- ఖరీదైన వస్తువులతో ఉద్యోగ జీవితం హతం
- లగ్జరీ లైఫ్ స్టైలుపై బాస్ కన్ను పడితే ఖతమే
- ఆఫీసులో బ్రాండ్… ప్రమోషన్ ఎండ్
- జీతం పెంచడానికి వెనకడుగు వేసే పరిస్థితి
- సింపుల్‌గా ఉంటేనే ఉద్యోగం సేఫ్
సహనం వందే, హైదరాబాద్:
కార్పొరేట్ కొలువుల్లో వేసుకునే డ్రెస్, వాడే వస్తువులు కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు. అవి మీ ఎదుగుదలను శాసించే నిశ్శబ్ద ఆయుధాలు. ముఖ్యంగా యువ ఉద్యోగులు వాడే లగ్జరీ హ్యాండ్ బ్యాగులు, కొత్త బ్రాండెడ్ బట్టలు వారి కెరీర్ ప్రగతికి అడ్డుగోడలుగా మారుతున్నాయి. మేనేజర్ల దృష్టిలో ఇవి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయనే చేదు నిజం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
డిజైనర్ డ్రెస్సుల డేంజర్
హైదరాబాదుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాహుల్ వయసు 28 ఏళ్లు. అతను తన ఆఫీసుకి ఎప్పుడూ లగ్జరీ వస్తువులు తీసుకెళ్లడు. అతని దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల ఖరీదైన వాచ్ ఉంది. బయట దానిని వాడటానికి అతనికి ఇబ్బంది లేదు. కానీ ఆఫీసులో మాత్రం దానిని ధరించడు. తన జీతం, కెరీర్ విషయంలో మేనేజర్ల అభిప్రాయం ముఖ్యం అని ఆయన నమ్ముతాడు. ఖరీదైన వస్తువులు చూస్తే తోటి ఉద్యోగులు రకరకాలుగా అనుకుంటారని అతని భయం.
‘పాకెట్ వాచింగ్’ సెగ…
ఆఫీసుల్లో ‘పాకెట్ వాచింగ్’ అనే ధోరణి పెరుగుతోంది. అంటే ఒకరి ఆర్థిక స్థితిగతులను ఇతరులు నిరంతరం గమనిస్తుంటారు. మీరు 2 లక్షల వాచీ వాడితే మీకు జీతం పెంచాల్సిన అవసరం లేదని బాసులు భావించే ప్రమాదం ఉంది. ప్రమోషన్ ఇచ్చే సమయంలో ఇద్దరు సమాన ప్రతిభ గల అభ్యర్థులు ఉంటే తక్కువ హంగూ ఆర్భాటాలు ఉన్నవారికే ప్రాధాన్యం దక్కుతోంది. దీనివల్ల ప్రతిభ ఉన్నా కేవలం బ్రాండెడ్ వస్తువుల వల్ల అవకాశాలు చేజారిపోతున్నాయి.

శ్రీలత అనుభవం…
ప్రముఖ కెరీర్ కోచ్ శ్రీలత తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేశారు. ఆమె రిక్రూటర్‌గా ఉన్నప్పుడు ఒక ప్రమోషన్ అవకాశాన్ని కోల్పోయారు. దానికి కారణం ఆమె బోనస్ డబ్బుతో లూయిస్ విట్టన్ బ్యాగ్ కొనడమే. ఆమెకు ఆర్థికంగా అండ అవసరం లేదని ఆమె మేనేజర్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలాంటి విషయాలు డేటాలో కనిపించవు కానీ తెర వెనుక కెరీర్‌ను దెబ్బతీస్తాయి. అందుకే ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు బ్రాండ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
లింగ వివక్ష కోణం
ఈ సమస్యలో మహిళలే ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. పురుషుల డ్రెస్సింగ్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ మహిళల విషయంలో వారి సమర్థతను వారి ఆహార్యంతో ముడిపెడతారు. అమిత్ అనే కెరీర్ కోచ్ దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఖరీదైన వస్తువులు వాడితే ఆ మహిళను హై మెయింటెనెన్స్ అని ముద్ర వేసే ప్రమాదం ఉంది. ఇది మహిళల పట్ల సమాజంలో ఉన్న అపనమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.
యాంబిషన్ సిగ్నల్స్…
అయితే అందరూ ఒకేలా ఆలోచించడం లేదు. 27 ఏళ్ల శ్రావణి అభిప్రాయం వేరుగా ఉంది. ఆమె ఆయిల్, గ్యాస్ కంపెనీలో పని చేస్తోంది. తాను సీఈఓ కావాలని అనుకుంటున్నానని అందుకే డిజైనర్ వస్తువులు ధరిస్తానని చెబుతోంది. ఇది తన ఆశయానికి గుర్తు అని ఆమె నమ్ముతుంది. మరోవైపు జ్యుడీషియల్ క్లర్క్ 26 ఏళ్ల అవని మాత్రం కేవలం 15,000 రూపాయల విలువైన లాంగ్‌చాంప్ లే ప్లాజ్ బ్యాగునే వాడుతుంది. న్యాయవాద వృత్తిలో ఆడంబరాలు పనికిరావని ఆమె అంటోంది.
పరిస్థితిని బట్టి ప్రయాణం
ఆఫీసు వాతావరణాన్ని బట్టి మన వేష భాషలు ఉండాలి. 2022లో జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం లగ్జరీ వస్తువులు వాడే వారితో సహకరించడానికి ఇతరులు ఇష్టపడరు. బట్టలు రోజూ మారుతాయి కానీ బ్యాగులు అలా కాదు. అవి మీ ఆర్థిక స్థితిని నేరుగా ప్రతిబింబిస్తాయి. అందుకే కెరీర్ ఆరంభంలో ఉన్నవారు తమ పే చెక్ కాపాడుకోవడానికి బ్రాండ్లకు దూరంగా ఉండటమే ఉత్తమమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.