ఎప్‌స్టీన్ కౌగిలిలో నార్వే రాణి – బయటపడ్డ రహస్య ఈమెయిల్స్

Norway Princess and Epstein
  • రాకుమారి, ఎప్‌స్టీన్ రాసలీలలు
  • పామ్ బీచ్ లో రహస్యంగా 4 రోజులు
  • పడిపోయిన రాజకుటుంబ ప్రజాదరణ
  • మోసపోయానన్న రాణి మెట్టె మారిట్
  • అమెరికా పత్రాల సంచలనం

సహనం వందే, నార్వే:

విలాసవంతమైన జీవితం వెనుక దాగివున్న చీకటి కోణాలు ఇప్పుడు నార్వే రాజకుటుంబాన్ని కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ కామాంధుడు ఎప్‌స్టీన్ వలలో చిక్కుకున్నానని నార్వే రాకుమారి మెట్టె మారిట్ కన్నీరు పెట్టుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నమ్మించి మోసం చేశారనే వాదనతో ఆమె తన పరువును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బయటపడుతున్న ఆధారాలు మాత్రం రాజవంశపు పునాదులను కదిలిస్తున్నాయి.

మాయలో మారిట్
రాకుమారి మెట్టె మారిట్ తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో సంచలన నిజాలు చెప్పారు. ఎప్‌స్టీన్ తనను తప్పుదారి పట్టించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతడితో స్నేహం చేసినందుకు ఇప్పుడు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నారు. అసలు అతడిని కలవకుండా ఉండాల్సిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అమెరికా న్యాయ శాఖ విడుదల చేసిన లక్షలాది పత్రాలు మాత్రం మరోలా ఉన్నాయి. ఎప్‌స్టీన్‌తో ఆమెకు ఉన్న సంబంధాలు చాలా లోతైనవని ఈ పత్రాలు చెబుతున్నాయి.

Epstein and Mette Marit Norway Pricess

నాలుగేళ్ల సంబంధం
కేవలం పరిచయమే కాకుండా 2011 నుండి 2014 వరకు వీరిద్దరి మధ్య నిరంతరం మాటలు సాగాయి. గతంలో ఎప్‌స్టీన్ నేరం ఒప్పుకున్న తర్వాత కూడా రాకుమారి అతడితో టచ్‌లో ఉన్నారు. 2013లో ఒక ప్రైవేట్ పర్యటనలో భాగంగా ఆమె పామ్ బీచ్‌లోని అతడి ఇంట్లో 4 రోజులు గడిపారు. ఈ విషయం ఇప్పుడు నార్వే రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతోంది. ఒక సాధారణ స్నేహితుడి ద్వారా ఎప్‌స్టీన్ తనను వాడుకున్నాడని ఆమె వాదిస్తున్నారు.

నవ్వు వెనుక విషం
2011 అక్టోబర్‌లో రాకుమారి ఎప్‌స్టీన్‌కు పంపిన ఒక ఈమెయిల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గూగుల్‌లో నీ గురించి చూశాను అంటూ ఆమె ఒక నవ్వుతున్న సింబల్‌ను పంపారు. నేరగాడని తెలిసినా ఆమె అంత సరదాగా ఎందుకు మెయిల్ చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ మెయిల్ గురించి అడిగితే తనకు గుర్తులేదని ఆమె తప్పించుకుంటున్నారు. నిజం తెలిస్తే అలా నవ్వుతున్న బొమ్మను పెట్టేదాన్ని కాదని ఆమె చెబుతున్నారు.

వారసుడి వికృతం
రాజకుటుంబానికి కష్టాలు ఒక్కటిగా రావడం లేదు. మెట్టె మారిట్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీ ప్రస్తుతం జైలు పాలయ్యాడు. 29 ఏళ్ల ఇతడిపై అత్యాచారం, గృహ హింస వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. కొన్ని చిన్న తప్పులు చేశానని ఒప్పుకున్నా అత్యాచారం ఆరోపణలను మాత్రం అతడు తోసిపుచ్చాడు. ఈ పరిణామాలు రాజకుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని పూర్తిగా తగ్గించేశాయి.

పడిపోయిన గ్రాఫ్
తాజా సర్వేలు నార్వే రాజకుటుంబానికి గడ్డుకాలం నడుస్తోందని చెబుతున్నాయి. సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. జనవరిలో 70 శాతంగా ఉన్న ప్రజాదరణ ఫిబ్రవరి నాటికి 60 శాతానికి పడిపోయింది. అదే సమయంలో రాజరికం వద్దు.. మాకు ప్రజాస్వామ్యమే కావాలనే వారి సంఖ్య 19 నుండి 27 శాతానికి పెరిగింది. ప్రధాని కార్యాలయం కూడా ఈ వివాదంపై స్పందించడానికి నిరాకరిస్తోంది.

తోడుగా భర్త హాకోన్
తన భార్యపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా యువరాజు హాకోన్ ఆమె వెంటే నిలబడ్డారు. పెళ్లి అంటే కష్టసుఖాల్లో తోడుండటమేనని ఆయన అంటున్నారు. మెట్టె మారిట్ చాలా తెలివైనది… బలమైనదని ఆయన కితాబు ఇచ్చారు. ఆమెకు ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా త్వరలో అవయవ మార్పిడి అవసరమయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఆరోగ్యం.. మరోవైపు కోర్టు కేసులు రాజకుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *