZ Loans
  • తీవ్రమైన అప్పుల్లో జెన్ జెడ్ కుర్రాళ్ళు
  • ఈఎంఐల గుప్పిట్లో నేటి యువత
  • ఖాళీ అవుతున్న జేబులు… టెన్షన్లో జీవితాలు
  • క్లిక్కుతో కష్టం… తీరని బాకీల భారం

సహనం వందే, హైదరాబాద్:

దేశంలో నేటి తరం రుణగ్రహీతలు పుట్టుకొస్తున్నారు. డిజిటల్ లెండింగ్ పుణ్యమా అని 30 ఏళ్ల లోపు యువత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్, వేలి చివరన లోన్ యాప్స్ ఉండటంతో అవసరం లేకున్నా అప్పులు చేస్తున్నారు. చిన్న వయసులోనే లక్షల రూపాయల బాకీలతో కుర్రకారు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అప్పు తీసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది.

జేబుకు చిల్లు పెడుతున్న యాప్స్
దేశ జనాభాలో సగం మంది ఉన్న 30 ఏళ్ల లోపు యువత ఇప్పుడు దేశంలోని మొత్తం రుణగ్రహీతల్లో 25 శాతానికి చేరారు. సీఆర్ఐఎఫ్ హై మార్క్ గణాంకాల ప్రకారం తొలిసారి అప్పు తీసుకునే వారిలో సగం మంది ఈ జెడ్ జనరేషన్ వారే ఉంటున్నారు. కేవలం 30 వేల నుండి 40 వేల రూపాయల జీతం వచ్చే యువకులు కూడా 30 నుండి 40 లక్షల రూపాయల అప్పులు మోస్తున్నారు. ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇచ్చే పర్సనల్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు వీరిని ఆకర్షిస్తున్నాయి. ఇన్‌స్టంట్ లోన్ల మత్తులో పడి చెల్లించాల్సిన వాయిదాల గురించి ఆలోచించడం లేదు.

GenZ  || Smart Phone || Loan Apps

ఫ్యాషన్ కోసం ఫైనాన్స్ ఉచ్చు
షాపింగ్ బిల్లు 1,200 రూపాయలు దాటితే చాలు దానిని ఈఎంఐలుగా మార్చేస్తున్నారు. సైకాలజీ చదువుతున్న రోజా అనే విద్యార్థి కేవలం 1,200 రూపాయల మూడు టాప్స్ కొని నెలకు 400 రూపాయల చొప్పున వాయిదాలు చెల్లిస్తోంది. ఇలా చిన్న చిన్న మొత్తాలతో మొదలై చివరికి పెద్ద అప్పులుగా మారుతున్నాయి. జీతం కంటే ఈఎంఐలే ఎక్కువగా ఉంటున్నాయి. 50 వేల రూపాయల లోపు తీసుకున్న రుణాల్లో 26 శాతం మంది 90 రోజుల కంటే ఎక్కువ కాలం బకాయిలు చెల్లించడం లేదు. ఇది ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారుతోంది.

క్రెడిట్ కార్డుల చక్రబంధం
యువత ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తున్నారు. పూణేకు చెందిన 29 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త ఒకరు కేవలం ఇన్‌స్టంట్ ఆఫర్ల మోజులో పడి 54 లోన్ అకౌంట్ల ద్వారా 40 లక్షల రూపాయల అప్పు చేశాడు. అలాగే ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల శిఖ వర్మ విహారయాత్రల కోసం 50 వేల నుండి 5 లక్షల రూపాయల వరకు లోన్లు తీసుకుంది. చాలామంది యువకులు 8 నుండి 9 క్రెడిట్ కార్డులను వాడుతూ ఒకదాని బాకీని మరొకదానితో సర్దుబాటు చేస్తున్నారు. దీనివల్ల వడ్డీలు పెరిగిపోయి అసలు కట్టలేని స్థితికి చేరుకుంటున్నారు.

లక్షల అప్పులు… వేల జీతాలు
ప్రస్తుతం 27 శాతం పర్సనల్ లోన్లు కేవలం విహారయాత్రల కోసమే తీసుకుంటున్నారు. ఇందులో 71 శాతం మంది టైర్ 2, టైర్ 3 పట్టణాల వారే ఉండటం గమనార్హం. జెడ్ జనరేషన్ గ్రాడ్యుయేట్లు 30 శాతం తక్కువ జీతాలు పొందుతున్నారు. కానీ ఖర్చులు మాత్రం రెట్టింపు అయ్యాయి. గృహోపకరణాలు, గ్యాడ్జెట్లు, ప్రయాణాల కోసం అప్పులు చేయడం వీరి జీవనశైలిలో భాగమైపోయింది. బ్యాంకుల్లో పొదుపు చేయడం కంటే క్రెడిట్ కార్డులను గరిష్టంగా వాడటమే గొప్పగా భావిస్తున్నారు.

రికవరీ ఏజెంట్ల వేధింపుల పర్వం
అప్పులు కట్టలేక పోవడంతో రికవరీ ఏజెంట్ల వేధింపులు మొదలవుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో కాల్స్, ఇంటికి రావడం వంటి సంఘటనలతో యువత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పూణే యువకుడి విషయంలో అప్పు పరిష్కార సంస్థ జోక్యం చేసుకుని 40 లక్షల బాకీని 5 లక్షల రూపాయలకు తగ్గించాల్సి వచ్చింది. ఇలాంటి బాధితులు ప్రతి నెలా వందల సంఖ్యలో అప్పుల పరిష్కార సంస్థలను ఆశ్రయిస్తున్నారు. 26 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 65 శాతం మంది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుండి అప్పులు తీసుకున్నవారే.

భవిష్యత్తుపై పెరుగుతున్న భయం
డిజిటల్ బ్యాంకింగ్‌పై 83 శాతం మంది యువతకు నమ్మకం ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అవగాహన లోపిస్తోంది. కేవలం రివార్డులు, డిస్కౌంట్ల కోసమే 46 శాతం మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. 36 శాతం మంది కేవలం సౌలభ్యం కోసం అప్పులు చేస్తున్నారు. ఈ డూమ్ స్పెండింగ్ సంస్కృతి వల్ల 47 శాతం మంది జెడ్ జనరేషన్ యువత అసలు పొదుపు చేయలేకపోతున్నారు. ఫలితంగా వీరు ఇళ్లు కొనడం లేదా కుటుంబాలను ప్రారంభించడం వంటి కీలక నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *