- నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల
- హిందీతో పాటు తెలుగు భాషలోనూ రిలీజ్
- అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్… ఆదిత్య మ్యాజిక్
- దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదుల ప్రస్తావన
- నాలుగు గంటల సినిమా అయినా ఉత్కంఠ
సహనం వందే, హైదరాబాద్:
భారతీయ సినీ చరిత్రలో రణవీర్ సింగ్ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ సినిమా సీక్వెల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మొదటి భాగం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ఉగాది కానుకగా గురువారం విడుదలవుతున్న తరుణంలో ముందస్తు రివ్యూ విశేషాలు.
ముందస్తు షోల హడావుడి
దురంధర్ 2 సినిమా విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉగాది సందర్భంగా నేడు ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఒకరోజు ముందుగానే హిందీ షోలు దేశవ్యాప్తంగా ప్రదర్శితమయ్యాయి. అయితే తెలుగు, తమిళ వర్షన్ల కంటెంట్ డెలివరీలో ఆలస్యం జరిగింది. దీనివల్ల దక్షిణాదిలో ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. ఇది అభిమానులకు నిరాశ కలిగించినా హిందీ టాక్ మాత్రం అదిరిపోయింది.

హీరో ఎలివేషన్ అదిరింది
కథ విషయానికి వస్తే జస్‌ప్రీత్ సింగ్ రంగీ పాత్రలో రణవీర్ సింగ్ జీవించేశాడు. భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన జస్‌ప్రీత్ అక్కడ హంజా అలీగా మారతాడు. మొదటి భాగంలో రెహమాన్ డికాయిట్‌ను అంతమొందించిన తీరు చూపించారు. రెండో భాగంలో అసలు అతను ఈ ఆపరేషన్ లోకి ఎలా వచ్చాడో వివరించారు. ఈ ప్రయాణం చాలా ఉత్కంఠభరితంగా సాగింది.
కరాచీ డాన్ హవా
హంజా అలీ పాత్ర ల్యారీ నుంచి కరాచీ వరకు ఎలా ఎదిగిందో దర్శకుడు బాగా చూపించాడు. అక్షయ్ ఖన్నా గ్యాంగ్‌లో చేరి చివరకు ఆ స్థానాన్ని హంజా ఎలా దక్కించుకున్నాడో చూడాలి. అర్షద్ పప్పు పాత్రను అశ్విన్ ధర్ పోషించగా అతన్ని చంపే సీన్లు ఉత్కంఠ రేపుతాయి. దుబాయ్‌లో ఉజైర్‌ను తప్పుడు కేసులో ఇరికించే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
ఐఎస్ఐ ప్లాన్లను తిప్పికొట్టడంలో ధైర్యం…
ఐఎస్ఐ ప్లాన్లను తిప్పికొట్టడంలో హంజా చూపే ధైర్యం ప్రేక్షకులను మెప్పిస్తుంది. అర్జున్ రాంపాల్ పోషించిన మేజర్ ఇక్బాల్ పాత్ర సినిమాకు బలాన్ని ఇచ్చింది. హంజా అసలు రంగు బయటపడినప్పుడు వచ్చే సన్నివేశాలు రోమాంచితంగా ఉన్నాయి. సంజయ్ దత్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి థియేటర్లలో అరుపులు వినిపించాయి. మాధవన్, గౌరవ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సినిమా నిడివి 4 గంటలు…
ఆదిత్య ధర్ గతంలో ఉరి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దురంధర్ మొదటి భాగం ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు రెండో భాగంలో కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అయింది. సినిమా నిడివి 4 గంటలు ఉన్నా ఎక్కడా బోర్ కొట్టదు. వికాస్ సినిమాటోగ్రఫీ, ఓజెస్ గౌతమ్ శివకుమార్ స్క్రీన్ ప్లే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం…
శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. మొదటి పావుగంటలో భారీ రక్తపాతం ఉన్నా తర్వాత కథ ఎమోషనల్‌గా సాగుతుంది. దావూద్ ఇబ్రహీం, బాంబు పేలుళ్ల సూత్రధారుల ప్రస్తావన జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. 3.25 రేటింగ్‌తో ఈ సినిమా పూర్తి పైసా వసూల్ ఎంటర్టైనర్‌గా నిలిచింది.