- ముంబై తెలుగు ప్రముఖుల అభినందనలు
- ముఖ్యఅతిథిగా మెరిసిన విజయనగరం ఎంపీ
సహనం వందే, మహారాష్ట్ర:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత లభించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఐదు కోట్ల ఆంధ్రుల దశాబ్దాల కల సాకారమైన వేళ మహారాష్ట్రలోని తెలుగువారంతా ఏకమయ్యారు. ముంబై వేదికగా జరిగిన కృతజ్ఞత సభలో రాజకీయ ప్రముఖులు పాల్గొని అమరావతి బ్రాండ్ విలువను ప్రపంచానికి చాటిచెప్పారు.
థానేలో థాంక్స్ మీట్
మహారాష్ట్రలోని థానే వెస్ట్‌లో ఉన్న వసంత విహార్ రీగల్ ప్లాజాలో గురువారం రాత్రి భారీ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కృతజ్ఞత సభ నిర్వహించారు. అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడంపై ఇక్కడ హర్షం వ్యక్తమైంది. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఢిల్లీ పెద్దలకు వందనం
రాజధాని అమరావతికి అండగా నిలిచిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎంపీ అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. బిల్లుకు మద్దతు పలికిన వివిధ రాజకీయ పార్టీల ఎంపీలకు ధన్యవాదాలు చెప్పారు. పార్లమెంట్‌లో జరిగిన ఈ చారిత్రాత్మక నిర్ణయం తెలుగువారి ఆత్మగౌరవ విజయమని ఆయన పేర్కొన్నారు.

ఐదుకోట్ల ఆంధ్రుల జయం
రాజధాని కోసం ఐదు కోట్ల ఆంధ్రులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఒక్కటయ్యారని కలిశెట్టి అన్నారు. అందరి ఐక్యమత్యం వల్లే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం సాధ్యమైందని వివరించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. తెలుగువారి ఆకాంక్షలను గౌరవించిన పెద్దలందరికీ ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.
చంద్రబాబు మార్క్ అభివృద్ధి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి బ్రాండ్‌తో రాష్ట్రం దూసుకుపోతుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యమని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణం కేవలం భవనాలే కాదని అది తెలుగువారి అభివృద్ధికి సంకేతమని వివరించారు.
హాజరైన ప్రముఖులు…
ఈ ఉత్సాహభరిత కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాధవనాయుడు పాల్గొన్నారు. మహారాష్ట్ర తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు జగన్ బాబు, జనరల్ సెక్రెటరీ అశోక్ బాబు వేదికపై సందడి చేశారు. కార్యవర్గ సిబ్బంది గుప్తాతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. అమరావతి విజయకేతనంపై వీరంతా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.