మూడు ముళ్లు… ఆరు ‘ఉరితాళ్లు’ – ఇండియాలో ఏటా పెళ్లి ఖర్చు 10 లక్షల కోట్లు

Indian wedding system
  • ఆడంబరాల వెనుక తల్లిదండ్రుల ఆక్రందన
  • వరకట్న వేధింపులతో 6 వేల మరణాలు
  • అప్పుల వేట… నిలువునా ముంచే పెళ్లి బాట!
  • చదువు కంటే వివాహానికే రెట్టింపు ఖర్చు
  • అక్షరం తక్కువ… ఆడంబరం ఎక్కువ!

సహనం వందే, హైదరాబాద్:

భారతీయ వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు. అది లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. కన్నకూతురిని అత్తారింటికి పంపే వేళ తండ్రి పడే తపన, చేసే అప్పులు ఒక జీవితకాలపు భారంలా మారుతున్నాయి. మేకప్ అద్దాల వెనుక దాగిన కన్నీళ్లు, మిరిమిట్లు గొలిపే బంగారు ఆభరణాల వెనుక ఉన్న ఆర్థిక సంక్షోభంపై ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జెఫరీస్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సర్వే నివేదికలు విస్తు పోయే నిజాలు వెల్లడించాయి.

కూతురి పెళ్లి… తండ్రి బలి
నవీన ముఖంపై మేకప్ ఆర్టిస్ట్ సున్నితంగా చుక్కలు పెడుతున్నారు. ఆ రోజు ఆమె జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. కానీ ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. జడలో పూలు రాలేదు… సాధారణంగా ఇలాంటి పనులు తండ్రి చూసుకుంటారు. కానీ ఆరు నెలల క్రితమే ఆమె తండ్రి చనిపోయారు. నెలకు 12,020 రూపాయలు సంపాదించే నవీన తన పెళ్లి కోసం 3 లక్షల రూపాయలు కేటాయించింది. కానీ ఆ బడ్జెట్ ఒక్కసారిగా రెట్టింపైంది. చేసేది లేక బ్యాంక్ లోన్ తీసుకుంది. ఆమె కాబోయే భర్త సాయికిరణ్‌కు ఇప్పటికే హోమ్ లోన్ ఉంది. అయినా పెళ్లి కోసం తన ఇంటిపై మళ్లీ అప్పు చేశాడు.

కళ్లు చెదిరే కోట్లు
ఇండియాలో ఏటా పెళ్లిళ్ల పరిశ్రమ విలువ సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు. భారతీయులు చదువు కంటే పెళ్లిళ్లకే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. పేద కుటుంబాల్లో బంగారం, నగదు, వాహనాల రూపంలో ఇచ్చే కట్నాలు ఒక ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ధనిక వర్గాల్లో పరిస్థితి వేరుగా ఉంది. హైదరాబాద్‌కు చెందిన ఒక లగ్జరీ వెడ్డింగ్ ప్లానర్ల వద్ద కనీసం 4 కోట్ల రూపాయల నుండి 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు. గండిపేట రిసార్టులు, విదేశీ మద్యం, భారీ అలంకరణలు ఇక్కడ సర్వసాధారణం.

Indians Costly Weddings

పెళ్లి చూపుల బేరాలు
పెళ్లికి ముందే ఖర్చులు మొదలవుతాయి. హైదరాబాద్, విజయవాడల్లో నిర్వహించే మ్యారేజ్ బ్యూరోల వద్ద బేరాలు గట్టిగా ఉంటాయి. చదువు, సంపాదన, కుటుంబ నేపథ్యం వంటివన్నీ చూస్తారు. ఇక్కడ బ్యాంకు బ్యాలెన్స్ అనేది ఒక ‘గేమ్ ఛేంజర్’. బ్యాంక్ అకౌంట్ చూసే సంబంధాలు ఖాయం అవుతున్నాయి. భారతదేశంలో నేటికీ 90 శాతం వివాహాలు పెద్దలు కుదిర్చినవే. అందం విషయంలోనూ కఠినమైన నిబంధనలు ఉంటాయి. లావుగా ఉన్న అమ్మాయికి సన్నటి అబ్బాయిని చూడటం వంటివి కుదరవని నిర్మొహమాటంగా చెబుతారు.

సామూహిక వివాహాల ఊరట
ఒక గ్రామానికి చెందిన 19 ఏళ్ల అనన్య తన పెళ్లికి సిద్ధమవుతోంది. తన తల్లి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఆమె సామూహిక వివాహ వేదికను ఎంచుకుంది. ఇక్కడ ఆమె ఒక్కరే కాదు… పదుల సంఖ్యలో జంటలు ఉన్నారు. ప్రతి జంటకు టీవీలు, కుట్టు మిషన్లు, ప్రెజర్ కుక్కర్లు వంటి 82,900 రూపాయల విలువైన వస్తువులను ఇస్తారు. స్థానిక నాయకులు ఇటువంటి వేడుకలను నిర్వహిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల చెర నుండి పేద కుటుంబాలను రక్షించడమే తమ లక్ష్యమని వారు చెబుతారు. అనన్య.. కిరణ్‌ను ఇక్కడే వివాహం చేసుకుంది.

కట్నం కాటుకు బలి
కట్నం నిషేధించినా నేటికీ అది కొనసాగుతూనే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఏటా 6 వేలకు పైగా కట్న వేధింపుల మరణాలు నమోదవుతున్నాయి. ప్రియాంక అనే 31 ఏళ్ల మహిళ తన వేదనను షేర్ చేశారు. ఆమె తండ్రి పెళ్లి కోసం 26 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినా భర్త కుటుంబం అదనపు డబ్బు, ఇల్లు కావాలని వేధించింది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా దాడి చేశారని ఆమె ఆరోపించింది. అయితే ఆమె భర్త ఈ ఆరోపణలను తిరస్కరించారు. లాయర్ మదన్ ప్రకారం కోర్టు కేసుల జాప్యం వల్ల బాధితులకు న్యాయం అందడం కష్టమవుతోంది.

Indians Spend on Weddings

ముఖ్యమైన అంశాలు:

భారీ పెళ్లిళ్ల ఖర్చుల కోసం దాదాపు మూడో వంతు (33%) కుటుంబాలు ఏదో ఒక రూపంలో అప్పులు చేస్తున్నట్లు గణాంకాలు చూపిస్తున్నాయి.

భారతదేశంలో ఏటా 80 లక్షల నుండి ఒక కోటి వరకు పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ వేడుకల కోసం వెచ్చిస్తున్న మొత్తం ఏడాదికి సుమారు 10.77 లక్షల కోట్ల రూపాయలు.

ఒక సగటు భారతీయుడు తన జీవితకాలంలో ఒక బిడ్డ చదువు (స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ వరకు) కోసం చేసే ఖర్చు కంటే ఆ బిడ్డ పెళ్లి కోసమే రెండు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *