- చీకటి ఖాతాల్లో చిక్కుకున్న మహిళలు
- అమెరికాలో బలైపోయిన అబలలు
- కరెన్సీ నోట్ల కట్టల్లో వ్యభిచార గుట్టు
- బాధితుల పోరాటంతో బ్యాంకుల లొంగుబాటు
- 3,622 కోట్ల పరిహారం చెల్లింపునకు నిర్ణయం
సహనం వందే, అమెరికా:
అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థలోని నైతిక దివాళాకోరుతనం మరోసారి ప్రపంచం ముందు నగ్నంగా నిలిచింది. లాభాల వేటలో మానవీయ విలువలను కాలరాస్తూ జెఫ్రీ ఎప్‌స్టీన్ సాగించిన లైంగిక అరాచకాలకు ఆర్థిక వెన్నుముకగా నిలిచిన మూడు ప్రధాన బ్యాంకులు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. వ్యవస్థాగత నిర్లక్ష్యం ముసుగులో సాగిన ఈ అకృత్యాలకు బాధితులు సాధించిన గొప్ప నైతిక విజయమిది.
బ్యాంకింగ్ శక్తుల నైతిక పతనం
అమెరికా బ్యాంకింగ్ రంగంలోని అగ్రగామి సంస్థలు జెఫ్రీ ఎప్‌స్టీన్ సాగించిన లైంగిక వేధింపులకు పరోక్షంగా సహకరించాయి. కేవలం ఖాతాదారుల ద్వారా వచ్చే లాభాల కోసం మనుషుల అక్రమ రవాణా వంటి ఘోరాలను ఈ బ్యాంకులు చూసీచూడనట్లు వదిలేశాయి. వందలాది మంది మహిళల జీవితాలను బలి తీసుకున్న ఈ అరాచక వ్యవస్థకు బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజాలు ఆర్థిక దన్నుగా నిలిచాయి.

బ్యాంక్ ఆఫ్ అమెరికా లొంగుబాటు
ఎట్టకేలకు బ్యాంక్ ఆఫ్ అమెరికా బాధితుల ముందు మోకరిల్లింది. ఎప్‌స్టీన్ సాగించిన అకృత్యాలకు తన ఖాతాలను వాడుకునేందుకు అనుమతించినట్లు వచ్చిన ఆరోపణలపై రాజీకి వచ్చింది. సుదీర్ఘ కాలం పాటు సాగిన న్యాయపోరాటం తర్వాత బాధితుల తరపు న్యాయవాదుల ఒత్తిడికి తలొగ్గి భారీ జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది. ఇది వ్యవస్థలపై సామాన్యులు సాధించిన భారీ విజయం.
అరాచకానికి వేదికైన ఖాతాలు
2008 నుండి 2019 మధ్య కాలంలో ఎప్‌స్టీన్ తన అక్రమ కార్యకలాపాల కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాలను విచ్చలవిడిగా వాడుకున్నాడు. యువతులు, మహిళలపై సాగించిన లైంగిక వేధింపులకు ఈ లావాదేవీలే మూలాధారమయ్యాయి. దీని ద్వారా బ్యాంకులు ఆర్థికంగా లబ్ధి పొందాయని మాన్హట్టన్ ఫెడరల్ కోర్టులో దాఖలైన పిటిషన్లు స్పష్టం చేస్తున్నాయి. నేరగాళ్లకు ఆర్థిక వ్యవస్థ ఎంతటి అండగా నిలుస్తుందో ఈ ఉదంతం నిరూపించింది.
602 కోట్ల భారీ పరిహారం
ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా 602 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పత్రాలు శుక్రవారం ఫెడరల్ కోర్టులో దాఖలయ్యాయి. ఈ నిధులు వందలాది మంది బాధితులకు పరిహారంగా అందుతాయి. ఎప్‌స్టీన్ కేసులో బ్యాంకులు చెల్లిస్తున్న మూడో అతిపెద్ద పరిహారం ఇదే కావడం గమనార్హం. నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదని ఈ తీర్పు హెచ్చరిస్తోంది.
హెచ్చరికలను బేఖాతరు చేసిన బ్యాంకులు
ఎప్‌స్టీన్ ఖాతాల నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై వచ్చిన హెచ్చరికలను బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. మానవ అక్రమ రవాణాకు ఆ నిధులు వాడుతున్నారని తెలిసినా మౌనంగా ఉండిపోయింది. దీనివల్ల ఎప్‌స్టీన్ తన అరాచకాలను ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగించగలిగాడు. ఈ నేరపూరిత నిర్లక్ష్యమే ఇప్పుడు బ్యాంకులకు శాపంగా మారింది.
జేపీ మోర్గాన్ 2400 కోట్లు…
గతంలో జేపీ మోర్గాన్ చేజ్, డ్యూయిష్ బ్యాంకులు కూడా ఇదే బాటలో భారీ జరిమానాలు చెల్లించాయి. 15 ఏళ్ల సేవలకు గాను జేపీ మోర్గాన్ 2400 కోట్లు, 5 ఏళ్ల బంధానికి గాను డ్యూయిష్ బ్యాంక్ 620 కోట్లు చెల్లించాయి. మొత్తంగా మూడు బ్యాంకులు కలిపి 3622 కోట్ల రూపాయలను బాధితులకు చెల్లిస్తున్నాయి. అమెరికా బ్యాంకింగ్ చరిత్రలో ఇదొక చెరగని మాయని మచ్చగా మిగిలిపోనుంది.