అమ్మాయి కాదు అమ్మోరు – మ్యానోస్పియర్… మహిళలపై మగ శత్రుత్వం

GenZ - Male Hates Female
  • పెళ్లంటే నూరేళ్ల మంట అంటున్న యువతరం
  • దీంతో మూడు ముళ్ల బంధం మాయం
  • లైంగిక వాంఛలపైనా మోజులేని జెన్ జెడ్
  • ప్రపంచవ్యాప్తంగా డేటింగ్ సంక్షోభం
  • అంటువ్యాధిలా ఒంటరితనం..పెరిగిన సింగిల్స్
  • ఆన్‌లైన్ యాప్స్ తెచ్చిన అనుమానం

సహనం వందే, హైదరాబాద్:

జీవితం అంటే ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నడవడమే అని మన తాతలు చెప్పారు. కానీ నేడు ఆ చేతులు కేవలం ఫోన్లనే పట్టుకుంటున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద ఒంటరి దీవిలా మారుతోంది. మనుషుల మధ్య దూరం పెరిగింది. ప్రేమ సామ్రాజ్యంలో చీకటి అలుముకుంది. ఈ నిశ్శబ్ద యుద్ధం వెనుక ఉన్న అసలు నిజాలను లియా గ్రీన్ తన అన్వేషణలో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు.

ఒంటరి పక్షుల వింత లోకం
ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ఉండేవారి సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం. కానీ నేడు అది ఒక భారంగా మారింది. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో యువత పెళ్లి అనే మాటకే భయపడుతున్నారు. సహజీవనం అనే అందమైన కల కూడా నేడు చెదిరిపోతోంది. మనుషులు ఒకరితో ఒకరు కలిసి జీవించడానికి ఇష్టపడటం లేదు. గతంలో ఇద్దరు మనుషులు కలిసి నిర్మించుకున్న ఇళ్లు నేడు ఒంటరి వ్యక్తుల నిశ్శబ్ద నిలయాలుగా మారుతున్నాయి. సామాజిక నిర్మాణం మొత్తం అతలాకుతలం అవుతోంది.

Manosphere - Men Hates Women

మ్యానోస్పియర్ తెచ్చిన ముప్పు
డేటింగ్ ప్రపంచం నాశనం కావడానికి ప్రధాన కారణం మ్యానోస్పియర్ అని లియా గ్రీన్ స్పష్టం చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో మగవారిలో మహిళల పట్ల ద్వేషాన్ని పెంచే గ్రూపులు పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. దీనివల్ల పురుషులు మహిళలను కేవలం శత్రువులుగా లేదా వస్తువులుగా చూడటం మొదలుపెట్టారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాల వల్ల అమ్మాయిలను నమ్మకూడదనే ధోరణి అబ్బాయిల్లో బలపడుతోంది. ఫలితంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశమే మృగ్యమవుతోంది. ఆరోగ్యకరమైన సంభాషణలకు చోటు లేకుండా పోయింది.

పడకగదిలో మిగిలిన నిశ్శబ్దం
కొన్ని దేశాలలో శృంగారం పట్ల కూడా విరక్తి పెరుగుతోంది. పడకగదిలో ఉండాల్సిన పలకరింపులు ఇప్పుడు మౌనానికి చిరునామాలుగా మారుతున్నాయి. యాంత్రిక జీవనంలో పడి మనుషులు స్పర్శలోని మాధుర్యాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం డిజిటల్ వ్యసనం, అధిక పని ఒత్తిడి. మనుషులు ఎదుటి వ్యక్తితో సమయం గడపడం కంటే ఫోన్లతో కాలక్షేపం చేయడానికే మొగ్గు చూపుతున్నారు. పడకగదిలో కూడా భాగస్వామితో మాట్లాడకుండా సోషల్ మీడియాలో మునిగిపోవడం వల్ల శారీరక సాన్నిహిత్యం పూర్తిగా దెబ్బతింటోంది.

స్వేచ్ఛ కోసం పెళ్లికి టాటా
ప్రపంచవ్యాప్తంగా వివాహ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది. పెళ్లి చేసుకుంటే తమ స్వేచ్ఛ హరించుకుపోతుందనే భయం యువతలో బలంగా కనిపిస్తోంది. గతంలో పెళ్లి అనేది ఒక సామాజిక అవసరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఒంటరిగా ఉండటం అనేది ఒక హోదాగా మారుతోంది. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఎంతో ఎదిగారు. రక్షణ కోసం పురుషుడిపై ఆధారపడాల్సిన అవసరం వారికి లేదు. ఒక స్వతంత్ర మహిళ తన కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేస్తోంది లేదా పూర్తిగా వద్దనుకుంటోంది. పురుషులు కూడా కుటుంబ భారాలను మోయడానికి సిద్ధంగా లేరు.

డేటింగ్ వెనుక ఆర్థిక కష్టాలు
పెరుగుతున్న జీవన వ్యయం కూడా డేటింగ్ సంక్షోభానికి ఒక కారణం. ఒకరిని కలవాలన్నా, బయటకు తీసుకెళ్లాలన్నా అది ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. ఒక డేట్‌కు వెళ్లడం కంటే ఇంట్లో ఉండి నెట్‌ఫ్లిక్స్ చూడటం చౌక అని చాలామంది భావిస్తున్నారు. ఆర్థిక భద్రత లేనిదే బంధంలోకి వెళ్లకూడదనే నియమం పెట్టుకోవడం వల్ల చాలామంది డేటింగ్‌కు దూరంగా ఉంటున్నాయి. డబ్బు లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి తోడు కోసం వెతకడం మానేస్తున్నారు. దీనివల్ల సహజీవనం చేసే వారి రేటు కూడా పడిపోతోంది.

ఆన్‌లైన్ యాప్స్ తెచ్చిన అనుమానం
ఒకప్పుడు ప్రేమలో నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి అడుగులో అనుమానం కనిపిస్తోంది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ వచ్చిన తర్వాత మనుషులు ఆప్షన్లుగా మారిపోయారు. ఒకరు నచ్చకపోతే ఇంకొకరు అనే ధోరణి వల్ల స్థిరమైన బంధాలు ఏర్పడటం లేదు. డేటింగ్ యాప్‌లో వందల ప్రొఫైల్స్ ఉండటం వల్ల ఎవరినీ పూర్తిగా నమ్మలేని పరిస్థితి నెలకొంది. నిజమైన ప్రేమ మాయమై కేవలం పైపై మెరుగులు మాత్రమే మిగిలాయి. మనుషులు మళ్ళీ ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకోకపోతే మానవ సంబంధాలు కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితం అవుతాయి.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *