అమరావతికి అప్పలనాయుడు హారతి – లోక్‌సభలో విజయనగరం ఎంపీ కలిశెట్టి గళం

Appalanaidu Speech on Amaravathi at Parliament
  • 29 వేల త్యాగాలు… ఐదు కోట్ల ఆత్మగౌరవం
  • అమరావతి చట్టబద్ధత బిల్లుపై భావోద్వేగం

సహనం వందే, న్యూఢిల్లీ:

మట్టికి మనిషికి మధ్య ఉండే బంధం రక్త సంబంధం కంటే పవిత్రమైనది. కన్నతల్లికి బిడ్డకు ఉండే పేగు బంధం లాంటిది రైతుకు తన నేలతో ఉండే అనుబంధం. కానీ ఆ మట్టినే నమ్ముకున్న రైతుల కన్నీరు గత పాలకుల పతనానికి పునాది అయింది. నేడు ఆ కన్నీటి చుక్కల నుంచి అమరావతి మళ్ళీ చిగురిస్తోంది. నవ్యాంధ్ర భవిష్యత్తు కోసం ప్రాణప్రదమైన భూమిని ధారపోసిన రైతుల గాథ ఇది.

అమరవీరుల త్యాగాల పునాది
లోక్‌సభ సాక్షిగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒక రైతు బిడ్డగా బుధవారం తన ఆవేదనను గొంతెత్తి చాటారు. అమరావతి అంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు… అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ సంతకం అని ఆయన గర్జించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు తమ జీవితాలను పణంగా పెట్టారు. భావి తరాల కోసం 33 వేల ఎకరాల సస్యశ్యామల భూమిని రాజధాని కోసం ఇచ్చారు. కానీ గత జగన్ పాలనలో ఆ చట్టబద్ధమైన ఒప్పందాలను కాలరాశారు.

Applanaidu and Lokesh

విధ్వంసం నుంచి నిర్మాణం వైపు
గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి అంటే కూల్చివేతగా మారిందని కలిశెట్టి విమర్శించారు. ప్రజావేదికను కూల్చడంతో మొదలైన ఆ విధ్వంసకర పాలనలో శాంతియుతంగా పోరాడిన రైతులపై లాఠీలతో దాడి చేశారు. ఆడబిడ్డలను రోడ్ల మీద ఈడ్చుకుపోయిన ఘోరాన్ని ఈ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన గురువులను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టడం ఆనాటి దారుణ పాలనకు నిదర్శనం. నాడు జగన్ చేసింది కూల్చివేతల పాలన అయితే.. నేడు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం చేస్తున్నది నిర్మాణాల పాలన అని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు విజన్.. ఆంధ్రప్రదేశ్ వికాసం
చీకటి తొలగిపోయి ఇప్పుడు విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ వెలుగులోకి వస్తోంది. ఆయన ఆలోచన కేవలం అమరావతికే పరిమితం కాలేదు, రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యం. ఒకవైపు అమరావతిని ఏకైక రాజధానిగా పునరుద్ధరిస్తూనే మరోవైపు ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మారుస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేందుకు 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీతో వేలాది ఉద్యోగాలను నిలబెట్టారని ఎంపీ కొనియాడారు.

పెట్టుబడుల మూటలు… అభివృద్ధి బాటలు
రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడుల వివరాలను కలిశెట్టి సభ ముందుంచారు. 1.4 లక్షల కోట్ల రూపాయల స్టీల్ సిటీ, 1,26,000 కోట్ల రూపాయల డేటా సెంటర్, సెమీకండక్టర్ హబ్ ద్వారా ఏపీ వికసించబోతోంది. భోగాపురం ఎయిర్ పోర్ట్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ ట్రేడ్ హబ్‌గా మారుస్తున్నారు. ఇవి కేవలం మాటలు కావని రాష్ట్ర భవిష్యత్తును మార్చే పెట్టుబడుల మూటలని ఆయన స్పష్టం చేశారు.

కేంద్రం అండ.. ప్రజల విజయం
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సంపూర్ణ మద్దతుతో అమరావతి కల సాకారం అవుతోంది. ఈ బిల్లు కేవలం ఒక కాగితం కాదు… ఇది రైతుల నమ్మకానికి ఇచ్చిన హామీ అని కలిశెట్టి పేర్కొన్నారు. ఇది గత పాలకుల విధ్వంసంపై ప్రజలు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ ఈ బిల్లును సమర్థించాలని ఆయన కోరారు.

విశ్వసనీయతకు మారుపేరుగా…
విశ్వసనీయతకు మారుపేరుగా, వికాసానికి కేటలిస్ట్‌గా నిలిచే ఈ బిల్లును మనస్ఫూర్తిగా బలపరుస్తున్నట్లు కలిశెట్టి ప్రకటించారు. రైతు కన్నీరు తుడవని రాజ్యం ఎన్నటికీ వర్ధిల్లదని… ఈ బిల్లు ఆ కన్నీటికి తుది పరిష్కారం కాబోతుందని ఆయన భావోద్వేగంగా ముగించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *