ఆడది అడుగేస్తే అల్టిమేట్ – గర్ల్ గ్యాంగ్… సోలో ట్రిప్స్… టూరిజం అప్స్

Women solo Trips
  • సొంతంగా విహారయాత్రలకు మహిళలు
  • మగ తోడు లేకుండానే ప్రయాణాలు
  • ఆర్థిక స్వాతంత్య్రంతో ఎంజాయ్ టిప్స్
  • 2025లో 92,192 సోలో ఫిమేల్ బుకింగ్స్
  • దేశంలో 72 శాతం ట్రిప్పులకు మహిళలే ప్లాన్

సహనం వందే, హైదరాబాద్:

ఇంటి గడప దాటితే అపరాధం అన్న రోజులు పోయాయి. ఇప్పుడు ఆడది అడుగు వేస్తే అది అల్టిమేట్ టూర్ అవుతోంది. వంటింటి గరిటె పట్టిన చేతులే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పట్టుకుని ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఇది కేవలం విహారం కాదు… తన ఉనికిని చాటుకునే పర్యాటక విప్లవం. దేశీ పర్యాటక రంగంలో మహిళలు ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఎదిగారు.

మహిళా పర్యాటకుల డిమాండ్‌…
థామస్ కుక్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ రాజీవ్ కాలే కీలక గణాంకాలను బయటపెట్టారు. మహిళా పర్యాటకుల డిమాండ్‌లో 35 శాతం వృద్ధి నమోదైంది. గతంలో కుటుంబంతో వెళ్లే మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా వెళ్తున్నారు. అడ్వెంచర్ ట్రావెల్ పట్ల మహిళలకు 37 శాతం మక్కువ పెరిగింది. రిషికేష్‌లో వైట్ వాటర్ రాఫ్టింగ్, లడఖ్ ట్రెకింగ్‌లకు మహిళలు క్యూ కడుతున్నారు. వెల్‌నెస్ టూరిజంలో కూడా 28 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

Girl Solo Trips

షీ ప్లాన్డ్ ఎకానమీ…
దేశంలో 72 శాతం ట్రిప్పులను మహిళలే ప్లాన్ చేస్తున్నారని థ్రిల్లోఫీలియా నివేదిక చెబుతోంది. 3 లక్షల మందిని విశ్లేషించగా ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు పురుషుల కంటే 28 శాతం ఎక్కువ ప్రీమియం అప్‌గ్రేడ్స్‌ను ఎంచుకుంటున్నారు. కానీ బడ్జెట్ విషయంలో మాత్రం పురుషుల కంటే కేవలం 6 శాతమే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అంటే తక్కువ ఖర్చుతో నాణ్యమైన అనుభూతులను పొందడంలో మహిళలు సిద్ధహస్తులు.

భద్రతకే పెద్దపీట…
ప్రయాణాల్లో మహిళలు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పురుషుల కంటే 3 రెట్లు ఎక్కువగా సేఫ్టీ ఫిల్టర్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అత్యవసర కాల్స్ 23 శాతం తగ్గాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రయాణానికి 9 రోజుల ముందే బుకింగ్ చేసుకుని క్యాన్సిలేషన్లను 18 శాతం తగ్గించుకుంటున్నారు. టూరిజం మార్కెట్ విలువ ఈ ఏడాది చివరి నాటికి లక్షన్నర కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా.

సోలో ట్రిప్పుల జోరు
జోస్టెల్ డేటా ప్రకారం 2025లో 92,192 సోలో ఫిమేల్ బుకింగ్స్ నమోదయ్యాయి. 2018లో ఈ సంఖ్య కేవలం 33,357 మాత్రమే ఉండేది. ముంబై, గోకర్ణ, లోనావాలా, గోవా మహిళల హాట్ ఫేవరెట్ గమ్యస్థానాలుగా మారాయి. ఈ పర్యాటకులలో మెజారిటీ 22 నుండి 29 ఏళ్ల మధ్య వయసు వారే ఉన్నారు. ఈ యువతులలో 28.8 శాతం మంది పదే పదే ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పట్టణాల మహిళలు కూడా…
కేవలం మెట్రో నగరాలే కాకుండా చిన్న పట్టణాల మహిళలు కూడా ప్రయాణాల్లో దూసుకుపోతున్నారు. ఇండోర్, అహ్మదాబాద్, విశాఖపట్నం, జైపూర్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఖమ్మం, వరంగల్ వంటి నగరాల నుండి పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క ఇండోర్ నుండే ఏటా 31 శాతం వృద్ధి కనిపిస్తోంది. విదేశీ ప్రయాణాల కోసం మహిళలు దుబాయ్, సింగపూర్‌లను ఎంచుకుంటున్నారు. 25 శాతం మంది మహిళలు లగ్జరీ షాపింగ్, ఫైన్ డైనింగ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.

కొత్త ట్రెండ్స్ ఇవే…
ప్రస్తుతం కిట్టి పార్టీ గ్రూపులు, గర్ల్ గ్యాంగ్ ప్రయాణాలు బాగా ప్రాచుర్యం పొందాయి. తల్లి, కూతురు కలిసి చేసే బాండింగ్ ట్రిప్పులు 35 శాతం పెరిగాయి. బిజినెస్ ట్రిప్పులను పర్సనల్ ట్రిప్పులుగా మార్చుకునే బ్లేజర్ సంస్కృతి కూడా పెరిగింది. 23 శాతం మహిళలు క్రూయిజ్ సెలవులను అమితంగా ఇష్టపడుతున్నారు. మహిళల ఈ జోరు చూస్తుంటే పర్యాటక రంగం ఇకపై వారి చేతుల్లోనే ఉంటుందని స్పష్టమవుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *