- సింగర్ క్షమాపణ… నోరా ఫతేహీ ఆగ్రహం
- అసభ్యకర హిందీ సాహిత్యంపై విమర్శలు
- ఏఐ ఫోటోల వివాదం… పాన్ ఇండియా రచ్చ
సహనం వందే, హైదరాబాద్:
గ్లామర్ ముసుగులో కళాకారుల ప్రతిష్టను పణంగా పెడుతున్న చిత్ర పరిశ్రమ పోకడలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కేడి ది డెవిల్ సినిమాలోని ఒక పాట భాషా సరిహద్దులు దాటి అశ్లీలతకు కేరాఫ్ అడ్రస్‌గా మారడంతో నటీనటులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఇది కేవలం అనువాద పొరపాటు కాదు… మార్కెట్ కోసం నైతికతను విస్మరించిన వైనంగా కనిపిస్తోంది.
వివాదానికి వేదికైన కేడి
ధ్రువ సర్జా కథానాయకుడిగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం కేడి ది డెవిల్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో అర్జున్ జన్య సంగీత సారథ్యంలో రూపొందిన ‘సర్కే చునర్ తేరి సర్కే’ అనే పాట పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. ఏప్రిల్ 30వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల కోసం వదిలిన ఈ స్పెషల్ సాంగ్ అభాసుపాలైంది. బూతు పంచాంగంతో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు రావడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది.

వెనక్కి తగ్గిన మంగ్లీ
జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ఈ వివాదంపై బహిరంగంగా స్పందించారు. అశ్లీలత ఎక్కువగా ఉందన్న ఆరోపణలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఈ పాటను ఇప్పటికే డిలీట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మంగ్లీ అందరికీ క్షమాపణలు చెప్పారు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన పొరపాటని ఆమె వివరించారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పు మళ్లీ పునరావృతం కాదని హామీ ఇచ్చారు.
నోరా ఫతేహీ ఆవేదన
బాలీవుడ్ డ్యాన్సర్ నోరా ఫతేహీ ఈ వివాదంపై తన మౌనాన్ని వీడారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా హిందీ సాహిత్యం ఉండటంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో కన్నడ భాష తెలియకపోవడం వల్ల మేకర్స్ చెప్పిన అర్థాన్ని నమ్మి నటించానని ఆమె వాపోయారు. కానీ హిందీ వెర్షన్ విన్నాక అందులోని అశ్లీలత చూసి షాక్ అయ్యానని చెప్పారు. మూడేళ్ల క్రితం షూట్ చేసిన ఈ పాట విషయంలో తన అనుమతి లేకుండా అసభ్యకరమైన పదాలను వాడారని ఆమె ఆరోపించారు.
ఏఐ ఫోటోల దారుణం
టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ తన అనుమతి లేకుండా ఏఐ ఫోటోలను వాడటంపై నోరా మండిపడ్డారు. సినిమాలో సంజయ్ దత్, తన ఫోటోలను ఏఐ సాంకేతికతతో అసహజంగా సృష్టించారని ఆమె వెల్లడించారు. తాను మొదటి నుంచీ ఏఐ వినియోగానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. సినిమా ఈవెంట్లలో తన ఫోటోలను చూసి లోలోపల చాలా ఆందోళన పడ్డానని చెప్పారు. పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేని నటీనటుల అభిప్రాయాలకు పరిశ్రమలో విలువ ఉండటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
డైరెక్టర్ కు ముందే హెచ్చరిక
హిందీ రాప్ విన్నప్పుడే విమర్శలు వస్తాయని తనకు అర్థమైందని నోరా పేర్కొన్నారు. ఈ విషయంపై దర్శకుడిని ముందే హెచ్చరించినా వారు పెడచెవిన పెట్టారని తెలిపారు. అందుకే తాను సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్లు వివరించారు. కేవలం సంజయ్ దత్ లాంటి ఐకాన్ ఉండటం వల్లే ఈ ప్రాజెక్ట్ చేశానని చెప్పారు. ప్రజల ఆగ్రహం వల్లే పాటను తొలగించారని ఆమె అభిప్రాయపడ్డారు.
బాధ్యత ఎవరిదన్న ప్రశ్న
వివాదం రేగినప్పుడు కేవలం నటీనటులను మాత్రమే లక్ష్యం చేయడం సరికాదని నోరా సూచించారు. ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్ సృష్టించే ఫిల్మ్ మేకర్లను కూడా బాధ్యులను చేయాలని కోరారు. అప్పుడే పరిశ్రమలో జవాబుదారీతనం వస్తుందని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంగ్లీ, నోరా ఫతేహీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.