- డబ్బు, అధికారం కేంద్రంగా జర్నలిజం
- అక్షరాలు అమ్ముడుపోయాయి
- అంతర్జాతీయ నివేదికల ఆగ్రహం
- వార్తల్లో మగువ మాయమవుతుందని ఫైర్
- స్త్రీ వార్తలకు పడిపోయిన ప్రాధాన్యత
సహనం వందే, హైదరాబాద్:
ప్రపంచం ఎంత డిజిటల్ మాయాజాలంలో మునిగితేలుతున్నా మహిళల పట్ల వివక్ష మాత్రం పాతాళానికి చేరుతోంది. కృత్రిమ మేధస్సు సాయంతో మహిళలపై జరుగుతున్న హింస కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకవైపు అమానవీయ ఘటనలు పెరుగుతుంటే మరోవైపు మీడియా వాటిని విస్మరిస్తోంది. ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న ఈ ఘోరాలపై లోతైన చర్చ అవసరం.
పడిపోయిన ప్రాధాన్యత
యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెంటర్ ఫర్ జర్నలిజం అండ్ డెమోక్రసీ, గ్లోబల్ మీడియా మానిటరింగ్ ప్రాజెక్ట్ నివేదిక ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ వార్తలను విశ్లేషిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 2017 నుండి 2025 మధ్య కాలంలో ప్రచురితమైన 114 కోట్ల కథనాలను పరిశీలిస్తే మహిళలపై వేధింపుల వార్తలు దారుణంగా తగ్గిపోయాయి. 2018లో ‘మీ టూ’ ఉద్యమ సమయంలో 2.2 శాతంగా ఉన్న ఈ కవరేజీ 2025 నాటికి 1.3 శాతానికి పడిపోయింది. ఆఫ్రికా వంటి దేశాల్లో లైంగిక హింస విపరీతంగా ఉన్నా అక్కడ వార్తా ప్రాధాన్యత 1.18 శాతానికే పరిమితమైంది. ఇది కేవలం గణాంకం కాదు మీడియా బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
ఎప్ స్టీన్ కేసులో విస్మరణ
జెఫ్రీ ఎప్ స్టీన్ ఉదంతం ప్రపంచాన్ని కుదిపేసినా వార్తల్లో అసలు విషయం మరుగున పడింది. సుమారు 10 లక్షల కథనాలను పరిశీలిస్తే మహిళలపై హింస అనే పదం కేవలం 0.1 శాతం వార్తల్లోనే ఉంది. అధికారం, డబ్బు వంటి పదాలకు 26 శాతం ప్రాధాన్యత ఇచ్చారు. బాధితుల గురించి చాలా తక్కువ ప్రస్తావన వచ్చింది. మూల కారణాలను వదిలేసి కేవలం సెలబ్రిటీల చుట్టూ వార్తలు తిరగడం శోచనీయం. దీనివల్ల అసలైన సామాజిక మార్పు రావడం లేదు.

పెరిగిన డిజిటల్ వేధింపులు
ప్రస్తుతం ఆన్‌లైన్ ప్రపంచంలో మహిళలపై దాడులు ప్రమాదకరంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మంది మహిళలు డిజిటల్ వేధింపులకు గురవుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ శారీరక లేదా లైంగిక దాడిని ఎదుర్కొంటోంది. గడిచిన 12 నెలల్లోనే ప్రతి 9 మందిలో ఒకరు పురుషుల చేతిలో హింసకు గురయ్యారు. అయినా మీడియాలో ఈ అంశాలపై చర్చ జరగకపోవడం బాధాకరం. సామాజిక కట్టుబాట్ల వల్ల బయటపడని కేసులు ఇంకా ఎన్నో ఉంటాయి.
పురుషు గొంతుకలే ఎక్కువ…
మహిళల సమస్యలపై వచ్చే వార్తల్లో కూడా పురుషులకే పెద్దపీట వేస్తున్నారు. ప్రతి ఒక మహిళా గొంతుకకు బదులుగా 1.5 మంది పురుషుల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిపుణుల విషయానికి వస్తే 24 శాతం మంది పురుషులు మాట్లాడుతుంటే మహిళలు కేవలం 17 శాతమే ఉంటున్నారు. సారా మాచారియా పరిశోధన ప్రకారం మహిళలను కేవలం వస్తువులుగా చూపే ధోరణి ఇంకా కొనసాగుతోంది. బాధితుల గొంతు నొక్కేస్తూ పురుషాధిక్యత రాజ్యమేలుతోంది.
జెండర్ ఐడియాలజీ కుట్ర
మహిళల హక్కులను కాలరాసేందుకు జెండర్ ఐడియాలజీ అనే పదాన్ని ఆయుధంగా వాడుతున్నారు. 2020 నుండి 2025 మధ్య ఈ పదం వాడకం 42 రెట్లు పెరిగింది. అమెరికా మీడియాలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇది మహిళా సమానత్వాన్ని దెబ్బతీసే కుట్రగా నిపుణులు భావిస్తున్నారు. ప్రాథమిక హక్కుల కంటే వివాదాస్పద పదజాలానికే మీడియా ప్రాముఖ్యత ఇస్తోంది. దీనివల్ల అసలైన సమస్యలు పక్కదారి పడుతున్నాయి.
మార్పు రావాల్సిన సమయం
మీడియాలో మార్పు రావాలంటే మహిళా జర్నలిస్టులకు, ఎడిటర్లకు బాధ్యతలు అప్పగించాలి. బాధితుల కోణంలో కథనాలను రూపొందించాలని జూలీ పోసెట్టి హెచ్చరిస్తున్నారు. పాతకాలపు పద్ధతులను వీడితేనే మహిళలకు న్యాయం జరుగుతుంది. కేవలం గణాంకాలతో సరిపెట్టకుండా లోతైన విశ్లేషణలు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమాజంలో వేళ్లూనుకున్న వివక్ష నిర్మూలన జరుగుతుంది. వార్తా సంస్థలు తమ పంథాను మార్చుకోవాలి.