- బోర్డులు పట్టుకుని సంబంధాల కోసం చూపు
- బిడ్డల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రుల కన్నీటి వ్యధ
- ఆస్తిపాస్తులే ప్రాధాన్యం…పెళ్లి పక్కా వ్యాపారం
- వన్ చైల్డ్ పాలసీ సెగ… షాంఘైలో ఘోరం
- టిక్కెట్లు కొనుక్కొని విదేశీ టూరిస్టుల చప్పట్లు
షాంఘై పీపుల్స్ పార్కులో ప్రేమకు తావులేదు. అక్కడ ప్రతి శని, ఆదివారాలు ఒక వింత సంత జరుగుతుంది. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఇక్కడ ప్రకటన బోర్డులు పట్టుకుని వేచి చూస్తారు. అది ఒక సామాజిక వేదికలా కనిపిస్తున్నా… దాని వెనుక కన్నవారి తీరని ఆవేదన దాగి ఉంది. అంకెల గాలిలో మనుషుల విలువలు మాయమై పెళ్లి అనేది కేవలం ఒక ఆర్థిక ఒప్పందంగా మారిపోయింది.
బోర్డులపైనే కొలువుల లెక్కలు
షాంఘైలోని పీపుల్స్ పార్కులో అడుగుపెడితే వేలాది మంది తల్లిదండ్రులు కనిపిస్తారు. వారి చేతుల్లో పిల్లల బయోడేటా బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులపై వయసు, ఎత్తు, ఉద్యోగం, నెల ఆదాయం వివరాలు రాసి ఉంటాయి. అబ్బాయికి ఎన్ని కోట్ల సంపాదన ఉంది? సొంత ఇల్లు ఉందా? అనే వివరాలే ఇక్కడ ముఖ్యం. 2004 నుంచి షాంఘైలో ఇది ఒక ఆచారంగా మారింది. బీజింగ్, హాంగ్‌జౌ నగరాల్లో కూడా ఇలాంటి మార్కెట్లు ఉన్నా షాంఘై సంతకు ఉన్న క్రేజ్ ప్రత్యేకం. విచిత్రం ఏంటంటే విదేశీ టూరిస్టులు ఇక్కడకు ప్రత్యేకంగా వచ్చే ఆసక్తికరంగా చూస్తుంటారు. అందుకోసం టూరిస్ట్ గైడులు టిక్కెట్లు పెట్టి మరి దీన్ని ఒక టూరిజంగా అభివృద్ధి చేయడం విశేషం.


తల్లిదండ్రుల ఆరాటం.. పిల్లల పోరాటం
చైనాలో గతంలో ఉన్న ఒకే బిడ్డ విధానం ఇప్పుడు శాపమైంది. అబ్బాయిల సంఖ్య అమ్మాయిల కంటే చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల సంబంధాలు కుదరడం గగనమైపోతోంది. ఆధునిక యువత కెరీర్ వేటలో పడి పెళ్లిని వాయిదా వేస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. విచిత్రమేమిటంటే ఇక్కడ సంబంధాలు చూస్తున్న విషయం చాలా మంది పిల్లలకు తెలియదు.
సామాజిక సంక్షోభానికి నిదర్శనం
ఇది కేవలం ఒక వింత అలవాటు మాత్రమే కాదు. చైనాలో పెరుగుతున్న సామాజిక ఒత్తిడికి ఇది నిదర్శనం. యువత ఒంటరిగా ఉండిపోవడం వల్ల దేశ జనాభా తగ్గిపోతుందనే భయం పెరిగింది. అందుకే తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మనసుల కంటే మనీకే ఎక్కువ విలువిస్తారు. అబ్బాయికి షాంఘైలో సొంత ఇల్లు లేకపోతే గుర్తింపు ఉండదు. ఇది మధ్యతరగతి ప్రజల ఆస్తిపాస్తుల ప్రదర్శనశాలగా మారిపోయింది.
అంకెల వేటలో ఆవేదన
ఈ మార్కెట్‌ను విదేశీ పర్యాటకులు వింతగా చూస్తుంటారు. పర్యాటకులు గైడ్ సాయంతో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి 12 వేల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇక్కడ కనిపించే దృశ్యాలు ఆశ్చర్యాన్ని, జాలిని కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లలా తల్లిదండ్రులు ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు. నీ కొడుకు జీతం ఎంత? నీ కూతురికి కారు ఉందా? అని ఆరా తీస్తారు. పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం కంటే పక్కాగా ఒక ఆర్థిక ఒప్పందంగా మారిపోయింది.
సందడి వెనుక అసలు కథ
ఈ సంతలో సంబంధం కుదరడం చాలా అరుదుగా జరుగుతుంది. అయినా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఎందుకంటే వారికీ ఇదొక సామాజిక వేదికలా మారింది. తమలాంటి బాధలో ఉన్న ఇతరులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. చైనాలో పెళ్లిళ్లపై పెరుగుతున్న విరక్తికి ఈ సంత ఒక సాక్ష్యం. జనాభా సంక్షోభం, మారుతున్న విలువల మధ్య తల్లిదండ్రుల ఆవేదన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆధునిక చైనాలో ఇదొక మానవీయ విషాదం.
రవాణా… వసతులు
షాంఘై మెట్రోలోని 5వ గేటు గుండా పీపుల్స్ పార్కులోకి వెళ్లవచ్చు. మెట్రోకు 20 లైన్లు ఉండటం వల్ల ప్రయాణం సులభంగా ఉంటుంది. మాగ్లెవ్ రైలు టికెట్ 580 రూపాయలు మాత్రమే. ఇది 30 కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల్లో చేరుకుంటుంది. షాంఘై ప్రయాణంలో ఈ మ్యారేజ్ మార్కెట్ ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. కన్నవారి గుండెకోతకు, అంకెల గాలిలో మాయమవుతున్న సంబంధాలకు ఇక్కడ సాక్ష్యాలు దొరుకుతాయి.
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్