బీరుపై ‘బాంబు’ – ఇరాన్ యుద్ధం… మందుబాబులకు కష్టం

Iran war effects Beer crisis
  • గ్యాస్ సరఫరా లేక బాటిల్ తయారీ బంద్
  • బీర్ల కొరత భయం… ధరల మంట మొదలు

సహనం వందే, హైదరాబాద్:

ఇరాన్ యుద్ధ జ్వాలలు సముద్రాలు దాటి భారతీయ మద్యం ప్రియుల గొంతు ఎండిపోయేలా చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల మధ్య మొదలైన చిచ్చు వల్ల ఇంధన సరఫరా ఆగిపోయింది. ఇది గాజు సీసాల తయారీని దెబ్బతీసింది. దీంతో ఎండకాలం వేళ చిల్డ్ బీర్ దొరకడం గగనంగా మారనుంది. కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమవ్వడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

యుద్ధం తెచ్చిన బీరు కరువు
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద గ్యాస్ దిగుమతిదారుగా ఉన్న భారత్‌పై ఇరాన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. మన దేశం తన అవసరాల కోసం 40 శాతం గ్యాస్‌ను ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ దాడుల వల్ల ఖతార్ ఎగుమతి సామర్థ్యం దెబ్బతింది. ఫలితంగా భారతీయ పరిశ్రమలకు గ్యాస్ అందడం లేదు. ముఖ్యంగా గాజు సీసాల తయారీ కేంద్రాల్లో ఫర్నేస్‌లు ఆగిపోయాయి. దీంతో బీరు సీసాల ఉత్పత్తి పడిపోయి సరఫరా లింక్ పూర్తిగా కుప్పకూలిపోయింది.

Iran war effects on Beer crisis

ఎగిసిపడుతున్న ధరల మంట
ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి ఆందోళన వ్యక్తం చేశారు. గాజు సీసాల ధరలు 20 శాతం వరకు పెరిగాయి. ప్యాకేజింగ్ కోసం వాడే పేపర్ కార్టన్ బాక్సుల ధరలు ఏకంగా రెట్టింపు అయ్యాయి. లేబుళ్లు, టేపుల ఖర్చు కూడా భారమైంది. హైనెకెన్, అనహ్యూజర్ బుష్ ఇన్ బెవ్ వంటి దిగ్గజాలు ఇప్పుడు ధరలు పెంచక తప్పని స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే ఒక ప్రధాన సీసాల తయారీ సంస్థ తన ధరలను 17 నుంచి 18 శాతానికి పెంచేసింది.

వేసవి వేళ బీరు సెగ
భారత్‌లో ఎండలు ముదురుతున్న వేళ బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. సరిగ్గా ఈ సమయంలోనే అల్యూమినియం క్యాన్ల కొరత వేధిస్తోంది. రవాణాలో జాప్యం వల్ల క్యాన్ల తయారీకి కావాల్సిన ముడి సరుకు అందడం లేదు. అగ్రగామి కంపెనీలైన హైనెకెన్, కార్ల్స్‌బర్గ్ సంస్థలు ఈ సంక్షోభంపై ఇంకా అధికారికంగా నోరు మెదపలేదు. కానీ వారు 12 నుంచి 15 శాతం వరకు ధరల పెంపును కోరుతున్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలు వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలని అసోసియేషన్ సూచించింది.

అగమ్యగోచరంగా మార్కెట్ స్థితి
దేశీయ మద్యం మార్కెట్ విలువ లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది 2030 నాటికి రెట్టింపు అవుతుందని గ్రాండ్ వ్యూ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రస్తుతం హైనెకెన్ సుమారు సగం మార్కెట్‌ను ఏలుతోంది. మిగిలిన మార్కెట్‌లో ఏబీ ఇన్ బెవ్, కార్ల్స్‌బర్గ్ చెరో 19 శాతం వాటాను కలిగి ఉన్నాయి. బీరా, సింబా వంటి చిన్న బ్రాండ్లు కూడా ఈ గ్యాస్ సంక్షోభంలో చిక్కుకున్నాయి. ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోతే సరఫరా నిలిపివేస్తామని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.

కుదేలైన గాజు పరిశ్రమ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్‌లోని గ్లాస్ తయారీ కేంద్రాలు గ్యాస్ లేక విలవిలలాడుతున్నాయి. ఫైన్ ఆర్ట్ గ్లాస్ వర్క్స్ సీఈఓ నితిన్ అగర్వాల్ తన ఫ్యాక్టరీలో ఉత్పత్తిని 40 శాతం తగ్గించుకున్నారు. మద్యం సీసాలే కాకుండా జ్యూస్, కెచప్ బాటిళ్ల తయారీ కూడా ఆగిపోయింది. గ్యాస్ కొరత వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడంతో చాలా యూనిట్లు పాక్షికంగా మూతపడ్డాయి. దీనివల్ల సరఫరా తగ్గి ధరలు పెరగడం వల్ల సామాన్య వినియోగదారుడిపై భారం పెరుగుతోంది.

ఇతర రంగాలకూ పాకిన సంక్షోభం
ఈ సెగ కేవలం మద్యం రంగానికే పరిమితం కాలేదు. సుమారు 42 వేల కోట్ల రూపాయల విలువైన బాటిల్ వాటర్ మార్కెట్ కూడా దెబ్బతింది. ప్లాస్టిక్ సీసాలు, క్యాపుల ధరలు పెరగడంతో నీళ్ల బాటిళ్ల ధరలు 11 శాతం పెరిగాయి. దక్షిణ కొరియాకు చెందిన లాట్ చిల్సంగ్ బెవరేజ్ కంపెనీ ప్రతినిధులు కూడా తమ దగ్గర కేవలం మూడు నెలల నిల్వలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో సాఫ్ట్ డ్రింక్స్‌పై కూడా ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *